సంబంధం లేనివాళ్లు సంగీతంలో వేలు పెడతారు: గాయకుడు శంకర మహదేవన్
స్వరమాంత్రికుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల హిందీ చిత్ర పరిశ్రమపై `మతవివక్ష` వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.;
స్వరమాంత్రికుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల హిందీ చిత్ర పరిశ్రమపై `మతవివక్ష` వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పుడు పెద్ద డిబేట్ నడుస్తోంది. చాలా మంది రెహమాన్ సహచరులు ఈ అంశంపై స్పందించారు. కొందరు రెహమాన్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పడితే, మరికొందరు బాలీవుడ్ ఇంటర్నల్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు. రెహమాన్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ స్పందించారు. ఈ వివాదంపై ఆయన ఒక విభిన్నమైన, లోతైన విశ్లేషణను అందించారు.
ఆయన ప్రకారం.. పరిశ్రమ రెండు వర్గాలుగా విడిపోయింది. ఒకటి ''మ్యూజికల్ టీమ్-సంగీతాన్ని సృష్టించేవారు''. రెండోది ''నాన్ మ్యూజికల్ టీమ్- ఆ సంగీతం భవిష్యత్తును నిర్ణయించేవారు''. అసలు క్రియేటివిటీ మ్యాటర్ లో నిర్ణయాధికారం ఎవరిది?.. సంగీతాన్ని సృష్టించే వ్యక్తి ఒకరైతే.. ఆ సంగీతానికి ఏమవ్వాలి? అది ఎలా విడుదలవ్వాలి? అనేది నిర్ణయించేది మరొక టీమ్. దురదృష్టవశాత్తూ మన క్రియేటివిటీ సంగీతంతో సంబంధం లేని వ్యక్తుల చేతుల్లో ఉంటుంది! అని ఆయన వ్యాఖ్యానించారు.
రెహమాన్ అన్నట్లుగా సృజనాత్మకత లేని వ్యక్తులు అధికారంలో ఉన్నారనే మాటను ఆయన పరోక్షంగా సమర్థించారు. క్రియేటర్ల కంటే మ్యూజిక్ కంపెనీలు, మార్కెటింగ్ టీమ్‌లే ఎక్కువగా `మ్యూజిక్` విధిని శాసిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
అసలు రెహ్మాన్ వివాదం ఎలా మొదలైంది?
ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గత 8 ఏళ్లుగా హిందీలో తనకు అవకాశాలు తగ్గడానికి `పవర్ షిఫ్ట్` (అధికార కేంద్రాలు మారడం) ఒక కారణమని రెహమాన్ ఆవేదన చెందారు. సృజనాత్మకత లేని వ్యక్తుల చేతుల్లోకి నిర్ణయాధికారం వెళ్ళిందని, అందులో `మతపరమైన వివక్ష` కూడా ఒక కోణం అయి ఉండవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వివక్ష తన ముఖంపైనే నేరుగా ఎప్పుడూ జరగలేదని, కానీ ఇండస్ట్రీలో వినపడే గుసగుసల ద్వారా తనకు తెలిసిందని ఆయన పేర్కొన్నారు.
శంకర్ మహదేవన్ దీనిని ఒక వ్యవస్థాగత సమస్యగా చూస్తుండగా, ఇతర సెలబ్రిటీలు భిన్నంగా స్పందించారు. అయితే ఖాన్ ల త్రయం (షారుఖ్, సల్మాన్, ఆమిర్) దశాబ్దాలుగా ఇక్కడ సూపర్ స్టార్లుగా ఉన్నప్పుడు మత వివక్ష ఎలా ఉంటుంది? అని గాయకుడు షాన్ ప్రశ్నించారు. రెహమాన్ వ్యాఖ్యలను క్వీన్ కంగన తీవ్రంగా తప్పుబడుతూ ఆయనకే పక్షపాతం ఉందని, తన ఎమర్జెన్సీ సినిమాని ప్రొపగండా మూవీగా భావించి తనను దూరం పెట్టారని విమర్శించారు. ప్రముఖ రచయితలు జావేద్ అక్తర్ సహా పలువురు రెహమాన్ వ్యాఖ్యలను తప్పు పట్టారు. అయితే శంకర్ మహదేవన్ మాత్రం ఈ వివాదానికి మతం కంటే సృజనాత్మక వ్యక్తులు వర్సెస్ వ్యాపారుల కోణం జోడించి కొత్తగా ఆలోచించి తన ధృక్పథాన్ని వివరించారు. అప్పుడప్పుడు ఇలాంటి డిబేట్లు నడవడం వల్లనే చాలా నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి రెహమాన్ మంచి టాపిక్ నే తెరపైకి తెచ్చారనుకోవాలి.