చరణ్ రాడు.. మరి వాడుకునేదెవరు?

ఏప్రిల్ 30.. మిడ్ సమ్మర్లో క్రేజీ డేట్. ఒకప్పుడు ఇలాంటి డేట్ దొరికితే అదృష్టం అనే అనుకునేవారు.;

Update: 2026-04-16 00:30 GMT

ఏప్రిల్ 30.. మిడ్ సమ్మర్లో క్రేజీ డేట్. ఒకప్పుడు ఇలాంటి డేట్ దొరికితే అదృష్టం అనే అనుకునేవారు. కాకపోతే ఐపీఎల్ మేనియా పెరిగిపోయి.. సమ్మర్లో జనం ఒకప్పట్లా థియేటర్లకు రావడం తగ్గిపోయి.. రిలీజ్ డేట్ కోసం ఎగబడే రోజులు ఇప్పుడు లేవు. అలా అని పూర్తిగా డిమాండ్ లేకుండా ఏమీ లేదు. ఈసారి ‘పెద్ది’ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాన్ని ఈ డేట్‌లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ గత కొన్ని వారాలుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ ఈ సినిమాను వాయిదా వేసేశారు.

‘పెద్ది’ జూన్‌లో రాబోతోంది. మరి ఈ సినిమా ఖాళీ చేసిన డేట్‌ను ఎవరు వాడుకుంటారన్నది ఆసక్తికరం. ఆల్రెడీ మే 1కి తరుణ్ భాస్కర్ సినిమా ‘గాయపడ్డ సింహం’ను షెడ్యూల్ చేశారు. ఆ సినిమాకు డేట్ ఇచ్చినపుడే కండిషన్స్ అప్లై అన్నారు. ‘పెద్ది’ రాకపోతేనే ఆ సినిమా ఆ రోజు రిలీజవుతుందని డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు స్పష్టం చేశాడు. ఇప్పుడు చరణ్ సినిమా రాదని తేలిపోయింది కాబట్టి ‘గాయపడ్డ సింహ’ ఆ డేటుకే రానున్నట్లే.

కానీ ఆ క్రేజీ వీకెండ్లో ఇంకా ఒకట్రెండు చిన్న, మిడ్ రేంజ్ సినిమాలను రిలీజ్ చేసేందుకు ఆస్కారం ఉంది. ఇంతకుముందు మే 1కే ‘లెనిన్’ సినిమాను షెడ్యూల్ చేశారు. కానీ ‘పెద్ది’ కోసమని ఆ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఐతే షూటింగ్ పూర్తి కాకే అఖిల్ సినిమాను వాయిదా వేస్తున్నారని.. అంతే తప్ప చరణ్ కోసం త్యాగం ఏమీ లేదని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడు చరణ్ సినిమా వాయిదా పడ్డ నేపథ్యంలో ‘లెనిన్’ను ఏం చేస్తారన్నది ఆసక్తికరం. ఆ సినిమా ఏప్రిల్ 30న వచ్చే అవకాశం లేదన్నది స్పష్టం.

ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కచ్చితంగా ‘లెనిన్’ నిర్మాత నాగవంశీని టార్గెట్ చేస్తారనడంలో సందేహం లేదు. మరోవైపు ‘పెద్ది’ వాయిదా అని మొదటిసారి ప్రచారం జరిగినపుడు నిఖిల్ పాన్ ఇండియా మూవీ ‘స్వయంభు’ కోసం ఏప్రిల్ 30 డేట్‌ను పరిశీలించారు. కానీ దీని పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ అంతా పూర్తి చేసి ఆ డేట్‌కు రిలీజ్ చేయడం అంత తేలిక కాదు. మరి ఇప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని ఏప్రిల్ 30కి రిలీజ్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తారేమో చూడాలి. మరోవైపు సమంత సినిమా ‘మా ఇంటి బంగారం’ను మే 15 నుంచి ప్రి పోన్ చేసే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం.

Tags:    

Similar News