101 జిల్లాల అంద‌గాడికి మాయావి చేసిన‌ సాయం

Update: 2021-08-27 14:30 GMT
ప‌రిమిత బ‌డ్జెట్ లో ఎంత గొప్ప సినిమా తీసినా జ‌నాల్లోకి వెళ్లాలంటే దానికి ప్ర‌చారం చాలా ముఖ్యం. అప్పుడే ఆ సినిమా స‌గ‌టు ప్రేక్ష‌కుడికి రీచ్ అవుతుంది. సోష‌ల్ మీడియాల ప్ర‌చారం కొంత‌వ‌ర‌కూ సాయ‌మ‌వుతున్నా.. అన్ని మాధ్య‌మాల్లో ప్ర‌చారం అవ‌స‌రం. రిలీజ్ డే హిట్ టాక్ తెచ్చుకుంటే  మంచి వ‌సూళ్ల‌కు ఆస్కారం క‌లుగుతోంది. న‌వ‌త‌రం ద‌ర్శ‌క‌ నిర్మాత‌లు ముంద‌స్తు ప్ర‌చారంతో కొంత‌ ప‌బ్లిసిటీని గెయిన్ చేస్తున్నారు. ఇటీవ‌ల `ఇచ‌ట వాహ‌నాలు నిలుప‌రాదు` ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజ‌రైన ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ వేదిక‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

సినిమా ఫంక్ష‌న్ కి హాజ‌రైన యాంక‌ర్ సుమ‌పై పంచ్ లు విసిరిన ఆయ‌న‌.. సుశాంత్ ట్యాలెంట్ పైనా అదే స‌మ‌యంలో అవ‌స‌రాల శ్రీనివాస్ గురించి సుమ‌తో మాట‌ల మాంత్రికుడు జ‌రిపిన సంభాష‌ణ‌లు ఎంతో ఆస‌క్తిక‌రంగా మారాయి. వేదిక‌పై ఇది హైలైట్ అయింది. స‌రిగ్గా ఇదే వీడియో క్లిప్పింగ్ ని `101 జిల్లాల అంద‌గాడు` నిర్మాత‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తూ త‌మ సినిమాని ప‌బ్లిసిటీ చేసుకుంటున్నారు. ఒకే ఈ వెంట్ కు హాజ‌రై ఏకంగా రెండు సినిమాల‌కు త్రివిక్ర‌మ్ ప‌బ్లిసిటీ క‌ల్పించిన‌ట్లు తెలుస్తోంది. నిర్మాత‌లు తెలివిగా ఆ  క్లిప్పింగ్ ని ప్ర‌మోష‌న‌ల్  కోణంలో వినియోగిస్తున్నారు. అయితే దీనిపై సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల కామెంట్లు ప‌డుతున్నాయి.

కామెంట్ పాజిటివా నెగెటివా? అన్న‌ది అటుంచితే ఆ ర‌కంగా కూడా మంచి ప‌బ్లిసిటీ వ‌స్తోంది. మొత్తానికి ఒక్క దెబ్బ‌కి రెండు పిట్ట‌లు అన్న చందంగా త్రివిక్ర‌మ్ ఎంట్రీ తో రెండు సినిమాల‌కు ల‌క్ష‌ల్లో క‌లిసొచ్చే ఉచిత‌ ప‌బ్లిసిటీ దొరికిన‌ట్లే అయింది. సుశాంత్ ఇంత‌కుముందు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమాతో ఇద్ద‌రూ మంచి స్నేహితులుగా మారారు. సుశాంత్ లో మంచి న‌టుడున్నాడ‌ని త్రివిక్ర‌మ్ ప్ర‌శంసించిన సంగ‌తి తెలిసిందే. ఆ కార‌ణంగానే `ఇచ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు` ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్పెష‌ల్ గెస్ట్ గా హాజ‌ర‌య్యారు.

ఎక‌రంన్న‌ర కోల్పోయిన అంద‌గాడి క‌థ

కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్య‌మైన కాన్సెప్టుల్ని ఎంచుకుని న‌టుడిగా ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌గా స‌త్తా చాటుతున్నారు అవ‌సరాల శ్రీ‌నివాస్. సెన్సిబుల్ కామెడీ సున్నిత ఉద్వేగాలు ఉన్న క‌థ‌ల్లో న‌టించి త‌నకంటూ ఒక ప్ర‌త్యేక‌త ఉంద‌ని నిరూపించాడు. అందుకే ఇప్పుడు అత‌డు బ‌ట్ట త‌ల కాన్సెప్ట్ తో మ‌రో విభిన్న‌మైన ప్ర‌య‌త్నం చేస్తున్నాడు అన‌గానే ఒక‌టే ఆస‌క్తి నెల‌కొంది.

101 జిల్లాల అంద‌గాడు అన్న టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్ ని ఇంత‌కుముందు లాంచ్ చేయ‌గా అది వైర‌ల్ అయ్యింది. టైటిల్ కి అవ‌స‌రాల బ‌ట్ట‌త‌ల బోయ్ లుక్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ఈ సినిమాకి స్క్రిప్టు అందించ‌డ‌మే గాక‌.. అదిరిపోయే పంచ్ డైలాగుల్ని అవ‌స‌రాల అందించారు. దిల్ రాజు- క్రిష్ జాగ‌ర్ల‌మూడి స‌మ‌ర్ప‌ణ‌లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. రాచ‌కొండ విద్యాసాగ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌- ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  శిరీష్- రాజీవ్ రెడ్డి- సాయి బాబు జాగ‌ర్ల‌మూడి నిర్మాత‌లు. ఈ చిత్రంలో అవ‌స‌రాల శ్రీనివాస్ గొత్తి సూర్య నారాయ‌ణ అనే పాత్ర‌లో న‌టిస్తున్నారు. రుహ‌నీ శ‌ర్మ క‌థానాయిక‌.

ఇంత‌కుముందు ఉగాది పోస్ట‌ర్ ని లాంచ్ చేయ‌గా ఆక‌ట్టుకుంది. ట‌క్కు టై తో ఫార్మ‌ల్ లుక్ లో ఇస్మార్ట్ గా క‌నిపిస్తున్న  గొత్తి సూర్య‌నారాయ‌ణ గుట్టంతా ఆ అద్దంలో తెలిసిపోతే ఆ బాధ వ‌ర్ణ‌నాతీతం. ఎంత దాచాల‌న్నా దాగ‌నిది బ‌ట్ట‌త‌ల అని అంద‌రికీ అర్థ‌మైపోతోంది. ఎక‌రంన్న‌ర కోల్పోయిన కుర్రాడి క‌థ‌తో అవ‌స‌రాల అద్భుతాలు చేస్తాడ‌నే అంచ‌నాలేర్ప‌డుతున్నాయి. రామ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి శ‌క్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Tags:    

Similar News