క‌ష్ట‌కాలంలో ద‌క్షిణాది ఆదుకుంటోంది.. ద‌ర్శ‌కుడు ఎమోష‌న‌ల్..

కార్పొరెట్ తో ముడిప‌డిన చాలా విష‌యాలు క్రియేట‌ర్ల‌లో గంద‌ర‌గోళం సృష్టిస్తాయి. సృజ‌నాత్మ‌క స్వేచ్ఛ‌ను ఇవ్వ‌ని వినోద‌ ప‌రిశ్ర‌మ గంద‌ర‌గోళంతో స‌మానం;

Update: 2025-09-21 16:30 GMT

కార్పొరెట్ తో ముడిప‌డిన చాలా విష‌యాలు క్రియేట‌ర్ల‌లో గంద‌ర‌గోళం సృష్టిస్తాయి. సృజ‌నాత్మ‌క స్వేచ్ఛ‌ను ఇవ్వ‌ని వినోద‌ ప‌రిశ్ర‌మ గంద‌ర‌గోళంతో స‌మానం. అలాంటి స‌మ‌స్యాత్మ‌క‌ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు తాను బాలీవుడ్ ని వ‌దిలేసాన‌ని చెబుతున్నారు అనురాగ్ క‌శ్య‌ప్. ముంబై ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కు సృజ‌నాత్మ‌క స్వేచ్ఛ లేద‌ని చాలాసార్లు అత‌డు ఆరోపించాడు. క్రియేట‌ర్ల‌ను వారి ప‌ని వారిని చేయ‌నివ్వ‌రు ఇక్క‌డ‌. హిందీ చిత్ర‌సీమ‌లో వేగం, క‌లుషిత వాతావ‌ర‌ణం గురించి అత‌డు ప‌దే ప‌దే బ‌హిరంగంగా వ్యాఖ్యానిస్తున్నాడు. అన‌ధికారికంగా బాలీవుడ్ నుంచి నిషేధానికి గురైన విష‌యాన్ని కూడా అతడు చూఛాయ‌గా ప్ర‌స్థావించాడు.

సౌత్ తో అనుబంధం పెరిగింది:

ఇలాంటి స‌మ‌యంలో అతడు ముంబై వ‌దిలి బెంగ‌ళూరుకు వ‌చ్చేసాడు. ఇక్క‌డి నుంచి క‌న్న‌డ సినీరంగం స‌హా ఇత‌ర సౌత్ సినీ రంగాల‌తో అత‌డు స‌త్సంబంధాల‌ను కొన‌సాగిస్తున్నాడు. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ చిత్రాల్లో న‌టించేందుకు, సినిమాలు తీసేందుకు ఉన్న అన్ని అవ‌కాశాల‌ను వెతుకుతున్నాడు.

నా జీవితంలో క‌ష్ట‌మైన ద‌శ‌..

ఇప్పుడు అలాంటి ప్ర‌య‌త్నం నిషాంచి. ఈ సినిమాని గ్యాంగ్స్ ఆఫ్ వేసేపూర్ త‌ర‌హాలో సృజ‌నాత్మ‌కంగా తెర‌కెక్కించాన‌ని అనురాగ్ వెల్ల‌డించారు. బెంగళూరులో సృజ‌నాత్మ‌కంగా ప‌ని చేయ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని అవ‌కాశాలు ఉన్నాయ‌ని అన్నాడు. బెంగ‌ళూరులోని ప్రశాంతమైన జీవనశైలి సృజనాత్మక సంస్కృతి ఉంద‌ని ప్రశంసించారు. ప్ర‌శాంత‌తో పాటు మంచి సినిమాల నిర్మాణానికి అనువైన ప్ర‌దేశమిద‌ని కొనియాడారు. త‌న జీవితంలో అత్యంత క్లిష్ఠ ద‌శ‌ను ఎదుర్కొన్నాన‌ని చెబుతున్న అనురాగ్, ఇలాంటి క‌ష్ట‌స‌మ‌యంలో నిశాంచి లాంటి సృజ‌నాత్మ‌క సినిమాని తెర‌కెక్కించినందుకు ఆనందాన్ని వ్య‌క్తం చేసారు. నిశాంచి బాలీవుడ్ లో వ‌చ్చిన చాలా క్లాసిక్స్ కి నివాళి అని కూడా న్నారు.

సుశాంత్ సింగ్ హీరో అనుకున్నాం:

నిశాంచి క‌థాంశాన్ని ముక్కాబాజ్ (2016) కోసం ప‌ని చేస్తున్న స‌మ‌యంలోనే సిద్ధం చేసాన‌ని సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ని హీరోగా ఎంపిక చేసుకున్నాన‌ని అనురాగ్ తెలిపారు. కానీ అప్ప‌టికే ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లో రెండు సినిమాల‌కు అత‌డు క‌మిట‌వ్వ‌డంతో ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ల‌లేద‌ని అన్నారు. చివ‌రికి రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న ఠాక్రూ కుటుంబం నుంచి ఒక హీరోని ఎంపిక చేయ‌డంపైనా అనురాగ్ మాట్లాడారు.

రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న హీరో:

థాక్రే వంశం నుంచి ఒక న‌టుడు వ‌స్తున్నాడు. ఐశ్వ‌రీ థాక‌రేను వంశం చూసి ఎంపిక చేయ‌లేదు. అత‌డి ప్ర‌తిభ‌ను చూసి ఎంపిక చేసుకున్నాన‌ని కూడా అనురాగ్ అన్నారు. ఐశ్వరి బాలా సాహెబ్ థాకరే మనవడు కావడంతో నెపోటిజం వ్యాఖ్య‌లు ఊపందుకున్నాయ‌ని, కానీ అత‌డిని ఆడిష‌న్ లోనే ఎంపిక చేసుకున్నామ‌ని వెల్ల‌డించారు. పెద్ద కుటుంబం నుంచి ప్ర‌ముఖుడు కాబ‌ట్టి పేరు నుంచి ఇంటి పేరు తొల‌గించాల‌ని అనుకున్నాం. కానీ ఐశ్వ‌రీ థాక‌రే మొద‌టి సినిమాపై చాలా వార్త‌లు లీక‌వ్వ‌డంతో త‌రవాత పేరును కూడా మార్చ‌లేద‌ని వెల్ల‌డించాడు. క‌ష్ట‌కాలంలో ద‌క్షిణాది ఆదుకుంటోంద‌ని ఇక్క‌డ పుంజుకుంటాన‌ని ఆశాభావం వ్య‌క్తం చేసారు అనురాగ్. మొత్తానికి త‌న‌ను కష్ట‌కాలంలో ఆదుకుంటోంద‌ని ద‌క్షిణాదిని ఆకాశానికెత్తేసాడు అత‌డు. అనురాగ్ మాట‌ల‌ను బ‌ట్టి ఇప్ప‌ట్లో బాలీవుడ్ కి వెళ్లేట్టు క‌నిపించ‌డం లేదు. పూర్తిగా ద‌క్షిణాది సినీప‌రిశ్ర‌మ‌పైనే అత‌డు ఫోక‌స్ చేసాడు. ద‌క్షిణాదిన ఏక కాలంలో న‌ట‌న‌, ద‌ర్శ‌క‌త్వంలో అత‌డు తెలివిగా దూసుకెళుతున్నాడు.

Tags:    

Similar News