నిరుధ్ – కావ్య మారన్ పెళ్లి రిసెప్షన్‌కు డేట్ ఫిక్స్.. కానీ!
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ గ్రూప్‌కు చెందిన కావ్య మారన్ పెళ్లి వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి.
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ గ్రూప్‌కు చెందిన కావ్య మారన్ పెళ్లి వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్, ఆయన భార్య కావేరి మారన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. తమ కుమార్తె కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ల వివాహ రిసెప్షన్‌కు హాజరు కావాలని ఆహ్వానించారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కార్యాలయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. చెన్నైలో నవంబర్ 21న రిసెప్షన్ జరగనున్నట్లు పేర్కొంది.
దీంతో వీరిద్దరి పెళ్లి వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ వార్తపై ఇప్పటివరకు కావ్య మారన్, ఆమె తల్లిదండ్రులు కళానిధి మారన్, కావేరి మారన్ లేదా అనిరుధ్ రవిచందర్ స్వయంగా స్పందించలేదు. వారి నుంచి పెళ్లికి సంబంధించి ప్రత్యేక అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. గతంలోనూ వీరిద్దరి పెళ్లిపై ప్రచారం జరగ్గా, అనిరుధ్ అప్పట్లో తన పెళ్లికి సంబంధించి ఇప్పట్లో ఎలాంటి ఆలోచన లేదని చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
కావ్య మారన్ సన్ గ్రూప్‌తో పాటు ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఉన్న అనుబంధం కారణంగా క్రికెట్ అభిమానులకు సుపరిచితం. మరోవైపు అనిరుధ్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా రిసెప్షన్ ఆహ్వానానికి సంబంధించిన సమాచారం బయటకు రావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అయితే, సంబంధిత వ్యక్తుల నుంచి అధికారిక స్పష్టత వచ్చే వరకు పెళ్లి వార్తలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం వేచి చూడాల్సిందే.