రాజ్‌పాల్ యాదవ్ తర్వాత మరో సెలబ్రిటీ అరెస్ట్?
అయితే గత కొంతకాలంగా అమీషా పటేల్ పేరు కొన్ని ఆర్థిక వివాదాల్లో మీడియా హెడ్ లైన్స్ లోకొస్తోంది.;
బాలీవుడ్‌లో ఇటీవల వరుసగా సెలబ్రిటీలు చట్టపరమైన చిక్కుల్లో పడుతున్నారు. హాస్యనటుడు రాజ్‌పాల్ యాదవ్ అరెస్ట్ అయిన కొద్ది రోజులకే నటి అమీషా పటేల్ కు కూడా నాన్-బెయిలబుల్ వారెంట్ (ఎన్.బి.డబ్ల్యూ) జారీ కావడం ఇండస్ట్రీలో కలకలం రేపింది. అమీషా పటేల్ హృతిక్ రోషన్ సరసన `కహోనా ప్యార్ హై` చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన `బద్రి` చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండు పరిశ్రమల్లో డెబ్యూ సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాల్ని సాధించడంతో అమీషా పేరు మార్మోగింది. టాలీవుడ్ లో పవన్ కల్యాణ్, మహేష్ బాబు, బాలకృష్ణ వంటి అగ్ర హీరోల సరసన అమీషా నటించింది. అదే క్రమంలో ఈ భామకు తెలుగులోను అంతో ఇంతో ఫాలోయింగ్ ఏర్పడింది. అమీషా ఇటీవల బాలీవుడ్ లో అడపాదడపా నటిస్తోంది. మరోవైపు తన సొంత పరిశ్రమ మరాఠాలోను నటిస్తూ బిజీగా ఉంది.
అయితే గత కొంతకాలంగా అమీషా పటేల్ పేరు కొన్ని ఆర్థిక వివాదాల్లో మీడియా హెడ్ లైన్స్ లోకొస్తోంది. ఈ భామపై ఓ ఆర్థిక వ్యవహారంలో నమోదైన పాత కేసుకు సంబంధించి ఇప్పుడు బెయిల్ లేని అరెస్ట్ వారెంట్ జారీ అవ్వడంతో అది చర్చగా మారింది. యూపీలోని మొరాదాబాద్ కోర్టు 16 ఫిబ్రవరి 2026న అమీషా పటేల్‌పై ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
వివాదం పూర్వాపరాల్లోకి వెళితే.. 2017లో మొరాదాబాద్‌కు చెందిన ఈవెంట్ ఆర్గనైజర్ పవన్ వర్మ ఒక పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేసేందుకు అమీషాకు రూ.14.50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. అయితే అమీషా ఆ ప్రోగ్రామ్‌కు అటెండ్ కాలేదు. ముంబై నుంచి ఈవెంట్ కి వెళ్లలేకపోవడంతో ఆ తర్వాత వివాదం మొదలైంది. అమీషా ఆ తర్వాత ఈవెంట్ ఆర్గనైజర్ పవన్ కు రూ.10 లక్షలు నగదు రూపంలో తిరిగి ఇచ్చినా మిగిలిన 4.50 లక్షల కోసం ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యింది. విచారణకు పదే పదే గైర్హాజరు కావడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి అమీషాను 27 మార్చి 2026న వ్యక్తిగతంగా హాజరుకావాలని వారెంట్ జారీ చేసింది. లేనిపక్షంలో అరెస్ట్ చేసే అవకాశం ఉందని కథనాలొస్తున్నాయి.
అది చాలా పాత కేసు:
అయితే ఈ వార్తలపై అమీషా పటేల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ``అది పాత విషయం.. చాలా ఏళ్ల నాటి పాత కేసు.. ఇప్పటికే పవన్ వర్మతో సెటిల్‌మెంట్ పూర్తయింది`` అని అమీషా పేర్కొన్నారు. పవన్ వర్మ డబ్బులు తీసుకుని కూడా కేవలం పబ్లిసిటీ కోసం అబద్ధాలు చెబుతున్నారని, ఆయనపై తన లాయర్లు `చీటింగ్` కేసు పెట్టబోతున్నారని అమీషా హెచ్చరించారు.
9 కోట్ల అప్పు కేసులో చెక్కులు బౌన్స్ అవ్వడంతో రాజ్‌పాల్ యాదవ్ అరెస్టయ్యారు. ఈ కేసు గురించి చర్చ సాగుతుండగానే, అమీషా పటేల్ ఇదే తరహాలో చెక్ బౌన్స్ (సెక్షన్ 138) కేసును ఎదుర్కొంటోంది. రాజ్‌పాల్ యాదవ్ కోర్టు గడువులను పాటించకపోవడంతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అమీషా పటేల్ కూడా ఇంచుమించు అలానే చేసారు. తాజాగా కోర్ట్ అల్టిమేటమ్ మేరకు.. మార్చి 27 లోపు కోర్టులో హాజరుకాకపోతే తనకు కూడా జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది. అయితే అమీషా కేసులో కేవలం లక్షల్లోనే కాబట్టి పరిష్కారం కోర్టు వెలుపల దొరుకుతుందా? అమీషా పటేల్ మార్చి 27న కోర్టుకు హాజరై పరిష్కరించుకుంటారా? ఇందులో ఈవెంట్ ఆర్గనైజర్ తప్పును నిరూపిస్తుందా? అన్నది వేచి చూడాలి.