నా వదినమ్మ రష్మిక.. చాలా ప్రౌడ్‌ గా చెబుతున్నా: ఆనంద్ దేవరకొండ

హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎపిక్.

Update: 2026-09-05 03:52 GMT

హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎపిక్. బేబీ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ఆ జోడీ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌, టీజర్‌, పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి. తాజాగా హైదరాబాద్‌ లో నిర్వహించిన ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్ లో హీరోయిన్‌ రష్మిక మందన్న చీఫ్ గెస్ట్ గా పాల్గొని ట్రైలర్‌ ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. ముఖ్యంగా రష్మికను ఉద్దేశించి ఆయన చేసిన వదినమ్మ వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. బేబీ సినిమా సాంగ్‌ రిలీజ్ ఈవెంట్‌ కు రష్మిక వచ్చిన విషయాన్ని ఆనంద్ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ప్రేక్షకులు రష్మికను చూసి వదిన.. వదిన అంటూ గట్టిగా అరిచారని చెప్పారు. అయితే ఆ సమయంలో తాను ఆ మాటను చెప్పలేకపోయానని, ఇప్పుడు మాత్రం చాలా ప్రౌడ్‌ గా వదినమ్మ అని చెబుతున్నానని ఆనంద్ అన్నారు.

రష్మిక తనను ఎంతో సపోర్ట్ చేస్తారని ఆనంద్ తెలిపారు. తాను ఎక్కువగా మాట్లాడే వ్యక్తిని కాదని, ఇంట్లో కూడా ఎక్కువగా మాట్లాడనని చెప్పారు. అయితే రష్మిక మాత్రం తన దగ్గరకు వచ్చి ఓకేనా? అని అడుగుతూ తనకు అండగా ఉంటారని పేర్కొన్నారు. ఇలాంటి సపోర్ట్‌ లభించడం తన అదృష్టమని ఆనంద్ చెప్పారు. ఎపిక్ సినిమా పూజా కార్యక్రమంలో కూడా రష్మిక పాల్గొన్నారని, ఇప్పుడు ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ కు వచ్చారని ఆనంద్ తెలిపారు. ఆమె తమ సినిమాకు ఇస్తున్న మద్దతు చాలా ప్రత్యేకమని చెప్పారు.

ఇక ఎపిక్ టైటిల్‌ గురించి కూడా ఆనంద్ ఆసక్తికరంగా మాట్లాడారు. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని ప్రత్యేకమైన ఎపిక్ మూమెంట్స్ ఉంటాయని, ప్రేమకథల్లోనూ అలాంటి సందర్భాలు ఉంటాయని చెప్పారు. సినిమాలోనూ ప్రేక్షకులను ఆకట్టుకునే ఎన్నో ఎపిక్‌ మూమెంట్స్‌ ఉంటాయని తెలిపారు. సినిమా టైటిల్‌ ను మిస్‌యూజ్‌ చేయలేదని, కథకు తగ్గట్టుగానే ఎపిక్ అనే పేరు పెట్టామని స్పష్టం చేశారు.

ఇది నార్మల్ కామెడీ సినిమా కాదని, ఎమోషన్స్ తో కూడిన ప్రేమకథ అని ఆనంద్ వెల్లడించారు. చాలా రోజుల తర్వాత ఇలాంటి లవ్‌స్టోరీ ప్రేక్షకుల ముందుకు వస్తుందని, సినిమా ప్రేక్షకులను సర్ప్రైజ్‌ చేస్తుందని చెప్పారు. దర్శకుడు ఆదిత్య హాసన్‌ ను కూడా ఆనంద్ ప్రశంసించారు. ఆయన అందరి జీవితాలను చాలా గమనిస్తారని, ఆయనతో మాట్లాడితే థెరపీ తీసుకున్నట్టుగా అనిపిస్తుందని అన్నారు. ఈ సినిమా తన కెరీర్‌ లో చాలా ప్రత్యేకమైనదని తెలిపారు.

హీరోయిన్ వైష్ణవి చైతన్యపై ఆనంద్ ప్రశంసలు కురిపించారు. ఆమె సినిమాకు సరైన హీరోయిన్ అని, అద్భుతంగా నటించిందని చెప్పారు. ఫ్యూచర్ లో వైష్ణవి టాప్‌ హీరోయిన్‌ గా ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్‌ అందించిన సంగీతం కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఆనంద్ పేర్కొన్నారు. ఇలా సినిమా విశేషాలతో పాటు రష్మికపై ఆనంద్ చేసిన వదినమ్మ కామెంట్స్ ఎపిక్ ట్రైలర్‌ ఈవెంట్‌ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Tags:    

Similar News