4000 కోట్ల బడ్జెట్ నిజమా? ఎట్టకేలకు యష్ క్లారిటీ ఇచ్చేసాడుగా!
నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం `రామాయణం`పై కొద్ది రోజులుగా భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది.
నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం `రామాయణం`పై కొద్ది రోజులుగా భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా-యష్ బృందం రూ. 4,000 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించినట్టు ప్రకటించడంతో దీనిపై సోషల్ మీడియాలో రకరకాల విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల రిలీజైన టీజర్ లో వీఎఫ్ఎక్స్ ఫెయిల్యూర్ ని నిలదీసిన ప్రజలు ఈ సినిమా కోసం అంత బడ్జెట్ పెట్టి ఉండరు! అనే అనుమానాలు వ్యక్తం చేసారు. అయితే ట్రైలర్ మాత్రం ఈ సందేహాలను పటాపంచలు చేయడంలో సఫలమైంది.
ఈ నేపథ్యంలో చిత్రంలో రావణాసురుడిగా నటిస్తూ, కో-ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న ప్రముఖ కన్నడ నటుడు యశ్ ఈ భారీ బడ్జెట్ విమర్శలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో జరిగిన ప్రచార కార్యక్రమంలో యశ్ మాట్లాడుతూ.. ఈ రూ. 4,000 కోట్ల బడ్జెట్ కేవలం మొదటి భాగానికి మాత్రమే కాదని.. రెండు భాగాలకు కలిపి పెడుతున్న మొత్తం అని స్పష్టతనిచ్చారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చారిత్రక కావ్యాన్ని అత్యుత్తమ దృశ్యరూపంగా మలచడానికి ఈ స్థాయిలో నిధులు అవసరమని తెలిపారు. కేవలం సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మి మన భారతీయ చిత్రాలను విమర్శించడం సరికాదని యష్ హితవు పలికారు.
అంతర్జాతీయ వేదికలపై భారతీయ సినిమా సత్తాను చాటడానికి ఇలాంటి భారీ బడ్జెట్ గణాంకాలను బహిరంగంగా చర్చించడం చాలా ముఖ్యమని యశ్ అభిప్రాయపడ్డారు. మనం విదేశాలకు వెళ్లి మన సినిమాలను ప్రమోట్ చేసుకునేటప్పుడు.. తక్కువ బడ్జెట్తో తీశామని చెబితే అక్కడి ప్రేక్షకులు వాటిని పెద్దగా పట్టించుకోకపోవచ్చని అన్నారు. భారతదేశం ఎంతటి భారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని, భారీ నిర్మాణ వ్యయాన్ని భరించగలదో ప్రపంచానికి గర్వంగా చాటాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
కొంతమంది కావాలనే మన సినిమాలను కిందికి లాగడానికి ప్రయత్నిస్తారని.. అయితే మనం బ్రిటిష్ వారి `విభజించి పాలించు` విధానాన్ని అనుసరించకూడదని యశ్ అన్నారు. దేశమంతా ఒక్కటిగా నిలబడి ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లను విజయవంతం చేయడానికి సహకరించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా కర్ణాటక ప్రజలు ..దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు తమ కుటుంబాలతో కలిసి థియేటర్లలో ఈ దృశ్యకావ్యాన్ని వీక్షించాలని కోరారు.
రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణాసురుడిగా నటిస్తున్న ఈ అద్భుతమైన ద్విభాషా కావ్యానికి సంబంధించిన మొదటి భాగం 2026 నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎంతో మంది ప్రముఖ నటులు, అంతర్జాతీయ వీఎఫ్ఎక్స్ సంస్థల భాగస్వామ్యంతో వస్తున్న ఈ చిత్రం ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా మరో మెట్టు ఎక్కిస్తుందనడంలో సందేహం లేదు. విమర్శలను పక్కనపెట్టి.. భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ సినిమా విజయానికి అందరూ ఐక్యంగా తోడ్పడాలని యశ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.