చిత్ర పరిశ్రమకు గుడ్ న్యూస్.. త్వరలో నంది అవార్డుల ప్రధానోత్సవం..
ఇకపోతే ఇప్పటివరకు నంది అవార్డులు ప్రకటించిన జాబితాలో అత్యధిక నంది అవార్డులు అందుకున్న నటులలో నాగార్జున మొదటి స్థానంలో నిలిచారు.;
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన వార్షిక అవార్డులు. ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటీనటులు, సాంకేతిక నిపుణులను గుర్తించి వారికి బంగారు, రజత, కాంస్య, తామ్ర నంది పురస్కారాలను ప్రభుత్వం అందజేస్తూ ఉంటుంది. ఇకపోతే 1964లో ఈ నంది అవార్డుల ప్రధానోత్సవం ప్రారంభం అయింది. దాదాపు 50 సంవత్సరాలు ఈ పరంపర కొనసాగింది. 2014, 2015, 2016 సంవత్సరాలకు గానూ 2017లో ఈ నంది అవార్డులను ప్రకటించారు.
ఆ తర్వాత నంది అవార్డుల ప్రధానం పై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. నిజానికి 2024లో అవార్డుల ప్రధానోత్సవం ఉంటుంది అని ప్రభుత్వం ప్రకటించింది. కానీ మళ్ళీ ఆ ఊసు ఎత్తకపోవడం గమనార్హం. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత గౌరవప్రదమైన అవార్డులలో ఒకటిగా నిలిచిన ఈ నంది అవార్డులను.. 2017 తర్వాత ప్రకటించకపోవడంతో నటీనటులలో నిరుత్సాహం పెరిగిపోయింది అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఇకపోతే ఇప్పటివరకు నంది అవార్డులు ప్రకటించిన జాబితాలో అత్యధిక నంది అవార్డులు అందుకున్న నటులలో నాగార్జున మొదటి స్థానంలో నిలిచారు. ఉత్తమ నటుడిగా 4, నిర్మాతగా 5 అవార్డులు అందుకున్నారు. ఆ తర్వాత 8 నంది పురస్కారాలతో మహేష్ బాబు, ఏడు నంది పురస్కారాలతో వెంకటేష్, జగపతిబాబు , మూడు నంది పురస్కారాలతో చిరంజీవి, కమలహాసన్, బాలకృష్ణ ఆయా స్థానాలలో నిలిచారు. ఇక 2016లో చివరిగా జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ గా నాన్నకు ప్రేమతో అనే సినిమాకు గాను అవార్డును అందుకున్నారు.. ఇక అప్పటి నుంచి మళ్లీ అవార్డులను ప్రకటించలేదు..
ఈ నంది అవార్డుల కోసం తెలుగు సినీ పరిశ్రమ ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ తెలుగు సినీ పరిశ్రమకు త్వరలో నంది అవార్డుల ప్రధానం జరుగుతుంది అని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. విజయవాడలోని పున్నమి ఘాట్ వేదికగా మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఆవకాయ - అమరావతి ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన త్వరలో రాష్ట్రంలో నంది నాటకోత్సవాలను నిర్వహించడంతోపాటు నంది అవార్డులను కూడా ప్రధానం చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు..
ఇకపోతే దాదాపు గత 8 సంవత్సరాలకు పైగా నిలిచిపోయిన ఈ నంది అవార్డుల ప్రధానోత్సవం ఈ ఏడాది ప్రారంభం కాబోతోందని మంత్రి చెప్పడంతో అటు సినీ పరిశ్రమతో పాటు నటీనటులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ నటీనటులను మొదలుకొని ఉత్తమ చిత్రాలు, ఉత్తమ టెక్నీషియన్లు ఇలా పలు విభాగాలలో ఈ నంది అవార్డులను అందిస్తారు.