అల్లు కనకరత్నమ్మ పెద్దకర్మ.. చిరు, పవన్, చరణ్ హాజరు

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట ఇటీవల విషాదం నెలకొన్న విషయం తెలిసిందే.;

Update: 2025-09-08 17:16 GMT

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట ఇటీవల విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ (94) ఆగస్టు 30న కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్‌ లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచి లోకాన్ని వీడారు.

అదే సమయంలో ఇతరుల జీవితాల్లో వెలుగు నింపేందుకు కళ్లు దానం చేశారు. అయితే అల్లు రామలింగయ్య, కనకరత్నమ్మ దంపతులకు ఒక్క కుమారుడు అల్లు అరవింద్ కాగా.. కుమార్తెలు వసంత లక్ష్మి, సురేఖ ఉన్నారు. పెద్ద కుమార్తె నవభారతి ఇప్పటికే మరణించారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణిగా సురేఖ మనందరికీ సుపరిచితమే.

అయితే నేడు కనకరత్నమ్మ దశదిన కర్మను కుటుంబ సభ్యులు నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోని ఓ కన్వెన్షన్ సెంటర్ లో ఆమె దశదిన కర్మ జరగ్గా.. పలు ప్రముఖులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్, అగ్ర కథానాయకుడు చిరంజీవి, స్టార్ హీరో రామ్‌ చరణ్‌, బీఆర్ ఎస్ నేత కేటీఆర్ తదితరులు కార్యక్రమానికి వెళ్లారు.

అక్కడ అల్లు కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం వారంతా కనకరత్నమ్మ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఆ సమయంలో ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వివిధ చిత్రాలు.. నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఇప్పుడు గీతా ఆర్ట్స్ సంస్థ కూడా పోస్ట్ చేసింది. "నేడు శ్రీ అల్లు కనకరత్నమ్మ పెద్ద కర్మలోని ప్రతి ప్రార్థనలోనూ, ప్రతి క్షణంలోనూ ఆమె ఉనికిని అనుభవించాం. ఆమె కురిపించిన ప్రేమతోపాటు మనలో నింపిన విలువలను జ్ఞాపకం చేసుకున్నాం. ఆమె ఆశీర్వాదాలు, జ్ఞాపకాలు ఎప్పటికీ మా హృదయాలలో నిలిచి ఉంటాయి" అంటూ రాసుకొచ్చింది.

పలు చిత్రాలను కూడా షేర్ చేయగా.. అందులో మెగా, అల్లు కుటుంబ సభ్యులంతా ఉన్నారు. ఓ ఫోటోలో కనకరత్నమ్మ కుమారుడు, కోడలు, కూతుళ్లు, అల్లుళ్లు కనిపించారు. మరో పిక్ లో అల్లు అరవింద్ కుటుంబమంతా ఉన్నారు. ఇంకో ఫోటోలో రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ మాట్లాడుతూ కనిపించారు. ఆ పిక్ ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది. అల్లు, మెగా ఫ్యామిలీలు ఒక్కటేనని చెప్పకనే చెబుతోంది.

Tags:    

Similar News