బెంగాలీ సినిమా మరణావస్థలో ఉంది: అపర్ణా సేన్ సంచలన వ్యాఖ్యలు

అపర్ణా సేన్ ప్రధానంగా టెలివిజన్ సీరియళ్ల ప్రభావంపై ఆందోళ‌న వ్య‌క్తం చేసారు. ప్రస్తుతం బెంగాల్‌లోని మెజారిటీ ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేసి.. కేవలం టీవీ సీరియళ్లకే పరిమితమైపోయారని ఆమె పేర్కొన్నారు.;

Update: 2026-04-06 22:30 GMT

భారతీయ చలనచిత్ర చరిత్రలో బెంగాలీ సినిమాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సత్యజిత్ రే, మృణాల్ సేన్ వంటి దిగ్గజాలు నడిచిన ఈ నేల ఇప్పుడు కళాత్మక సంక్షోభంలో కూరుకుపోయిందని ప్రముఖ నటి, జాతీయ అవార్డు గ్రహీత దర్శకురాలు అపర్ణా సేన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బెంగాలీ చిత్ర పరిశ్రమ `మరణావస్థ`లో ఉందని, దీనిని గట్టెక్కించడం అంత సులభం కాదని సేన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఒకప్పుడు మేధోపరమైన ఆలోచనలకు.. సామాజిక విశ్లేషణలకు వేదికైన బెంగాలీ వెండితెర.. నేడు తన ఉనికిని కోల్పోతోందని ఈ వెట‌ర‌న్ ద‌ర్శ‌కురాలు విశ్లేషించారు.

అపర్ణా సేన్ ప్రధానంగా టెలివిజన్ సీరియళ్ల ప్రభావంపై ఆందోళ‌న వ్య‌క్తం చేసారు. ప్రస్తుతం బెంగాల్‌లోని మెజారిటీ ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేసి.. కేవలం టీవీ సీరియళ్లకే పరిమితమైపోయారని ఆమె పేర్కొన్నారు. సీరియళ్లలో ఉండే నాటకీయత, రొటీన్ కథాంశాలకు అలవాటు పడిన ప్రేక్షకులు.. సినిమాల్లో వైవిధ్యం ఉన్నా ఆదరించడం లేదని ఆరోపించారు. దీనివల్ల కంటెంట్ నాణ్యత దెబ్బతినడమే కాకుండా.. సినిమా అనేది ఒక కళారూపంగా తన ప్రాధాన్యతను కోల్పోతోందని హెచ్చరించారు.

ఆర్థిక పరంగా కూడా బెంగాలీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. సరైన వసూళ్లు లేకపోవడంతో నిర్మాతలు కొత్త ప్రయోగాలు చేయడానికి వెనుకాడటం... బడ్జెట్ పరిమితుల వల్ల దర్శకులు తమ సృజనాత్మకతను పూర్తిగా ప్రదర్శించలేకపోవడం వంటివి పరిశ్రమను మరింత వెనక్కి నెడుతున్నాయి. మునుపటిలా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే `స్టార్ పవర్` నేటి నటుల్లో తగ్గడం.. దానికి తోడు అనేక సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడటం బెంగాలీ సినిమా పతనానికి ప్రధాన కారణాలుగా సేన్ వివరించారు.

డిజిటల్ విప్లవం.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల రాకతో వినోదం ఇంటి వద్దకే చేరుకుంది. దీనివల్ల ఇతర భాషా చిత్రాలతో పోటీ పడటంలో బెంగాలీ సినిమాలు వెనుకబడిపోతున్నాయి. మార్కెటింగ్ వ్యూహాల లోపం, మౌళిక సదుపాయాల కొరత వల్ల మేకర్స్ కొత్త తరం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా యువ దర్శకులకు సరైన ప్రోత్సాహం అందకపోవడం.. కేవలం ఫార్ములా సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కథాబలం క్షీణిస్తోందని అపర్ణా సేన్ విమర్శించారు.

మొత్తానికి బెంగాలీ సినిమా తన పూర్వవైభవాన్ని తిరిగి సంపాదించుకోవాలంటే పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని అప‌ర్ణాసేన్ పిలుపునిచ్చారు. కేవలం సాంకేతిక మార్పులే కాకుండా కథల ఎంపికలో .. మేకింగ్‌లో విప్లవాత్మక మార్పులు రావాలని ఆశించారు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో చొరవ తీసుకుని ప్రాంతీయ సినిమా సంస్కృతిని కాపాడాలని సేన్ కోరారు. సత్యజిత్ రే వంటి మహనీయుల వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందని అపర్ణా సేన్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News