100 కోట్ల అల్లు స్టూడియోస్ ఇంద్ర లోకానికి త‌క్కువేమీ కాదు!

అల్లు స్టూడియోస్ హైదరాబాద్‌లోని గండిపేట-కోకాపేట పరిసరాల్లో.. ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలో ఉంది.;

Update: 2026-03-03 03:00 GMT

అల్లు శిరీష్‌ - నైనికల ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్ వేడుక కేవలం ఒక ఫంక్షన్ లాగా కాకుండా.. ఒక భారీ సినిమా సెట్టింగ్‌ను తలపించింది. దీనికి ప్రధాన కారణం ఈ వేడుక జరిగిన వేదిక `అల్లు స్టూడియోస్` కావ‌డ‌మే. అల్లు అరవింద్, అల్లు అర్జున్ బృందం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ స్టూడియోలో జరిగిన మొదటి భారీ శుభకార్యం ఇదే కావడంతో.. అల్లు వారు తమ సొంత స్టూడియోను ఒక దేవ(ఇంద్ర‌)లోకంలా ముస్తాబు చేశారు. ఈ వేడుక కోసం వేసిన ప్రత్యేక సెట్టింగులు, అద్భుతమైన కలర్ గ్రేడింగ్ లైటింగ్ స్కీమ్ అతిథులను మంత్రముగ్ధులను చేశాయి.

అల్లు స్టూడియోస్ హైదరాబాద్‌లోని గండిపేట-కోకాపేట పరిసరాల్లో.. ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలో ఉంది. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ స్టూడియోను లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా అల్లు కుటుంబం ప్రారంభించింది. ఒకప్పుడు కేవలం షూటింగ్స్ కోసం మాత్రమే అనుకున్న ఈ ప్రాంగణం.. ఇప్పుడు శిరీష్ రిసెప్షన్ వేడుకతో ఒక బెస్ట్ ఈవెంట్ డెస్టినేషన్‌గా కూడా తన సత్తా చాటుకుంది.

ఈ స్టూడియో నిర్మాణం కోసం అల్లు అరవింద్ - అల్లు అర్జున్ దాదాపు 100 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. కేవలం స్థలం మాత్రమే కాకుండా.. లోపల ఏర్పాటు చేసిన అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలు, సౌండ్ ఫ్రూఫ్ ఫ్లోర్స్ .. భారీ సెట్స్ వేసుకునేందుకు వీలుగా ఉన్న ఖాళీ ప్రదేశాల కోసం భారీగా ఖర్చు చేశారు. ఈ స్టూడియోను అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా డిజైన్ చేయడం విశేషం.

అల్లు అరవింద్ తన మాస్టర్ ప్లానింగ్‌తో ఈ స్టూడియోలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. షూటింగ్ కోసం వచ్చే వారికి అవసరమైన మేకప్ రూమ్స్, కాస్ట్యూమ్ విభాగాలు, అత్యాధునిక కెమెరా ఎక్విప్‌మెంట్, పార్కింగ్ సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. కేవలం తమ సొంత సినిమాలకే కాకుండా బయటి నిర్మాతలకు కూడా అందుబాటులో ఉండేలా.. షూటింగ్ ఖర్చులను తగ్గించే విధంగా ఈ స్టూడియోను తీర్చిదిద్దారు. భవిష్యత్తులో ఇక్కడ మరిన్ని భారీ పాన్ ఇండియా చిత్రాల షూటింగ్స్ జరగనున్నాయి.

సినిమా పరిశ్రమకు ఈ స్టూడియో ఒక వరప్రసాదంగా మారనుంది. హైదరాబాద్ నగరానికి ప్రధాన కూడలిలో ఉండటం.. కోకాపేట వంటి ఐటీ హబ్‌కు దగ్గరగా ఉండటంతో సినీ ప్రముఖులకు ఇది ఎంతో అనుకూలంగా మారింది. ముఖ్యంగా భారీ యాక్షన్ సీక్వెన్స్.. సాంగ్ షూటింగ్స్ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అన్ని వసతులు కల్పించడం ద్వారా తెలుగు సినిమా మేకింగ్ ప్రమాణాలను అల్లు ఫ్యామిలీ మరో మెట్టు ఎక్కించింది.

ఇక అల్లు శిరీష్ రిసెప్షన్ వేడుకకు వచ్చిన వారంతా ఈ స్టూడియో వైభవాన్ని చూసి ఆశ్చర్యపోయారు. లైటింగ్ దగ్గర నుండి డెకరేషన్ వరకు ప్రతి చిన్న విషయంలోనూ అల్లు అర్జున్ స్వయంగా పర్యవేక్షించడంతో.. అల్లు స్టూడియోస్ ఒక వెడ్డింగ్ ప్యాలెస్‌లా మెరిసిపోయింది. మార్చి 6న జరగబోయే వివాహ వేడుకకు ముందు ఈ రిసెప్షన్ ఈవెంట్‌తో అల్లు స్టూడియోస్ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది.

Tags:    

Similar News