విమర్శలతో ఆ హీరోని ఎవరూ తొక్కలేరు!
బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఫ్రాంచైజీలలో ఒకటైన `డాన్ 3` చిత్రం ప్రకటించినప్పటి నుండి నిరంతరం వార్తల్లో నిలుస్తోంది.
బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఫ్రాంచైజీలలో ఒకటైన `డాన్ 3` చిత్రం ప్రకటించినప్పటి నుండి నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. షారుఖ్ ఖాన్ స్థానంలో రణ్‌వీర్ సింగ్‌ను కొత్త డాన్ గా ఎంపిక చేయడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు, విమర్శలు వెల్లువెత్తాయి. ఐకానిక్ పాత్రలో రణ్‌వీర్‌ను అంగీకరించడానికి కొందరు అభిమానులు నిరాకరిస్తూ తీవ్రంగా ట్రోల్స్ సైతం చేశారు. ఈ నేపథ్యంలో రణ్‌వీర్ సింగ్‌కు పరిశ్రమ నుండి మద్దతు లభిస్తోంది. తాజాగా పంజాబీ స్టార్ నటుడు, గాయకుడు అమ్మీ విర్క్ ఈ వివాదంపై స్పందిస్తూ రణ్‌వీర్ సింగ్‌కు తన పూర్తి మద్దతును ప్రకటించారు.
అమ్మీ విర్క్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. రణ్‌వీర్ సింగ్‌పై వస్తోన్న విమర్శలను తోసిపుచ్చారు. గతంలో కబీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన `83` చిత్రంలో రణ్‌వీర్‌తో కలిసి నటించిన అమ్మీ విర్క్, ఆయన పనితీరును , అంకితభావాన్ని చాలా దగ్గరగా చూశారు. రణ్‌వీర్ కేవలం అద్భుతమైన నటుడే కాకుండా, సెట్స్‌పై అపారమైన శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తగా కొనియాడారు. రణ్‌వీర్ సింగ్ లాంటి అంకితభావం గల నటుడిని ఇలాంటి విమర్శలతో తక్కువ చేయలేరని అభిప్రాయపడ్డారు. రణ్‌వీర్ సింగ్ పాత్రల్లో లీనమయ్యే విధానం గురించి అమ్మీ విర్క్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ప్రతి పాత్ర కోసం రణ్‌వీర్ పడే కష్టాన్ని ఎవరూ శంకించలేరని అన్నారు. డాన్ పాత్రకు సరికొత్త శైలిని, సరికొత్త ఎనర్జీని రణ్‌వీర్ తీసుకురాగలరని నమ్మకం వ్యక్తం చేసారు. ప్రేక్షకులు సినిమాను చూడకముందే ఒక నిర్ణయానికి రావడం సరైన పద్ధతి కాదని, రణ్‌వీర్ కచ్చితంగా ఈ పాత్రలో మెప్పిస్తారని, విమర్శకుల నోళ్లు నొక్కేలా తన నటన ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టును హ్యాండిల్ చేస్తున్న దర్శకుడు ఫర్హాన్ అక్తర్ గురించి కూడా చిత్ర పరిశ్రమలో గట్టి నమ్మకం ఉంది. ఫర్హాన్ అక్తర్‌ను బాలీవుడ్‌లో ధురంధర్ గా పరిగణిస్తారు.
ఆయనకు సినిమా మేకింగ్‌పై, ముఖ్యంగా `డాన్` ఫ్రాంచైజీపై పూర్తి అవగాహన , పట్టు ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ క్లాసిక్ `డాన్` ను షారుఖ్ ఖాన్‌తో రీమేక్ చేసి, దానికి సీక్వెల్స్ అందించి ఘనవిజయం సాధించిన ట్రాక్ రికార్డ్ ఫర్హాన్‌కు ఉంది. అందువల్ల ఫర్హాన్ అక్తర్ రణ్‌వీర్ సింగ్‌ను ఎంపిక చేసుకున్నారంటే దాని వెనుక బలమైన విజన్ ఉండి తీరుతుందని అమ్మీ విర్క్ పేర్కొన్నారు. సినిమా చరిత్రను పరిశీలిస్తే ఒక సూపర్ హిట్ పాత్రను మరొక నటుడు భర్తీ చేసినప్పుడు ఇలాంటి విమర్శలు రావడం సహజమేనన్నారు. కానీ ఆ విమర్శలతో రణవీర్ సింగ్ ఎదుగు దలను ఎంత మాత్రం అడ్డుకోలేని ధీమా వ్యక్తం చేసారు. `ధురంధర్` సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించిన స్టార్ అతడు. 3000 కోట్ల వసూళ్లను బాలీవుడ్ కి..ఇండియన్ సినిమాకు అందించిన గ్రేట్ స్టార్ గా అవతరించారు. అలాంటి స్టార్ ను కొత్తగా తొక్కడం అంటూ జరగదు. ఇక రణవీర్ వేగాన్ని ఎవరూ ఆపలేరంటూ జోస్యం చెప్పారు.