టాప్ స్టోరీ:రాజ‌మౌళి..సుకుమార్‌..రావిపూడి..ఎవ‌రు గ్రేట్‌?

దీంతో ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద రూ.1600 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి స‌రికొత్త రికార్డుని నెల‌కొల్పింది.;

Update: 2026-01-21 03:24 GMT

టాలీవుడ్ పేరు గ‌త కొంత కాలంగా దేశ వ్యాప్తంగా మారుమోగుతోందంటే దానికి ప్ర‌ధాన కార‌ణం స్టార్ డైరెక్ట‌ర్ జ‌క్క‌న్న‌. టాలీవుడ్ ఖ్యాతిని ఖండాంత‌రాల‌కు చాటిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. `బాహుబ‌లి` సిరీస్ సినిమాల‌తో తెలుగు సినిమా మార్కెట్ తో పాటు బ‌డ్జెట్‌ని కూడా ప‌తాక స్థాయికి తీసుకెళ్లారు. ఒక తెలుగు సినిమా హాలీవుడ్ మూవీస్‌కి ఏమాత్రం తీసిపోద‌ని, క‌రెక్ట్‌గా ప్లాన్ చేస్తే బాక్సాఫీస్ వ‌ద్ద రూ.2000 కోట్ల‌ని కూడా రాబ‌ట్ట‌గ‌ల‌ద‌ని `బాహుబ‌లి`తో నిరూపించిన విష‌యం తెలిసిందే.

ఇదే ఫార్ములాని బాగా వంట‌బ‌ట్టించుకుని జ‌క్క‌న్న త‌రహాలోనే పాన్ ఇండియా మూవీతో సంచ‌ల‌నం సృష్టించిన ద‌ర్శ‌కుడు సుకుమార్‌. బ‌న్నీతో సుక్కు రూపొందించిన `పుష్ప‌`, `పుష్ప 2` వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఏ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టించాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అయితే ఇందులో `పుష్ప 2` సాధించిన విజ‌యం గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిందే. `పుష్ప`తో ఆశించిన స్థాయి విజ‌యం ద‌క్క‌లేద‌ని భావించిన సుకుమార్‌, బ‌న్నీ `పుష్ప 2`ని భారీ స్థాయిలో తెర‌పైకి తీసుకురావ‌డం..అది ద‌క్షిణాదితో పాటు ఉత్త‌రాది ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకోవ‌డం తెలిసిందే.

దీంతో ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద రూ.1600 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి స‌రికొత్త రికార్డుని నెల‌కొల్పింది. ఈ స్థాయిలో రాజ‌మౌళి `బాహుబ‌లి` త‌రువాత వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన సినిమాగా `పుష్ప 2` నిలవ‌డ‌మే కాకుండా టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ప్ర‌భాస్ త‌రువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని నిల‌బెట్టింది. ప్ర‌త్యేక గుర్తింపుని తెచ్చి పెట్ట‌డ‌మే కాకుండా బ‌న్నీ ప్లానింగ్‌నే మార్చివేసింది. ఈ మూవీ అందించిన స‌క్సెస్ ధైర్యంతో బ‌న్నీ ఇప్పుడు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో రెండు భారీ సినిమాల‌కు శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే. స్టార్ హీరోలు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో సినిమాలు చేస్తున్నారంటే ఈ మార్పుకు కార‌కులు రాజ‌మౌళి, సుకుమార్‌.

అయితే ఇది నాణేనికి ఒక‌వైపు మాత్ర‌మే. జ‌క్క‌న్న ఎంత‌గా టాలీవుడ్ మార్కెట్‌ని, బ‌డ్జెట్ స్థాయితో పాటు లాభాల్ని కూడా భారీ స్థాయికి తీసుకెళ్లినా, సుక్కు పాన్ ఇండియా స్టార్‌గా బ‌న్నీని నిల‌బెట్టినా వారు ఆడిన గేమ్ కోట్ల‌ల్లో.. మేకింగ్ కోసం ఎక్కువ టైమ్ తీసుకున్నారు. వంద కోట్లు ఖ‌ర్చు పెట్టించారు. త‌క్కువ టైమ్‌లో ఈ డైరెక్ట‌ర్లు సినిమాని పూర్తి చేయ‌లేదు స‌రిక‌దా..బ‌డ్జెట్ కూడా త‌క్కువ ఖ‌ర్చు పెట్టించ‌లేదు. అయితే వీరిద్దరికి పూర్తి భిన్నంగా సినిమాలు చేస్తూ వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని ద‌క్కించుకుంటున్నాడు అనిల్ రావిపూడి.

కెరీర్ ప్రారంభంలో రూ.7 కోట్ల బ‌డ్జెట్‌తో `ప‌టాస్‌` సినిమా తీసి రూ.28 కోట్లు తెచ్చి పెట్టాడు. ఆ త‌రువాత దాదాపు రూ.15 కోట్ల‌తో రెండ‌వ సినిమా `సుప్రీమ్‌` చేసి రూ.40 కోట్ల‌కు పైనే నిర్మాత‌కు వ‌సూల్ అయ్యేలా చేశాడు. మూడ‌వ సినిమా `రాజా ది గ్రేట్‌`కు రూ.52 కోట్లు, నాలుగ‌వ సినిమా `ఎఫ్ 2`కు రూ.30 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు పెట్టించి ఏకంగా రూ.120 కోట్ల‌కు పైనే రాబ‌ట్టి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఐద‌వ సినిమా `స‌రిలేరు నీకెవ్వ‌రు`తో ఊహించిన స్థాయిలో రూ.250 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబట్టి ఔరా అనిపించాడు. దీనికి అయిన ఖ‌ర్చు హీరో రెమ్యూన‌రేష‌న్‌ల‌తో క‌లిపి రూ.75 కోట్లు మాత్ర‌మే. `ఎఫ్ 3`కి రూ.130 కోట్ల‌కు పైగా రాబ‌ట్టాడు.

`భ‌గ‌వంత్ కేస‌రి` విష‌యంలోనూ ఇదే రిపీట్ అయింది. ఇక `సంక్రాంతికి వ‌స్తున్నాం` ఏకంగా రూ.300 కోట్ల క్ల‌బ్‌లో చేరాడు. ఇప్పుడు `మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్‌గారు`తో ఇప్ప‌టికే రూ.300 కోట్లు రాబ‌ట్టి స‌రికొత్త రికార్డుకు చేరువ‌కాబోతున్నాడు. త‌క్కువ బ‌డ్జెట్‌, త‌క్క‌వ వ‌ర్కింగ్ డేస్‌తో సినిమాలు తెర‌కెక్కిస్తూ బాక్సాఫీస్ వ‌ద్ద‌ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఎక్కువ డేస్‌..ఎక్కువ బ‌డ్జెట్‌తో రాజమౌళి, సుక్కు పాన్ ఇండియా మూవీస్ చేస్తుంటే అనిల్ రావిపూడి మాత్రం వారికి భిన్నంగా వండ‌ర్స్ క్రియేట్ చేస్తుండ‌టంతో ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అనిల్ ఈజ్ గ్రేట్ అంటున్నాయి. రానున్న రోజుల్లో ఇదే పంథాలో సినిమాలు చేస్తే అనిల్ రావిపూడి మ‌రిన్ని అద్భుతాలు సృష్టిస్తాడ‌ని టాలీవుడ్‌లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ మొద‌లైంది.

Tags:    

Similar News