డిస్ట్రిబ్యూషన్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వడానికి నాగ్ చెప్పిన షాకింగ్ కారణం?
మధ్యలో రావాల్సిన డబ్బులు సరిగ్గా ప్రొడ్యూసర్‌కు చేరకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.
తెలుగు సినీ రంగానికి విశేష సేవలందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ రంగాలలోకి మళ్లీ పూర్తిస్థాయిలో విస్తరించాలని నిర్ణయించుకున్నట్లు అక్కినేని నాగార్జున వెల్లడించారు. సినిమా నిర్మాణం విషయానికి వస్తే ఎప్పుడూ మొదట పెట్టుబడి పెట్టేది నిర్మాతలేనని.. కానీ చివరకు లాభాలు సంపాదించే క్రమంలో చివరి స్థానంలో మిగిలిపోయేది కూడా ఆ నిర్మాతలేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యలో రావాల్సిన డబ్బులు సరిగ్గా ప్రొడ్యూసర్‌కు చేరకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.
ఈ అనారోగ్యకరమైన పద్ధతిని మార్చి పరిశ్రమలో పారదర్శకతను పెంచేందుకు తమ తండ్రి అక్కినేని నాగేశ్వరరావు కాలంలో..అలాగే తాను యంగ్ హీరోగా ఉన్న సమయంలో సాగిన ఆరోగ్యకరమైన పంపిణీ పద్ధతిని మళ్లీ తీసుకురావాలని భావించినట్లు చెప్పారు. ఇందులో భాగంగానే నైజాం పరిధిలో అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్‌ను పునరుద్ధరించామని... ఆ ప్రయత్నం ఇప్పటికే ఎంతో విజయవంతంగా సాగుతోందని నాగార్జున స్పష్టం చేశారు. నిర్మాతల ప్రయోజనాలను కాపాడుతూనే పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు.
అన్నపూర్ణ అంటే కేవలం స్టూడియోను లీజుకు ఇచ్చి డబ్బులు సంపాదించడం మాత్రమే కాదని.. తిరిగి సినీ పరిశ్రమకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే కొత్త సినిమాల నిర్మాణాన్ని వేగవంతం చేశామని నాగార్జున వివరించారు. కొత్త ప్రతిభకు పెద్దపీఠం వేస్తూ ఇటీవలే `లెనిన్` చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చామని.. ఇప్పుడు `పళ్ళ బురుసు` చిత్రాన్ని విడుదల చేస్తున్నామని తెలిపారు. రంభ ఊర్వశి మేనక అనే చిత్రాన్ని పంపిణీ చేయడం గురించి చెబుతూనే తన సినిమా కింగ్ 100 ని రిలీజ్ కి తెస్తామని తెలిపారు.
ఇక అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ కాంబినేషన్‌లో ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం `పళ్ళ బురుసు` ఆగస్టు 14న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మ, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు ఇప్పటికే మంచి స్పందన లభించింది.
`పళ్ళ బురుసు` సినిమా సందేశం గురించి నాగార్జున ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. తల్లిదండ్రులను బాగా చూసుకోవడం కంటే ఈ లోకంలో పెద్ద ఆశీర్వచనం మరొకటి ఉండదని వ్యాఖ్యానించారు. చిన్నతనంలో మనకు భయం వేసినప్పుడు తల్లిదండ్రుల చెయ్యి ఎలా పట్టుకుంటామో... మనం పెద్దయ్యాక వారి బాధ్యతను కూడా అలాగే స్వీకరించాలని హితవు పలికారు. ఈ సందేశాత్మక కథను దర్శకుడు ఉదయ్ ఎంతో వినోదాత్మకంగా మలిచారని..శంభు తాతగా సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్‌తో పాటు నటీనటులందరూ అద్భుతంగా నటించారని కొనియాడారు. గొప్ప టీమ్‌వర్క్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.