వాళ్లిద్దరి ఎంట్రీతో బద్దకం వదిలిన బీజీఎమ్!
ఒకప్పుడు సంగీతం అంటే కేవలం పాటలకే పరిమితం అనే అభిప్రాయం ఉండేది. ప్రేక్షకులు కూడా బీజీఎమ్ ను పెద్దగా పట్టించుకునే వారు కాదు.;
ఒకప్పుడు సంగీతం అంటే కేవలం పాటలకే పరిమితం అనే అభిప్రాయం ఉండేది. ప్రేక్షకులు కూడా బీజీఎమ్ ను పెద్దగా పట్టించుకునే వారు కాదు. రెహమాన్, ఇళయరాజా లాంటి లెజెండ్లు ఎంత గొప్ప బీజీఎమ్ అందించినా? పాటలకు ఇచ్చిన ప్రాధాన్యత బీజీఎమ్ కి ఇచ్చే వారు కాదు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. పాటల్ని మించిన ప్రాధాన్యత బీజీఎమ్ కు లభిస్తోంది. సన్నివేశాన్ని వివరించే క్రమంలో ఆర్ ఆర్ కూడా అత్యంత కీలకంగా మారుతుంది. ఆ సన్నివేశానికి తగ్గ బీజీఎమ్ అందించారా? లేదా? అని విశ్లేషించే స్థాయికి కామన్ ఆడియన్స్ చేరారు.
దీంతో సినిమా విజయంలో బీజీఎమ్ కూడా కీలకంగా మారింది. అనిరుధ్ రవిచందర్, రవి బస్రూర్ వంటి యువ సంగీత దర్శకులు సినిమాకు బీజీఎమ్ ఎంత కీలకమో నిరూపిస్తున్నారు. వీరిద్దరి రాకతో సౌత్ ఇండియన్ సినిమాల్లో బీజీఎమ్ స్థాయి ఒక్కసారిగా మారిపోయింది. థియేటర్లలో కేవలం మ్యూజిక్ వింటూనే అభిమానులు పూనకాలతో ఊగిపోయేలా చేయడం వీరి ప్రత్యేకతగా మారింది. అనిరుధ్ రవిచందర్ తన `వైబెంట్` మ్యూజిక్‌తో ప్రతి సినిమాకు ఒక కొత్త ఎనర్జీని ఇస్తున్నారు. `ఖైదీ` ,`విక్రమ్`, `జైలర్`, `జవాన్`, దేవర వంటి చిత్రాల్లో ఆయన ఇచ్చిన బీజీఎమ్ ఆ సినిమాలను బాక్సాఫీస్ వద్ద మరో మెట్టు ఎక్కించాయి.
అదే విధంగా `కేజీఎఫ్` సిరీస్‌తో రవి బస్రూర్ సృష్టించిన శబ్ద తరంగాలు ప్రేక్షకులను అంతకు మించి ఆశ్చర్యపరిచాయి. బేస్ మ్యూజిక్ , ఎలివేషన్ సీన్లకు ఆయన ఇచ్చే స్కోర్, హీరో పాత్రను వెండితెరపై అత్యంత శక్తివంతంగా చూపిస్తోంది. వీరిద్దరి ఎంట్రీతో ఇండస్ట్రీలోని కొంత మంది సంగీత దర్శకుల్లో బద్ధకం వదిలిందని చెప్పవచ్చు. ఒకప్పుడు కేవలం రెగ్యులర్ ట్యూన్స్‌తో సరిపెట్టిన వారు కూడా ఇప్పుడు అనిరుధ్, రవి బస్రూర్ ఇస్తున్న పోటీని తట్టుకోవడానికి తమ పనితీరును మార్చుకుంటున్నారు. నేపథ్య సంగీతంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు.
ప్రతి సీన్‌కు ఒక కొత్త సౌండ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల ప్రేక్షకులకు ఒక అద్భుతమైన ఆడియో-విజువల్ ఎక్స్‌పీరియన్స్ దక్కుతోంది. థమన్, దేవిశ్రీ ప్రసాద్ వంటి అగ్ర సంగీత దర్శకులు కూడా ఇప్పుడు బీజీఎమ్ విషయంలో రాజీ పడటం లేదు. `అఖండ`, `పుష్ప` వంటి సినిమాల విజయంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతటి ఇంపాక్ట్ చూపించిందో తెలిసిందే. కేవలం పాటలు బాగుంటే సరిపోదు. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి రోమాలు నిక్కబొడుచుకునేలా మ్యూజిక్ ఉండాలని కొత్త టెక్నాలజీని, ఇన్స్ట్రుమెంట్లను వాడుతూ అద్భుతాలు చేస్తున్నారు. స్టార్ హీరోల కోసమే కాకుండా సినిమా కథలోని ఆత్మను పట్టుకుని ప్రాణం పోసేలా బీజీఎమ్ రూపొందుతోంది. సంగీత దర్శకుల మధ్య పెరిగిన హెల్తీ కాంపిటీషన్ వల్ల భవిష్యత్తులో వచ్చే సినిమాల్లో మరింత నాణ్యమైన , వైవిధ్యమైన సంగీతాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది.