బాంబింగ్ ముప్పు పొంచి ఉన్నా దైర్యంగా సంచ‌ల‌న తార‌ ప‌ర్య‌ట‌న‌!

హాలీవుడ్ నటి, ఐక్యరాజ్యసమితి మాజీ రాయబారి అంజెలీనా జోలీ ఉక్రెయిన్‌లోని కీలక ప్రాంతమైన ఖార్కీవ్‌ నగరంలో ఆకస్మికంగా పర్యటించారు.

Update: 2026-09-08 06:18 GMT

హాలీవుడ్ నటి, ఐక్యరాజ్యసమితి మాజీ రాయబారి అంజెలీనా జోలీ ఉక్రెయిన్‌లోని కీలక ప్రాంతమైన ఖార్కీవ్‌ నగరంలో ఆకస్మికంగా పర్యటించారు. నిరంతర క్షిపణి, డ్రోన్ దాడులతో ప్రభావితమైన సరిహద్దు నగరంలో అంజెలినా పర్యటించడం చర్చనీయాంశమైంది. బాంబింగ్ ముప్పు ఉన్నా? స్థానిక ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు పర్యటన చేసిన‌ట్లు తెలుస్తోంది. పర్యటనలో భాగంగా అంజెలీనా జోలీ స్థానిక స్పాడ్కోయెమెట్స్' బాక్సింగ్ క్లబ్‌ను సందర్శించారు. తీవ్రమైన యుద్ధ వాతావరణం నడుమ క్రీడల ద్వారా ధైర్యాన్ని నింపుకుంటున్న స్థానిక యువతకు, క్రీడాకారులకు జోలీ మద్దతుగా నిలిచారు.

జోలీ పర్యటన గురించి ఎలాంటి ముందస్తు సమాచారం లేకపోవడంతో క్లబ్ నిర్వాహకులు, సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ పర్యటనలో జోలీతో పాటు ఆమె చిన్న కుమారుడు నాక్స్ జోలీ-పిట్ కూడా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాక్స్ ఆ బాక్సింగ్ క్లబ్‌లో ఉక్రెయిన్ రక్షణ దళాలకు చెందిన సైనికులు, స్థానిక అథ్లెట్లతో కలిసి ముయ్ థాయ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణలో పాల్గొన్నారు. ఉక్రెయిన్ సైనికులతో నాక్స్ ముచ్చటించి శిక్షణా విభాగాన్ని పంచుకున్న దృశ్యాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ పర్యటనపై బాక్సింగ్ క్లబ్ యజమాని పావ్లో చిష్కో ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఇది ఎవరూ ఊహించని సంఘటన అని.. సెప్టెంబర్ 6న సాధారణ జిమ్ బుకింగ్ మాత్రమే వచ్చిందని పేర్కొన్నారు. `ఇది ఎలాంటి ఏఐ సృష్టి ప్రచార చిత్రం కాదు. అంజెలీనా జోలీ నిజంగానే మా జిమ్‌ను సందర్శించారు` అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. బాక్సింగ్ క్లబ్‌ను, అక్కడ అందుబాటులో ఉన్న వసతులను అంజెలీనా జోలీ ప్రత్యేకంగా ప్రశంసించారని చిష్కో తెలిపారు. జోలీ, నాక్స్ ఇద్దరూ ఎంతో ఆత్మీయంగా, మర్యాదగా ఇక్కడి క్రీడాకారులతో కరచాలనం చేసి మాట్లాడారని కొనియాడారు. క్రీడల్లో వారికున్న ఆసక్తిని, ప్రాక్టీస్ చేస్తున్న చిన్నారులను అడిగి తెలుసుకున్న తీరును క్లబ్ వర్గాలు కొనియాడాయి.

2022లో రష్యాపూర్తి స్థాయి ఆక్రమణను ప్రారంభించినప్పటి నుంచి అంజెలీనా జోలీ ఉక్రెయిన్‌లో పర్యటించడం ఇది మూడోసారి. తన పర్యటనలో భాగంగా ఈసారి ఖార్కీవ్‌తో పాటు ల్వివ్, టెర్నోపిల్, క్రెమెన్‌చుక్ వంటి పలు నగరాలను కూడా సందర్శించారు. యుద్ధం ముమ్మరంగా సాగుతున్న ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు మానవీయ దృక్పథంతో సంఘీభావం ప్రకటించడంపై అంతర్జాతీయంగా ప్రశంసలు వెల్లు వెత్తుతున్నాయి.

జోలీ సినిమాల విష‌యానికి వ‌ప‌స్తే ..ఇటీవల రిలీజ్ అయిన ఫ్రెంచ్ డ్రామా `కౌచర్స్` లోనూ నటించి మెప్పించారు. ప్రస్తుతం డ్రగ్ కింగ్‌పిన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ `సన్ని`, నవలాధారిత కామెడీ డ్రామా `యాంక్షియస్ పీపుల్`, స్పై థ్రిల్లర్ `ది ఇనిషియేటివ్` వంటి క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తున్నారు. వీటితో పాటు డిస్నీ ప్రసిద్ధ ఫ్రాంచైజీ `మలెఫిసెంట్ 3` లో ప్రధాన పాత్రలో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా స్టార్ కథా నాయికగా విభిన్న పాత్రలు పోషిస్తూనే.. మరోవైపు సమాజానికి ఉపయోగపడే మానవీయ సేవా కార్యక్రమాల్లో పాల్గొని జోలీ గ్లోబల్ ఐకాన్‌గా రాణిస్తున్నారు.

Tags:    

Similar News