ఇటు నుంచి నరుక్కోద్దామని దిగాడా?
ఇటీవలే స్వరమాత్రికుడు ఏ.ఆర్ రహమాన్ బాలీవుడ్ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే.;
ఇటీవలే స్వరమాత్రికుడు ఏ.ఆర్ రహమాన్ బాలీవుడ్ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే. గత ఎనిమిదేళ్లుగా బాలీవుడ్‌లో తనకు పెద్దగా పని దొరకడం లేదని, బహుశా దీనికి మతపరమైన కారణా లు ఉండొచ్చన్నారు. అంతే కాదు సృజనాత్మకత లేని వారి చేతిలో అధికారం ఉందంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో బాలీవుడ్ ఒక్కసారిగా దుమ్మెత్తి పోసింది. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు పని చేసిన రెహమాన్ కు ఇప్పుడే మతం గుర్తొచ్చిందా? ఇప్పటి వరకూ ఏ కారణంగా బాలీవుడ్ సినిమాలకు పని చేసాడు? అంటూ ప్రశ్ని స్తున్నారు.
దీనికి సంబంధించి రెహమాన్ వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేసారు. తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్దం చేసుకున్నారని..తన ఉద్దేశం అది కాదంటూ కవర్ చేసే ప్రయత్నం చేసారు. ఇలా బాలీవుడ్ పై రెహమాన్ కు తీవ్ర అసంతృప్తి ఉందన్నది క్లియర్. తనని పక్కన బెట్టి ఇతరులకు అవకాశాలు ఇవ్వడం పట్ల తానెంత మాత్రం సంతోషంగా లేరు. ఇప్పుడు అదే కసి పట్టుదలతో రెహమాన్ తెలుగు సినిమాలకు పనిచేస్తున్నారా? అన్న సందేహం తాజాగా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రెహమాన్ ...రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న `పెద్ధి` చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే రిలీజ్ అయిన `చికిరి చికిరి` సాంగ్ కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఆ పాటకు అన్ని భాషల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రెహమాన్ ఈజ్ బ్యాక్ అనిపించాడు. పాట విషయంలో చరణ్ సైతం చాలా సంతోషంగా ఉన్నాడు. అయితే ఇదే రెహమాన్ గతంలో చిరంజీవి సినిమాకు ( సైరా నరసింహారెడ్డి) సంగీతం వహించమని అవకాశం ఇస్తే వద్దని వదిలేసాడు. ముందు పని చేస్తానని..ఆ తర్వాత తన బిజీ షెడ్యూల్ కారణంగా చేయలేనంటూ తప్పుకున్నాడు. అప్పుడు తప్పుకున్న రెహమాన్ మళ్లీ ఇప్పుడు తనయుడు రామ్ చరణ్ సినిమా తోనే టాలీవుడ్ లో కంబ్యాక్ అవుతున్నారు.
ఈ కమిట్ మెంట్ వెనుక రెహమాన్ పొలిటికల్ స్ట్రాటజీ ఉందా? అన్న సందేహం కూడా వ్యక్తమవుతుంది. ప్రస్తుతానికి బాలీవుడ్ లో రెహమాన్ కి అవకాశాలు రాలేదన్నది ఓపెన్ సీక్రెట్. తిరిగి అక్కడ అవకాశాలు దక్కించుకోవాలంటే తన బ్రాండ్ మళ్లీ పడితే తప్ప సాధ్యం కాదు. కానీ అక్కడ ప్రూవ్ చేసుకునే అవకాశం కూడా రెహమాన్ కి రావడం లేదు. ఈ క్రమంలో రెహమాన్ `పెద్ది` కి కమిట్ అయినట్లు తెలుస్తోంది. `పెద్ది` పాన్ ఇండియా ప్రాజెక్ట్. ప్రస్తుతం తెలుగు సినిమాకు పాన్ ఇండియాలో ఎలాంటి ఇమజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు.
ప్రత్యేకించి బాలీవుడ్ లో తెలుగు సినిమా సత్తా చాటుతోన్న తరుణం ఇది. బాలీవుడ్ నే తెలుగు హీరోలు రూల్ చేస్తున్నారు. అలాంటి తెలుగు సినిమా సక్సెస్ తో హిందీ మార్కెట్ లో మళ్లీ రెహమాన్ బ్రాండ్ పడితే అది వేరే లెవల్లో ఉంటుంది. పైగా రామ్ చరణ్ ఇమేజ్ `ఆర్ ఆర్ ఆర్` తో ఏకంగా దేశాలే దాటిపోయింది. బాలీవుడ్ సహా హాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రేజ్ నే రెహమాన్ తెలివిగా తన కంబ్యాక్ కోసం ఇలా ప్లాన్ చేసాడా? అన్న సందేహం చాలా మంది ఉంది.