బెంగళూరు AMB సినిమాస్‌లో మొదటి రిలీజ్ ఇదే
AMB సినిమాస్ ఇకపై విస్తరణ ప్రణాళికల్లో దూకుడు పెంచనుందని సమాచారం. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఏషియన్ సినిమాస్ ఈ భారీ వ్యాపార వాణిజ్యానికి తెర లేపింది.;
AMB సినిమాస్ ఇకపై విస్తరణ ప్రణాళికల్లో దూకుడు పెంచనుందని సమాచారం. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఏషియన్ సినిమాస్ ఈ భారీ వ్యాపార వాణిజ్యానికి తెర లేపింది. స్టార్లతో కలిసి ఏషియన్ సినిమాస్ పలు మల్టీప్లెక్సుల్ని నిర్మించడం, అవి సక్సెసవ్వడంతో మహేష్ తో ప్రాజెక్ట్ సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది.
భారీ వ్యాపార వాణిజ్య సముదాయాలలో సినిమా ఉన్నతికి ఏషియన్ సినిమాస్ తనవంతు కృషి చేస్తోంది. ఇంతకుముందు హైదరాబాద్ గచ్చిబౌళిలో మహేష్ తో కలిసి ఏఎంబి సినిమాస్ ని నిర్మించింది. నగరంలోని ప్రధానమైన సాఫ్ట్ వేర్ హబ్ కి సమీపంగా ఈ థియేటర్లు లాంచ్ అవ్వడంతో ఏఎంబి సినిమాస్ గ్రాండ్ సక్సెసైంది.
ఏఎంబి సినిమాస్ ని ఇకపైనా పలు నగరాల్లో భారీగా విస్తరించనున్నారని సమాచారం. ఇప్పుడు ఏఎంబి సినిమాస్ రెండో ప్రాజెక్ట్ ను బెంగళూరులో లాంచ్ చేసేందుకు నిర్మాణం సిద్ధంగా ఉంది. డిసెంబర్‌లో ఈ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేసినా రకరకాల కారణాలతో వాయిదా పడింది. తాజా సమాచారం మేరకు జనవరి 3న ప్రభాస్ `రాజా సాబ్` సినిమాతో బెంగళూరు ఏఎంబి సినిమాస్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. బెంగళూరు గాంధీ నగర్‌లోని `కపాలి థియేటర్` AMB సినిమాస్‌గా రూపాంతరం చెందింది. దీనికోసం వందల కోట్ల బడ్జెట్లు ఖర్చు చేసారని తెలుస్తోంది.
ఈసారి సంక్రాంతి బరిలో మల్టీప్లెక్సులకు కొత్త కళ రానుంది. ప్రభాస్ రాజా సాబ్, మెగాస్టార్ చిరంజీవి నటించిన `మన శివశంకర వరప్రసాద్ గారు` అన్ని ప్రధాన మెట్రోల్లో భారీగా విడుదలవుతున్నాయి. ఇవి రెండూ అగ్ర హీరోలు నటించిన భారీ సినిమాలు కావడంతో కొత్త థియేటర్ కూడా కళకళలాడుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో దళపతి విజయ్ నటించిన `జన నాయకుడు` కూడా సంక్రాంతి బరిలో అత్యంత భారీగా విడుదలవుతోంది. బాలీవుడ్ నుంచి `పరాశక్తి` అనువాదం కూడా క్రేజీగా విడుదలవుతుండడంతో థియేటర్లకు సంక్రాంతి కొత్త కళను తేనుంది.