అనసూయపై తప్పుడు పోస్టులు.. అరెస్ట్ అయిందెవరు?
ఇదిలా ఉండగా మరో ఘటనలో సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లికి చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.;
టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తులపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసభ్య వ్యాఖ్యలు, మార్ఫింగ్ వీడియోలు పోస్ట్ చేసే వారిపై నిఘా కొనసాగుతుందని పోలీసులు హెచ్చరించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాకు చెందిన జనార్దన్ ప్రస్తుతం హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇంద్రానగర్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో ఫేక వీడియోలను రూపొందించి వాటిని ఇన్ స్టాగ్రామ్ సహా పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలకు అసభ్యకర వ్యాఖ్యలు యాడ్ చేసి వైరల్ చేశాడు.
దీంతో అనసూయ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దాని ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు డిజిటల్ ప్రూఫ్స్ సేకరించి నిందితుడు జనార్దన్ ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సోషల్ మీడియాలో వ్యూస్, ఫాలోవర్లు పెంచుకోవాలనే ఉద్దేశంతో ఆ పోస్టులు పెట్టినట్లు నిందితుడు అంగీకరించినట్లు సమాచారం. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉండగా మరో ఘటనలో సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లికి చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అనసూయ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన రీల్ పై అతడు కామెంట్ సెక్షన్ లో అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ విషయం పై దర్యాప్తు జరిపిన సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జైలుకు పంపినట్లు తెలిపారు.
కొంతకాలంగా అనసూయపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కొందరు వ్యక్తులు ఆమె ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేయడం, అసభ్యకర వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఆ వేధింపులు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో గత జనవరి నెలలో ఆమె సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
తనపై ఉద్దేశపూర్వకంగా అసభ్య పోస్టులు పెడుతూ, AIతో మార్ఫింగ్ వీడియోలు తయారు చేసి వైరల్ చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు మొత్తం 42 మంది పై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డిజిటల్ ప్రూఫ్స్ ఆధారంగా ప్రధాన నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా పోస్టులు, కామెంట్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటువంటి ఘటనలు రిపీట్ కాకుండా మరింత ఫోకస్ పెంచినట్లు పోలీసులు వెల్లడించారు.