బిగ్‌బికి అసహనం.. నా గురించి వాళ్లకి ఎందుకు?
ఆయన చేస్తున్న కొన్ని పనులు, చేసిన వ్యాఖ్యలు, పోషించిన పాత్రలను పదే పదే నెటిజన్స్ ట్రోల్ చేస్తూ ఉన్నారు. తాజాగా ఆ ట్రోల్స్ పై తన బ్లాక్‌లో, సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌లోనూ అమితాబచ్చన్ ఘాటుగా స్పందించారు.;
సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరూ ఏదో ఒక సమయంలో, ఏదో ఒక విషయంలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా స్టార్స్‌ను యాంటీ ఫ్యాన్స్ చాలా దారుణంగా విమర్శించడం మనం చూస్తూనే ఉంటాం. ఆ భాష.. ఈ భాష అని కాకుండా అన్ని భాషలకు సంబంధించిన స్టార్స్ ట్రోల్స్ ఎదుర్కొంటూనే ఉన్నారు. సోషల్ మీడియాలో గత కొన్నాళ్లుగా బాలీవుడ్ మెగాస్టార్, బిగ్‌బి అమితాబచ్చన్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన చేస్తున్న కొన్ని పనులు, చేసిన వ్యాఖ్యలు, పోషించిన పాత్రలను పదే పదే నెటిజన్స్ ట్రోల్ చేస్తూ ఉన్నారు. తాజాగా ఆ ట్రోల్స్ పై తన బ్లాక్‌లో, సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌లోనూ అమితాబచ్చన్ ఘాటుగా స్పందించారు.
బిగ్‌బి ట్రోల్స్ పై స్పందిస్తూ... చాలా మంది నా స్టైల్‌ను మార్చమంటున్నారు, కొందరు నేను అలా చేయకూడదు, ఇలా చేయాలని సూచిస్తున్నారు. మరికొందరు నేనే ఏం చేసినా తప్పుబడుతున్నారను. కొందరు నేను చేసే వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు. అక్కడకు వెళ్ల కుండా ఉండాల్సిందని కొందరు అంటే, ఇక్కడకు వెళ్లాల్సిందని కొందరు అంటున్నారు. నేను ఏం చేయాలి, నేను ఎలా ఉండాలి అనే విషయాలను వారు పదే పదే నాకు చెప్పడం విడ్డూరంగా అనిపిస్తుంది. వారు నన్ను ఉద్దేశించి సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలతో, విమర్శలతో విసిగి పోయాను. వారు అందరికీ సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో తాను ఈ బ్లాగ్ రాసుకు వచ్చాను అన్నట్లుగా చెప్పుకొచ్చారు.
నేను నా గురించి స్వేచ్ఛగా ఉండాలి అనుకుంటాను, అలాగే ఇతరులు ఎలా ఉంటున్నారు అనేది పట్టించుకుంటాను. నా జీవితంలో చాలా మందితో నేను విలువైన సంబంధాన్ని, సాన్నిహిత్యంను కలిగి ఉన్నాను. వారి పట్ల నాకు ఎప్పుడూ గౌరవ మర్యాదతో పాటు అభిమానం ఉంటుంది. ప్రతి విషయంలోనూ నేను అందరితో పాటు నా వ్యక్తిగత జీవితం ఉండాలని భావిస్తాను. కానీ కొందరు మాత్రం నన్ను ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా మాట్లాడాలి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వారందరూ నా నుంచి ఏది కావాలి అనుకుంటున్నారో అది కాకుండా మరేదైనా వస్తే తట్టుకోలేక పోతున్నారు. కానీ నేను మాత్రం ఏం చేయాలి అనుకుంటానో అదే చేస్తానని తన తండ్రి రాసిన కవిత్వంను ఈ సందర్భంగా తన బ్లాగ్‌లో పోస్ట్ చేశారు.
ఇదే సమయంలో బిగ్‌బి దేశ ఆర్థిక వ్యవస్థ గురించి స్పందించారు. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా నిలవడం పట్ల అమితాబ్ సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో మరింత ముందుకు దేశం వెళ్తుందనే నమ్మకం, విశ్వాసం తనకు ఉందని అమితాబ్ చెప్పుకొచ్చారు. రాబోయే రెండున్నర, మూడు ఏళ్లలో ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా నిలుస్తుంది అనే విశ్వాసంను అమితాబ్ వ్యక్తం చేశారు. ఇండియా సాధించిన ఆర్థిక వృద్దిని అమితాబ్ కొనియాడారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లకే ఈ స్థాయి పురోగతి సాధించడం అనేది అతి గొప్ప విషయంగా అమితాబ్ బచ్చన్ అభివర్ణించారు.
తాజాగా ఇండియా-పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో అగ్ని వీరులు సాగించిన పోరాటంపైనా అమితాబ్ ప్రశంసలు కురిపించారు. వారు దేశాన్ని కాపాడటంలో ముందు నిలిచారు. వారి వల్లే ఇప్పుడు దేశం భద్రత విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది. దేశం యొక్క భద్రత విషయంలో ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అన్ని రకాల సేనలు సంసిద్దంగా ఉండటం వల్ల శత్రువులు ఎక్కడ నుంచి వచ్చిన తుదముట్టించేందుకు రెడీగా ఉన్నారని అమితాబ్ చెప్పుకొచ్చారు. తనపై వస్తున్న ట్రోల్స్‌కు సమాధానం చెబుతూనే దేశ ఆర్థిక వ్యవస్థ, సైనిక వ్యవస్థ గురించి బిగ్‌బి చేసిన వ్యాఖ్యలు, ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.