అనంత్ శ్రీరామ్ కామెంట్స్.. ఆ డిస్కషన్ అవసరమా?
టాలీవుడ్ ప్రముఖ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చకు దారితీస్తున్నాయి.;
టాలీవుడ్ ప్రముఖ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాలోని రై రై రా రా పాటకు ఆయన రాసిన లిరిక్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అందులో రీసెంట్ గా చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
రై రై రా రా పాట గురించి మాట్లాడిన అనంత శ్రీరామ్, ఆ సాంగ్ లోని ఎమోషన్, విలేజ్ బ్యాక్ డ్రాప్, రోల్స్ సోల్ ను రిఫ్లెక్ట్ చేసేలా పదాలు రాయడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టానని చెప్పారు. అదే సమయంలో రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించారు. ఆయన గోల్డెన్ స్పూన్ తో పుట్టిన స్టార్ అయినప్పటికీ షూటింగ్ సమయంలో చాలా కష్టపడుతున్నారని అన్నారు.
సినిమాలోని యాక్షన్ సీన్స్ గురించి మాట్లాడిన అనంత శ్రీరామ్, రామ్ చరణ్ చాలా డేంజర్ షాట్లు కూడా స్వయంగా చేస్తున్నారని పేర్కొన్నారు. నేటి టెక్నాలజీ కాలంలో ఫేస్ స్వాప్ వంటి టెక్నాలజీలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని అసలు ఉపయోగించకుండా స్వయంగా యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడం నిజమైన హీరో లక్షణమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
రామ్ చరణ్ తన పాత్రకు న్యాయం చేయడానికి ఎంత కష్టపడుతున్నారో ఆ విషయం ద్వారా తెలుస్తుందని అన్నారు. అయితే ఆయన కామెంట్స్.. ఇప్పుడు మరో యాంగిల్ లోనూ చర్చకు దారితీస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం బడా సినిమాల్లో యాక్షన్ సన్నివేశాల కోసం ఫేస్ స్వాప్, డూప్ లేదా విజువల్ ఎఫెక్ట్స్ టెక్నాలజీలను ఉపయోగించడం సాధారణంగా మారింది. ఇది హీరోల భద్రత కోసమే కాకుండా షూటింగ్ వేగంగా పూర్తవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది.
ఉదాహరణకు, చిరంజీవి నటించిన సైరా నరసింహ రెడ్డి సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో టెక్నాలజీ సహాయం తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అదే విధంగా ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ వంటి సినిమాల్లో టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించినట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు కొందరికి అసౌకర్యంగా అనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఎందుకంటే ఒక హీరో స్వయంగా స్టంట్స్ చేయడం గొప్ప విషయం అయినప్పటికీ, టెక్నాలజీని ఉపయోగిస్తున్న ఇతర హీరోలు తక్కువగా కనిపించేలా వ్యాఖ్యలు చేయడం అవసరం లేదని వారు భావిస్తున్నారు. అదే సమయంలో అనంత శ్రీరామ్ వ్యాఖ్యలను వాళ్లు అతిగా అర్థం చేసుకుంటున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఆయన ఉద్దేశ్యం రామ్ చరణ్ కష్టాన్ని ప్రశంసించడం మాత్రమేనని, దానిని ఇతర హీరోలతో పోల్చి వివాదం సృష్టించి డిస్కస్ చేయడం అవసరం లేదని అంటున్నారు. ఏదేమైనా ఒక పాట విజయంతో వచ్చిన ఆనందంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారి తీసినట్లు కనిపిస్తోంది.