టాప్ హీరోయిన్‌తో గొడవలపై నటుడు ఏం చెప్పాడంటే?
యానిమల్ చిత్రంలో అబ్రార్ గా నటించి మనసులు గెలుచుకున్నాడు బాబి డియోల్.
యానిమల్ చిత్రంలో అబ్రార్ గా నటించి మనసులు గెలుచుకున్నాడు బాబి డియోల్. ఈ సినిమా ఇచ్చిన బ్రేక్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ని జాలీగా నడిపించేస్తున్నాడు. నటుడిగా అతడు ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒక రకంగా అవకాశాల క్రైసిస్ నుంచి కోలుకున్నాడు. అతడు ఆలియాతో కలిసి ఆల్ఫా అనే భారీ స్పై యాక్షన్ చిత్రంలోను నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్లో ఆలియాతో అబ్రార్ బాబీకి పొసగడం లేదని గుసగుసలు వినిపించాయి. అయితే ఇన్నాళ్లు ఈ గొడవల గురించి బాబీ నోరు మెదపలేదు. ఎట్టకేలకు దీనిపై వివరణ ఇచ్చాడు గురుడు! ఇంతకీ ఏం చెప్పాడంటే...?
యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న హై-యాక్షన్ ఎంటర్‌టైనర్ `ఆల్ఫా` సెట్స్‌లో వీరిద్దరి మధ్య గొడవ జరిగిందంటూ చాలా కాలంగా వినిపిస్తున్న రూమర్స్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ తీవ్రమైన చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై నటుడు బాబీ డియోల్ స్పందిస్తూ.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. సోషల్ మీడియా యుగంలో కేవలం కొద్దిమంది వ్యక్తులు ప్రచారం కోసం సృష్టించే ఇటువంటి నిరాధారమైన వార్తలను తానేమీ పట్టించుకోనని.. ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పుకుంటూ తిరగలేనని ఘాటుగా స్పందించారు.
ఈ వార్తలపై పాపులర్ చానెల్ తో బాబీ మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. తన స్నేహితుడు ఒకరు ఆ రూమర్‌కు సంబంధించిన స్నాప్‌షాట్‌ను తనకు పంపించారని...అది చూసి తాను కూడా చాలా ఆశ్చర్యపోయానని బాబీ పేర్కొన్నారు. లోకంలో జనాలు ఎంత ఖాళీగా ఉన్నారంటే.. వారికి తోచింది ఏదో ఒకటి రాసేసి ఇలాంటి కథనాలు అల్లేస్తున్నారని మండిపడ్డారు. సినిమా సెట్స్‌లో తామిద్దరం ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో పనిచేశామని.... ఇద్దరు ప్రొఫెషనల్ నటుల మధ్య గొడవలు జరిగాయని రాయడం కేవలం సంచలనం కోసం చేసే ప్రయత్నమేనని ఆయన కొట్టిపారేశారు.
ఇదే ఇంటర్వ్యూలో అలియా భట్ పనితీరును, వృత్తిపరమైన నిబద్ధతను బాబీ డియోల్ ఆకాశానికెత్తారు. అలియా చాలా అద్భుతమైన నటి మాత్రమే కాదు.. ఎంతో ప్రొఫెషనల్ అని కొనియాడారు. తను చేసే ప్రతి పాత్ర కోసం విపరీతంగా శ్రమిస్తుందని ప్రశంసించారు. ముఖ్యంగా `ఆల్ఫా` చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం అలియా భట్ ఎంతగానో ముందస్తుగా సన్నద్ధమైందని.... సినిమాలోని ఫైట్ సీన్‌లన్నింటినీ పూర్తి సన్నద్ధతతో, అంకితభావంతో పూర్తి చేసిందని బాబీ డియోల్ వెల్లడించారు.
ఇంతటి అంకితభావంతో పనిచేస్తున్న తమ మధ్య విభేదాలున్నయనే వార్తలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎవరు ఏం ఆలోచించి ఇలాంటి అబద్ధపు రూమర్లను రాశారో తనకు అస్సలు అర్థం కావడం లేదని.. తన గురించి వచ్చే ప్రతి తప్పుడు వార్తపై స్పందిస్తూ అందరికీ నిరూపించుకుంటూ తిరగలేనని ఫైరయ్యారు. ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని బాబీ డియోల్ తేల్చి చెప్పారు. ఇండస్ట్రీలో ఇలాంటి పుకార్లు రావడం కొత్తేమీ కాదని.. వాటిని లైట్ తీసుకోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత తరం ప్రేక్షకులు సోషల్ మీడియా చూసి ఎక్కువగా ప్రభావితం అవుతున్నారని బాబీ డియోల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఇన్‌స్టా వేదికలలో వచ్చే సమాచారాన్ని బ్లైండ్‌గా నమ్మేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచారమయ్యే కథనాల్లో 90 శాతం వరకు నిజాలు ఉండవని బాబీ అన్నారు. ప్రస్తుతం యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న భారీ యాక్షన్ చిత్రం `ఆల్ఫా` షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా డిలేపై చిత్రబృందం ఇంకా స్పందించాల్సి ఉంది.