పవన్ ఫ్యామిలీకి ఎమోషనల్ డే.. అకీరా గురించి అన్నా ఏమన్నారంటే..

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుటుంబంలో ఏప్రిల్ 8 ఎమోషనల్ డే.;

Update: 2026-04-08 09:15 GMT

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుటుంబంలో ఏప్రిల్ 8 ఎమోషనల్ డే. ఈ సందర్భంగా ఆయన సతీమణి అన్నా లెజినోవా సోషల్ మీడియాలో చేసిన లేటెస్ట్ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌ గా మారింది. నిజానికి నేడు అకీరా నందన్ పుట్టినరోజు. అదే సమయంలో గత ఏడాది ఇదే రోజున సింగపూర్‌ లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ ప్రాణాలతో బయటపడిన సంఘటన అన్నా గుర్తు చేసుకున్నారు.



 


తన ట్వీట్‌ లో ఆమె భావోద్వేగంగా స్పందిస్తూ.. 'అకీరా నందన్‌ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. అతను ఎదుగుతున్న తీరు మాకు ఎంతో గర్వంగా ఉంది. ప్రతి విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవాలనే ఆసక్తి అకీరాలో కనిపిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఎప్పుడూ ఉంటుంది' అని పేర్కొన్నారు. అదే సమయంలో, గత ఏడాది జరిగిన భయానక ఘటన కోసం మాట్లాడారు.



 


'సరిగ్గా ఇదే రోజు మా కుటుంబానికి అత్యంత కష్టమైన రోజు. సింగపూర్‌ లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నాడు. ఆ సమయంలో మా కుటుంబం పూర్తిగా వణికిపోయింది. దేవుడి దయతో అతడు ప్రాణాలతో బయటపడటం నిజంగా ఒక అద్భుతం' అని ఆమె తెలిపారు. 'ఒకవైపు అకీరా పుట్టినరోజు, మరోవైపు మార్క్ పునర్జన్మ పొందిన రోజు.. అందుకే ఈరోజు జరుపుకుంటున్నాం' అని చెప్పారు.

అయితే, ఆ ప్రమాదంపై ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతూనే ఉందని ఆమె పేర్కొన్నారు. 'ఏడాది గడిచినా ఆ ఘటనకు కారణం ఏమిటో ఇంకా స్పష్టత రాలేదు. ఆ అగ్ని ప్రమాదంలో 10 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోవడం, 18 మంది పిల్లలు గాయపడటం చాలా బాధాకరం. కొందరు పిల్లలు ఇంకా చికిత్స పొందుతున్నారు' అని తెలిపారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పినప్పుడు ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

'ఆ సమయంలో ఆసుపత్రిలో అతడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండగా, బెడ్ పక్కన కూర్చొని చూసిన రోజులు నాకు ఇంకా మర్చిపోలేనివి. అలాంటి పరిస్థితి ఏ తల్లికీ రాకూడదు' అని అన్నారు. అలాగే, ఆ ప్రమాద సమయంలో ధైర్యంగా ముందుకు వచ్చి పిల్లలను రక్షించిన కార్మికులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. 'మార్క్‌తో పాటు పలువురు పిల్లలను కాపాడిన వారు నిజమైన హీరోలు. వారి సేవను మేము ఎప్పటికీ మర్చిపోలేం' అని కృతజ్ఞతలు తెలిపారు.

అయితే ట్వీట్‌ తో పాటు అన్నా లెజినోవా ఆ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, అలాగే తిరుమలలో తలనీలాలు సమర్పించిన సందర్భంలోని చిత్రాలను కూడా పంచుకున్నారు. మొత్తానికి, ఒకవైపు ఆనందం, మరోవైపు గతంలోని భయానక అనుభవం.. ఈ రెండింటి కలయికతో ఏప్రిల్ 8వ తేదీ తమ కుటుంబానికి ఎప్పటికీ మరిచిపోలేని రోజుగా నిలిచిపోయిందని అన్నా పోస్ట్ ద్వారా తెలియజేశారు.

Tags:    

Similar News