'అమృతం సీరియల్' రీమాస్టర్ వెర్షన్ మ్యాజిక్
బుల్లితెరపై టీవీ సీరియళ్లు అంటే ఒకప్పుడు అర్థం వేరు. అత్తా కోడళ్ల ఆరళ్లు, ఒకరిపై ఒకరి కుట్రలు కుతంత్రాల కథలు లేదా సెంటిమెంటు ఏడుపుగొట్టు సీన్లతో సాగే వందల ఎపిసోడ్లు మనకు గుర్తుకు వస్తాయి.;
బుల్లితెరపై టీవీ సీరియళ్లు అంటే ఒకప్పుడు అర్థం వేరు. అత్తా కోడళ్ల ఆరళ్లు, ఒకరిపై ఒకరి కుట్రలు కుతంత్రాల కథలు లేదా సెంటిమెంటు ఏడుపుగొట్టు సీన్లతో సాగే వందల ఎపిసోడ్లు మనకు గుర్తుకు వస్తాయి. సృజనాత్మకత అంటే ఇంతేనా? అంటూ విసిగిపోయేవారు. ఏళ్ల తరబడి సాగే ఏడుపుగొట్టు సీరియళ్లను ఛీదరించుకునేవారు. అయితే అప్పటికి ఇప్పటికి బుల్లితెర రంగంలో చాలా మార్పులు స్పష్ఠంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు క్రియేటివిటీ పాళ్లు పెరిగాయి. ఎప్పుడూ అవే ఏడుపుగొట్టు సీరియళ్లను ఎవరూ తీయడం లేదు. ఇటీవలి కాలంలో ఆహ్లాదకరంగా ఆనందకరంగా వినోదం పంచే సీరియళ్లకు కొదవేమీ లేదు. మహిళలకు అవసరమయ్యే సెంటిమెంటు కథల్ని అల్లినా కానీ వినోదాన్ని కాస్త ప్లెయిన్ గా మార్చేందుకు ఇటీవల క్రియేటివ్ రచయితలు, దర్శకులు పని చేస్తున్నారు.
అయితే బుల్లితెరను ఏడుపుగొట్టు సీరియళ్లు రాజ్యమేలే రోజుల్లోనే గుణ్ణం గంగరాజు- చంద్రశేఖర్ ఏలేటి టీమ్ అమృతం లాంటి ఒక కామెడీ సీరియల్ ని ప్రయోగాత్మకంగా ప్రజలకు అందించారు. కల్ట్ జానర్ లో ఇది ఆర్జీవీ `మణి మణి మణి`లాగా మనసులను గెలుచుకుంది. అనవసరమైన సెంటిమెంట్ డ్రామాలు, సాగతీసే ఏడుపు గొట్టు నాటకాలను ఇందులో చూపించకపోవడంతో ప్రజలు చాలా రిలీఫ్ ఫీలయ్యారు. అందుకే అమృతం సీరియల్ ఇప్పటికీ యూట్యూబ్ లో ఆదరణ పొందుతూనే ఉంది.
ఇప్పుడు మరోసారి అమృతం సీరియల్ ని సరికొత్తగా మేకర్స్ ప్రజల ముందుకు తేబోతున్నారు. నేటి జనరేషన్ కి నచ్చే హైక్వాలిటీ విజువల్స్, సౌండ్ సిస్టమ్ తో రీమాస్టర్ చేసిన 4కే వెర్షన్ ని అందించేందుకు అమృతం మేకర్స్ సిద్ధమయ్యారు.
``ఒరేయ్ ఆంజనేయులూ... తెగ ఆయాస పడిపోకు చాలు.. మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు...``అనే టైటిల్ సాంగ్ ను ఇప్పుడు ఇంకాస్త అడ్వాన్స్ డ్ సౌండింగ్ తో కొత్త వెర్షన్ లో వినడానికి అవకాశం ఉంది. ఈ సీరియల్ కొత్త వెర్షన్ కూడా అందరికీ స్ట్రెస్ బస్టర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంజి, అమృతం చేసే అల్లరిని మరోసారి తెలుగు లోగిళ్లలో ఎంజాయ్ చేయడానికి వీలుంది. ఈ నెల 24 నుంచి యూట్యూబ్‌లో ప్రతీ రోజూ 2 ఎపిసోడ్స్ ప్రీమియర్ కానున్నాయి. దీనిని ప్రీమియర్లు ప్రదర్శించేందుకు `అమృతం సీరియల్` అంటూ ఓ స్పెషల్ యూట్యూబ్ ఛానల్‌నే ప్రారంభించారు మేకర్స్. దీనికి సంబంధించి ట్రైలర్ కూడా ఇప్పటికే రిలీజైంది.
దాదాపు ఆరేళ్ల పాటు ఏకధాటిగా బుల్లితెరపై అలరించిన ఈ సీరియల్ లో శివాజీ రాజా కొన్ని ఎపిసోడ్లలో కనిపించగా, ఆ తర్వాత నరేష్ కొన్నిటిని నడిపించాడు. చివరివరకూ హర్షవర్ధన్ నటించాడు. ఆంజనేయులుగా గుండు హనుమంతరావు, ఆయన భార్యగా రాగిణి, ఇంటి ఓనర్ అప్పాజీగా నారిపెద్ది శివన్నారాయణ, సర్వంగా వాసు ఇంటూరి నటించారు. ఈ సీరియల్ ఆద్యంతం ప్రతి పాత్రా దేనికదే ప్రత్యేకం. హాస్య ప్రధాన ఇతివృత్తాలతో చాలా సీరియళ్లు బుల్లితెరపై వచ్చినా కానీ, అమృతం సక్సెసైనంతగా ఇంకేదీ సక్సెసవ్వలేదు.