మహిళా క్రికెటర్ల ప్రేమ పెళ్లి.. దేశ సరిహద్దులు దాటి..!
మహిళా క్రికెట్ ప్రపంచంలో మరో ఆసక్తికరమైన వేడుక చర్చగా మారింది. ఇంగ్లండ్ టీమ్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ అమీ జోన్స్ ... ఆస్ట్రేలియా పేసర్ పైపా క్లియరీ వివాహ బంధంతో ఒకటయ్యారు.;
మహిళా క్రికెట్ ప్రపంచంలో మరో ఆసక్తికరమైన వేడుక చర్చగా మారింది. ఇంగ్లండ్ టీమ్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ అమీ జోన్స్ ... ఆస్ట్రేలియా పేసర్ పైపా క్లియరీ వివాహ బంధంతో ఒకటయ్యారు. 4 ఏప్రిల్ 2026న జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడం ప్రస్తుతం క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దేశ సరిహద్దులు దాటిన అరుదైన ప్రేమకథ ఇది.
వీరిద్దరి పరిచయం కేవలం అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనే కాకుండా.. ఆస్ట్రేలియాలోని డొమెస్టిక్ క్రికెట్ ద్వారా కూడా బలపడింది. ముఖ్యంగా ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (డబ్ల్యూబిబిఎల్) లో పెర్త్ స్కార్చర్స్ జట్టు తరపున ఆడే సమయంలో వీరి మధ్య స్నేహం చిగురించింది. అమీ జోన్స్ ఇంగ్లండ్ తరపున 100కు పైగా వన్డేలు, టీ20లు ఆడిన అనుభవం ఉన్న సీనియర్ క్రీడాకారణి కాగా.. పైపా క్లియరీ ఆస్ట్రేలియా డొమెస్టిక్ సర్క్యూట్‌లో 100కు పైగా టీ20లు ఆడి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. 2024 జూలైలో వీరి నిశ్చితార్థం జరిగినప్పటి నుండి అభిమానులు పెళ్లి వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మహిళా క్రికెటర్లు `సేమ్ సెక్స్ మ్యారేజ్` క్రికెట్ చరిత్రలో ఇది మొదటిసారి కాదు. గతంలో ఇంగ్లండ్‌కు చెందిన నాట్ సీవర్ - కేథరిన్ బ్రంట్, సౌతాఫ్రికాకు చెందిన మరిజానె కాప్ - డేన్ వాన్ నీకెర్క్ వంటి ప్రముఖ క్రీడాకారిణులు కూడా వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడు అమీ-పైపా తీసుకున్న ఈ నిర్ణయం క్రీడా ప్రపంచంలో సామాజిక మార్పులకు అద్దం పడుతోంది. తమ వ్యక్తిగత ఇష్టాలకు ప్రాధాన్యతనిస్తూ వారు తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయాన్ని తోటి క్రీడాకారులు అభినందిస్తున్నారు.
ప్రకృతి ఒడిలో ఎంతో నిరాడంబరంగా.. ఆహ్లాదకరంగా జరిగిన వీరి వివాహ వేడుక ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తెల్లని దుస్తుల్లో మెరిసిపోతున్న ఈ జంటను చూసి నెటిజన్లు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. కేవలం మైదానంలో ప్రత్యర్థులుగా ఉండటమే కాకుండా.. జీవిత భాగస్వాములుగా మారడం ద్వారా వారు ఒక సరికొత్త స్ఫూర్తిని నింపారు. ఈ పెళ్లితో ఇంగ్లండ్ - ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుల మధ్య కూడా ఒక సానుకూలమైన వాతావరణం ఏర్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తానికి అమీ జోన్స్ - పైపా క్లియరీల వివాహం క్రీడాకారుల వ్యక్తిగత స్వేచ్ఛకు .. వారు సమాజంలో పొందుతున్న ఆమోదానికి నిదర్శనంగా నిలిచింది. క్రీడల్లో రాణించడంతో పాటు, తమ జీవితంలోని ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా ప్రకటించడం ద్వారా వారు భవిష్యత్ తరం అథ్లెట్లకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు.