అనుష్క సినిమాలకు రెడీమేడ్ మార్కెట్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి బాహుబలి2 తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తుందనుకుంటే ఎవరూ ఊహించని విధంగా సైలెంట్ అయింది;
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి బాహుబలి2 తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తుందనుకుంటే ఎవరూ ఊహించని విధంగా సైలెంట్ అయింది. అప్పుడో సినిమా అప్పుడో సినిమా చేస్తూ నేనొక దాన్ని ఉన్నానంటూ గుర్తు చేస్తుంది తప్పించి వరుసగా అయితే సినిమాలు చేయడం లేదు. అనుష్క నుంచి ఆఖరిగా సినిమా వచ్చి కూడా రెండేళ్లవుతోంది.
నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనుష్క ఆ తర్వాత కూడా వరుస సినిమాలు చేయలేదు. 2023లో వచ్చిన ఆ సినిమా తర్వాత అనుష్క ఒప్పుకున్న సినిమాలు రెండే. అందులో తెలుగు సినిమా ఘాటీ ఒకటి కాగా, రెండోది కథనర్ అనే మలయాళ సినిమా. ఈ రెండు సినిమాల్లో ఇప్పుడు అనుష్క ఘాటి సినిమాతో జులై 11న తిరిగి వెండితెరపై మెరవనుంది.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాతో అనుష్క సోలో హీరోయిన్ గా మరోసారి తన సత్తా చాటడంతో పాటూ, తన ట్రేడ్ మార్క్ మార్కెట్ ను కూడా తిరిగి క్రియేట్ చేస్తుందని అందరూ భావిస్తున్నారు. అనుష్క ఆల్రెడీ హీరో స్టేటస్ ను సంపాదించిందని, టాలీవుడ్ లో ఒకప్పుడు మార్కెట్ వాల్యూతో పాటూ ప్రేక్షకుల గౌరవాన్ని అందుకున్న అలనాటి నటి విజయశాంతితో పోల్చదగిన ఏకైక నటి అనుష్క మాత్రమే అని ఆమెతో గతంలో వర్క్ చేసిన నిశ్శబ్ధం డైరెక్టర్ హేమంత్ మధుకర్ అన్నాడు.
ఇండస్ట్రీలో ఆమె సినిమాలకు చిన్న గ్యాప్ వచ్చినా అనుష్క విషయంలో ఆడియన్స్ అవేమీ పట్టించుకోరని, అనుష్క ఎప్పటికీ తెలుగు ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తూనే ఉంటుందని అన్నాడు. ఘాటీ సినిమాలో అనుష్క డార్క్ షేడ్స్ ఉన్న పాత్రలో చాలా కొత్తగా కనిపిస్తుందని, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేటప్పుడు డైరెక్టర్లకు ఎమోషన్స్ ను ఎక్కువగా చూపించే వీలుంటుందని, మేల్ సెంట్రిక్ సినిమాలు ఎక్కువగా యాక్షన్, లవ్ స్టోరీ చుట్టూ తిరుగుతుంటాయని హేమంత్ మధుకర్ చెప్పాడు.
అనుష్కతో పాటూ ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆడియన్స్ ను అలరించాలని పలువురు హీరోయిన్లు ప్రయత్నించారని, కానీ అందరూ ఇందులో సక్సెస్ అవలేరని, అనుష్క ఈ విషయంలో ప్రతీసారీ సక్సెస్ అయ్యారని మధుకర్ చెప్పాడు. కమర్షియల్ గా ఇప్పటికీ అనుష్కకు రూ.20 కోట్ల మార్కెట్ ఉందని, ఎంత గ్యాప్ తర్వాత వచ్చినా కూడా ఆమె సినిమాలకు కొంత రెడీమేడ్ మార్కెట్ ఉంటుందని, ఆమె గ్యాప్ తీసుకుని వచ్చిన ప్రతీసారీ ఆడియన్స్ ఆమెను చూడ్డానికి థియేటర్లకు క్యూలు కడతారని మధుకర్ ఈ సందర్భంగా చెప్పాడు.