పుష్పకు గౌరవం అంటూ హృతిక్‌ని లైట్ తీస్కున్నాడు!
ఇంతలోనే ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ దురంధర్ సినిమాని వీక్షించిన తర్వాత చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు.;
బాలీవుడ్ ద్శకుడు ఆధిత్యధర్ బ్యాక్ టు బ్యాక్ భారీ విజయాలను అందుకున్నాడు. తీవ్రవాదం, దేశభక్తి నేపథ్యంలో రూపొందించిన `యూరి` చిత్రం దర్శకుడిగా అతడి పనితనాన్ని ప్రపంచానికి చాటింది. విక్కీ కౌశల్ ఈ సినిమాతో పెద్ద స్టార్ అయ్యాడు. ఇప్పుడు దురంధర్ లాంటి బ్లాక్ బస్టర్ తో ఆదిత్యధర్ పేరు మరోసారి మార్మోగుతోంది. ఈ సినిమా కథాంశం కూడా పాకిస్తానీ తీవ్రవాదం, అక్కడ రాజకీయాల నేపథ్యంలో రక్తి కట్టించింది. పాకిస్తాన్ రాజకీయాల్లో అల్లకల్లోలం సృష్టించే ఒక ఇండియన్ స్పై పాత్రలో రణ్ వీర్ సింగ్ అద్భుతంగా నటించాడని ప్రశంసలు కురుస్తున్నాయి.
దురంధర్ చిత్రంపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్ లాంటి ప్రముఖులు ఈ సినిమా మేకింగ్ గురించి, ఎంపిక చేసుకున్న కథ, పాత్రల గురించి ప్రశంసలు కురిపించారు. అయితే గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఇతరులకు భిన్నంగా స్పందించాడు. ఈ సినిమాలో రాజకీయాల్ని ప్రశ్నిస్తూ విమర్శల పాలయ్యాడు. ఆదిత్యధర్ ఈ సినిమాని తెరకెక్కించిన విధానాన్ని కీర్తించినా కానీ, ఇందులో రాజకీయాల్ని వన్ సైడెడ్ గా కుక్ చేసారని క్రిటిసైజ్ చేసాడు. అయితే ఇది చాలామందికి రుచించలేదు.
ఇంతలోనే ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ దురంధర్ సినిమాని వీక్షించిన తర్వాత చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. రణ్ వీర్, ఆదిత్యధర్ టీమ్ ని అభినందించాడు. అల్లు అర్జున్ లాంటి స్టార్ నుంచి ప్రశంసలు రాగానే ఆదిత్యధర్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అల్లు అర్జున్ ఉదారమైన మాటలు తమ బృందంలో ఉత్సాహం నింపాయని అన్నారు. ``మేమంతా ధురంధర్‌పై మా హృదయాలను కుమ్మరించాము. మీ స్థాయి కళాకారుడి నుండి ఇది వినడం నిజంగా ప్రత్యేకమైనది. మా టీమ్ కి మీరంటే చాలా ప్రేమ, గౌరవం.. ధన్యవాదాలు సర్`` అని ఆదిత్య ధర్ రిప్లయ్ ఇచ్చాడు.
నిజానికి హృతిక్ రోషన్ కూడా తన మాటల్లో ఆదిత్యధర్ టీమ్‌ని ప్రశంసించారు. కానీ కొన్ని సునిశిత విమర్శలు చేయడంతో ఆదిత్యధర్ ఎందుకనో అతడికి రిప్లయ్ ఇవ్వలేదు. బహుశా హృతిక్ వ్యాఖ్యలలో సినిమా కోసం స్క్రిప్టును చాలా తెలివిగా వండారు.. సినిమా కోసమే ఇదంతా! అనే ఉద్దేశాన్ని బయటపెట్టడంతో అది ఆదిత్యాధర్ కి నచ్చలేదని అభిమానులు భావిస్తున్నారు. అందుకే హృతిక్ కి అతడు రిప్లయ్ ఇవ్వలేదు.
హృతిక్ ఇంకా ఈ సినిమాపై ఇలా వ్యాఖ్యానించారు. ``నేను ఈ సినిమాలో చూపించిన రాజకీయాలతో విభేధించవచ్చు.. ప్రపంచ పౌరులుగా ఫిలింమేకర్స్ బాధ్యత వహించాల్సిన విషయాలపై వాదించవచ్చు. అయినా కానీ సినిమా విద్యార్థిగా నేను ఈ చిత్రాన్ని ప్రేమించాను.. నేర్చుకున్నాను.. ఇది అద్భుతం`` అని హృతిక్ అన్నారు.
నిజానికి ఇండియా - పాకిస్తాన్ సహా జియో పాలిటిక్స్ లో వర్తమాన రాజకీయాలను ఉపయోగించి కొన్ని వాస్తవాలను దురంధర్ ద్వారా తెరపైకి తెచ్చాడని చాలామంది అంచనా వేస్తున్నారు. కానీ కొందరు దీనిని వన్ సైడెడ్ మూవీ అంటూ విమర్శిస్తున్నారు. ఒకరిని సాధువులుగా చూపించడం, ఒకరిని విలన్లుగా చూపించడమే రాజకీయం! అని ఒకరు విమర్శించారు. నిజానికి యూరి సినిమా తీసినప్పుడు కూడా ఒక వర్గం ఇదే విధంగా విమర్శలు గుప్పించింది. మీమ్స్ ఎప్పుడూ వెంబడిస్తూనే ఉన్నాయి. ఇంటర్నెట్ లో వర్గాలుగా విడిపోయి ఎవరికి వారు విడివిడిగా తమ అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు.