అన్నపూర్ణ 2.0.. స్పీడ్ పెరిగింది కానీ..
ఇదే సమయంలో డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్, మోషన్ క్యాప్చర్ వంటి ఇతర విభాగాల్లో కూడా సంస్థ ఇప్పుడు వేగంగా విస్తరిస్తోంది.
అన్నపూర్ణ స్టూడియోస్ ఈమధ్య డిస్ట్రిబ్యూషన్‌లో స్పీడ్ పెంచింది. ఒకప్పుడు నిర్మాణం, స్టూడియో బిజినెస్‌తో ఎక్కువగా కనిపించిన సంస్థ ఇప్పుడు ఇతర భాషల సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తూ ఇండస్ట్రీలో మరింత ఫోకస్ అవుతోంది. సెప్టెంబర్‌లో దుల్కర్ సల్మాన్ ఐ యామ్ గేమ్, కార్తి సర్దార్ 2, ఆనంద్ దేవరకొండ ఎపిక్ వరుసగా లైన్లోకి వచ్చాయి. సుప్రియ యార్లగడ్డ కూడా ఏపీ, తెలంగాణలో కమిషన్ బేస్డ్ మోడల్‌తో డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను పెంచాలని అన్నారు.
ఇదే సమయంలో డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్, మోషన్ క్యాప్చర్ వంటి ఇతర విభాగాల్లో కూడా సంస్థ ఇప్పుడు వేగంగా విస్తరిస్తోంది. అయితే ఇదే నెలలో అన్నపూర్ణ నిర్మాణ భాగస్వామిగా ఉన్న రాంబ ఊర్వశి మేనక సెప్టెంబర్ 4నే రిలీజ్ అయింది. అల్లరి నరేష్ మళ్లీ కామెడీ జానర్‌లోకి వచ్చిన సినిమా కావడంతో కొంత ఆసక్తి వచ్చింది. కానీ టాక్ మాత్రం పాజిటివ్ గా రాలేదు. పాత కథ, పాత ట్రీట్మెంట్ అనే కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. దీంతో నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ రెండింట్లోనూ ఉన్న ఈ సినిమా సంస్థకు పెద్ద ఊపు ఇవ్వలేకపోయింది.
ఇంతకుముందు మలయాళం నుంచి బాలన్ ది బాయ్‌ను జూన్ 19న తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు. మంజుమ్మెల్ బాయ్స్ దర్శకుడు చిదంబరం సినిమా కావడంతో పేరు బాగానే వినిపించింది. కానీ తెలుగు వెర్షన్‌కు థియేటర్లలో పెద్ద రెస్పాన్స్ రాలేదు. మధ్యలో వీరభద్రుడు మాత్రం మంచి ఫలితం ఇచ్చింది. సూర్య కరుప్పును తెలుగులో వీరభద్రుడుగా అన్నపూర్ణ రిలీజ్ చేసింది.
మేలో వచ్చిన ఆ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు చేసింది. ట్రేడ్ వర్గాల ప్రకారం గతంలో కార్తి సర్దార్‌తో వచ్చిన నష్టాన్ని కూడా ఈ సినిమా కవర్ చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఈమధ్య అన్నపూర్ణ చేతిలో బాగా వర్కౌట్ అయిన బయట సినిమా ఇదే. సెప్టెంబర్ 3న వచ్చిన ఐ యామ్ గేమ్‌కు ఓపెనింగ్ ఉన్నా తర్వాత మిక్స్‌డ్ టాక్ ప్రభావం పడింది.
దుల్కర్‌కు తెలుగులో మంచి గుర్తింపు ఉన్నప్పటికీ తెలుగు వెర్షన్‌కు పెద్ద స్థాయిలో ఊపు కనిపించలేదు. హైదరాబాద్‌లో మొదటి రోజు కొన్ని డబ్బింగ్ షోలు డీసీపీ ఆలస్యంతో రద్దవడం కూడా ఇబ్బందిగా మారింది. మలయాళంలో సినిమా వసూళ్లు కొనసాగించినా, తెలుగు మార్కెట్‌లో మాత్రం అనుకున్నంతగా పట్టుకోలేకపోయింది.
ఇప్పుడు సర్దార్ 2 కూడా అన్నపూర్ణ చేతుల మీదుగా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి షోల నుంచి టాక్ మిక్స్‌డ్‌గా ఉంది. కార్తీ సినిమాకు టాక్ బాగుంటేనే ఈ మధ్య తెలుగులో కలెక్షన్స్ పెరుగుతున్నాయి. కానీ ఈ సినిమాకు టాక్ అంత పాజిటివ్ గా రాలేదు. ఏం జరుగుతుందో చూడాలి. మరోవైపు ఎపిక్ రేపు సెప్టెంబర్ 11న రిలీజ్ అవుతోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీతో పాటు ఆదిత్య హాసన్ పేరు కూడా సినిమాకు ముందే గుర్తింపు తెచ్చింది. మరి ఈ సినిమా అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ లో ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.