CM రేవంత్‌ని కలిసిన వీరమల్లు నిర్మాత
ఈరోజు ఉదయం నుంచి నిర్మాత ఏఎం రత్నం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారని, కండిషన్ సీరియస్ గా ఉందని కొన్ని మీడియాల్లో ప్రచారమైంది.;
ఈరోజు ఉదయం నుంచి నిర్మాత ఏఎం రత్నం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారని, కండిషన్ సీరియస్ గా ఉందని కొన్ని మీడియాల్లో ప్రచారమైంది. హరిహర వీరమల్లు ప్రచారం, రిలీజ్ షెడ్యూళ్లతో బిజీగా ఉన్న ఆయన, కళ్లు తిరిగి పడిపోవడంతో ఆస్పత్రి పాలయ్యారంటూ ఒక సెక్షన్ మీడియాలో ప్రచారమైంది.
అయితే ఈ వార్తల్ని ఏఎం రత్నం సోదరుడు ఎ. దయాకర్ రావు ఖండించారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని కోరారు. ఇంతలోనే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏ.ఎం రత్నం కలిసారని, టికెట్ రేట్లు సహా పలు అంశాలపై ముఖ్యమంత్రితో మంతనాలు సాగించారని అధికారికంగా చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. రేవంత్ తో రత్నం ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
ఈ ఫోటోగ్రాఫ్‌లో ఏ.ఎం.రత్నం ఆరోగ్యంగానే కనిపించారు. ముఖ్యమంత్రికి శాలువా కప్పి సన్మానం చేసారు రత్నం. ఈ సందర్భంగా సీఎంకు వీరమల్లు చారిత్రక నేపథ్యం గురించి, 17వ శాతాబ్ధంలో జరిగిన ఈ సినిమా కథాంశం గురించి రత్నం వివరించి చెప్పారట. తెలంగాణలో తొలి వీకెండ్ టికెట్ రేట్ల పెంపు గురించి కూడా సీఎంను అభ్యర్థించారని కథనాలొస్తున్నాయి. తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు ముఖ్యమంత్రికి ఏ.ఎం.రత్నం కృతజ్ఞతలు తెలిపారు.
పీరియడ్ డ్రామా `హరిహర వీరమల్లు రిలీజ్ కొంత ఆలస్యమైన మాట వాస్తవం. అయితే ఇప్పుడు అన్నివిధాలా సిద్ధమై, జూన్ 12న విడుదలకు సిద్ధంగా ఉంది. క్రిష్ జాగర్లముడి, ఎ.ఎం. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 17వ శతాబ్దపు మొఘల్ శకంలో సాగే కథతో రూపొందింది. కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే మిషన్ అప్పగించిన క్రమంలో వీరమల్లు పరాక్రమం ఎలాంటిదో తెరపై ఆవిష్కరిస్తున్నారు. తారాగణంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి కూడా ఉన్నారు. ఈ సినిమా స్క్రీన్‌ప్లేను సాయి మాధవ్ బుర్రాతో కలిసి క్రిష్ జాగర్లముడి రాశారు. ఎం.ఎం. కీరవాణి స్వరాలు అందించారు.