హీరోయిన్లతో సేఫ్ గేమ్ ఆడుతోన్న అనీల్!
టాలీవుడ్‌లో కమర్షియల్ సక్సెస్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకులలో అనిల్ రావిపూడి టాప్ లో ఉన్నారు.
టాలీవుడ్‌లో కమర్షియల్ సక్సెస్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకులలో అనిల్ రావిపూడి టాప్ లో ఉన్నారు. తన మార్కు కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను అలరించే సినిమాల నిర్మాణంలో ప్రతి విషయంలోనూ పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్ల ఎంపిక విషయంలో అనిల్ రావిపూడి ప్రత్యేకమైన వ్యూహాన్ని అనుసరిస్తారనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. హీరోయిన్ల పరంగా ప్రయోగాలకు పోకుండా క్రేజ్ ఉన్న నాయికలతోనే సేఫ్ గేమ్ ఆడుతున్నారనే చర్చ నడుస్తోంది.
సాధారణం చాలా మంది దర్శకులు కొత్త టాలెంట్‌ను పరిచయం చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కానీ అనిల్ రావిపూడి మాత్రం కెరీర్‌లో ఇప్పటి వరకు పూర్తి స్థాయి కొత్త హీరోయిన్లను కథానాయికలుగా పరిచయం చేసిన సందర్భాలు లేవు. విజయంలో హీరోయిన్ పాత్ర కూడా కీలకమే కాబట్టి నటన .. స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనేది ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. అందుకే ఇండస్ట్రీలో కనీస ఇమేజ్ ఉన్న ముఖాలనే అనీల్ ప్రాజెక్ట్‌ల కోసం పరిశీలిస్తుంటారు.
హీరోయిన్ పాత్రలు గ్లామర్‌కే పరిమితం కాకుండా లౌడ్ కామెడీ .. విలక్షణమైన మేనరిజమ్స్‌తో కూడి ఉంటాయి. `ఎఫ్ 2` లో తమన్నా, మెహ్రీన్ పాత్రలు గానీ, `సరిలేరు నీకెవ్వరు` లో రష్మిక మందన్న మేనరిజం గానీ, `భగవంత్ కేసరి` లో శ్రీలీల పాత్ర గానీ,` సంక్రాంతి వస్తున్నాం`లో ఐశ్వర్యా రాజేష్ పాత్రలు ఇందుకు ఉదాహరణలు. ఇలాంటి పాత్ర పండించాలంటే కెమెరా ముందు అనుభవం ఉండి, ప్రేక్షకులలో ఒక రకమైన ఇమేజ్ ఉన్న హీరోయిన్లు అయితేనే న్యాయం చేయగలరని అనీల్ నమ్ముతుంటారు. పాత్ర స్వభావాన్ని బట్టి, ఆ బరువును మోయగల నాయికలనే ఎంచుకుంటారు.
కొత్త హీరోయిన్లను తీసుకున్నప్పుడు బాడీ లాంగ్వేజ్, టైమింగ్‌ను మార్చుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఒక్కోసారి ఆ ప్రయోగాలు వికటించి సినిమా ఫలితంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇలాంటి రిస్క్‌ల నుంచి అనిల్ సులువుగా ఎస్కేప్ అవుతుంటారు. స్టార్ ... సెమీ-స్టార్ హీరోయిన్లను తీసుకోవడం వల్ల సినిమా బిజినెస్‌కు, ప్రమోషన్లకు కూడా అదనపు మైలేజ్ లభిస్తుంది. ఈ రకమైన సేఫ్ స్ట్రాటజీ దర్శకుడిగా అనీల్ పై ఉండే ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తుంది.
అనిల్ రావిపూడి అనుసరిస్తున్న ఈ పద్ధతి కమర్షియల్‌గా ఎంతో సేఫ్ అండ్ సక్సెస్‌ఫుల్ మోడల్. ఒక భారీ కమర్షియల్ సినిమాను రూపొందిస్తున్నప్పుడు ప్రతీ ఎలిమెంట్ పక్కాగా ఉండాలి. హీరోయిన్ల విషయంలో క్రేజ్ ఉన్న వారిని సెట్ చేయడం వల్ల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం సులువవుతుంది. కొత్తవారితో ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకోవడం కంటే నిరూపితమైన నాయికలతో ముందుకు వెళ్లడమే ఉత్తమమనేది అనీల్ బిజినెస్ మైండ్ సెట్‌ను సూచిస్తుంది.
ఏదేమైనా? వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి రాబోయే చిత్రాల్లోనూ ఇదే తరహా ధోరణిని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వెంకటేష్-కల్యాణ్ రామ్ తో చేస్తోన్న ప్రాజెక్టులలో క్రేజీ హీరోయిన్లే ఉన్నారు. కీర్తి సురేష్, కృతిశెట్టి లాంటి అందమైన హుషారైన భామల్ని ఎంపిక చేసి మరోసారి ట్యాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు.