ఏడాది తర్వాత నోరు విప్పిన టిల్లు లిల్లీ

ఆ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వచ్చినప్పటికీ అనుపమ ఇమేజ్‌కి డ్యామేజ్‌ ను కలిగించింది అంటూ చాలా మంది చాలా రకాలుగా విమర్శించారు.;

Update: 2025-08-15 07:00 GMT

డీజే టిల్లు సినిమాతో సిద్దు జొన్నలగడ్డ ఒక్కసారిగా స్టార్‌ అయ్యాడు. హీరోగా ఆయనకు మంచి క్రేజ్‌ను తెచ్చి పెట్టిన సినిమాగా డీజే టిల్లు నిలిచింది. ఆ సినిమా సూపర్‌ హిట్‌ నేపథ్యంలో వెంటనే ప్రాంచైజీలో టిల్లు స్వ్కేర్ సినిమాను తీసుకు వచ్చారు. టిల్లు స్క్వేర్ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చింది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో వచ్చిన ఈ ప్రాంచైజీలో మరో సినిమా సైతం వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. డీజే టిల్లు సినిమాలో హీరోయిన్‌గా నేహా శెట్టి నటించగా, టిల్లు స్క్వేర్‌ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ నటించిన విషయం తెల్సిందే. టిల్లు స్క్వేర్‌లో లిల్లీ పాత్రలో నటించిన అనుపమ తన అందంతో పాటు, కొన్ని రొమాంటిక్‌ సీన్స్‌తో సర్‌ప్రైజ్ చేసింది. అంతకు ముందు ఎప్పుడూ అలాంటి పాత్రను అనుపమ చేయలేదు.

లిల్లీ పాత్రతో అనుపమ సర్‌ప్రైజ్‌

అనుపమ మరీ ఇంత బోల్డ్‌గా కనిపించింది ఏంటి అంటూ అంతా సర్‌ప్రైజ్‌ అయ్యారు. ఆ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వచ్చినప్పటికీ అనుపమ ఇమేజ్‌కి డ్యామేజ్‌ ను కలిగించింది అంటూ చాలా మంది చాలా రకాలుగా విమర్శించారు. అనుపమ పరమేశ్వరన్‌ విషయంలో కొందరు ప్రశంసలు సైతం కురిపించారు. కానీ అంతకు ముందు అనుపమ చేసిన సినిమాలను పోల్చుతూ చాలా మంది చేసిన విమర్శలు చర్చనీయాంశం అయ్యాయి. లిల్లీ పాత్రకు అవసరం ఉన్నా లేకున్నా కాస్త ఎక్కువగానే రొమాంటిక్ సీన్స్‌లో అనుపమ పరమేశ్వరన్‌ నటించిందని, అందుకోసం ఆమెను ఎలా ఒప్పించారో అర్థం కాలేదు అంటూ కామెంట్స్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఆ సమయంలో సిద్దుతో రిలేషన్‌లో ఉన్న కారణంగానే అనుపమ ఆ సీన్స్‌ కి ఒప్పుకుందనే వార్తలు వచ్చాయి.

టిల్లే స్క్వేర్‌ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ పాత్ర

టిల్లు స్క్వేర్‌లో అనుపమ పరమేశ్వరన్‌ చేసిన పాత్ర గురించి చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అనుపమ ఆ విషయమై స్పందించింది. తాను టిల్లు స్క్వేర్‌ లో చేసిన పాత్ర విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లు పేర్కొంది. అయితే సినిమా హిట్‌ కావడం సంతోషాన్ని కలిగించింది అని అంది. ఆ సినిమాలోని పలు సీన్స్ చేసే సమయంలో నేను కంఫర్ట్‌గా లేను, అయినా కూడా చేయాల్సి వచ్చింది. ఆ పాత్ర బాగా లేదని నేను అనడం లేదు, కానీ ఆ పాత్ర సెట్‌ కాలేదని మాత్రం నేను బలంగా నమ్ముతున్నాను. ఆ సీన్స్‌ లో, ఆ పాత్రలో నన్ను నేను చూసుకున్నా కాస్త ఇబ్బందిగానే ఉంది అన్నట్లుగా అనుపమ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

డీజే టిల్లు సినిమాలో రాధిక

మలయాళ బ్యూటీ అయిన అనుపమ పరమేశ్వరన్‌ కెరీర్‌ ఆరంభం నుంచి స్కిన్ షో కి కాస్త దూరంగా ఉంటూ వచ్చింది. అయినా కూడా ఈ అమ్మడికి మంచి ఆఫర్లు వచ్చాయి. గ్లామర్‌ షో చేయకున్నా నటిగా తనను తాను నిరూపించుకుంటూ ఆఫర్లు దక్కించుకుంది. అలా ముందుకు సాగుతున్న సమయంలో టిల్లు స్క్వేర్‌ సినిమాతో అనుపమ తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంది. ఆ విషయాన్ని తాను కూడా గుర్తించినట్లు తాజాగా అనుపమ చెప్పుకొచ్చింది. ఏడాది తర్వాత లిల్లీ పాత్ర గురించి అనుపమ పరమేశ్వరన్‌ ఇప్పుడు స్పందించడం పట్ల ఉద్దేశం ఏంటి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. సోషల్‌ మీడియాలో లిల్లీ కి ఉన్న ఫాలోయింగ్‌ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డీజే టిల్లు విడుదల సమయంలో రాధిక అని, స్క్వేర్‌ విడుదల అయిన సమయంలో లిల్లీ అని సోషల్‌ మీడియాలో కుర్రకారు తెగ సందడి చేశారు.

Tags:    

Similar News