HPV వ్యాక్సిన్ పై బన్నీ ఫ్యాన్స్ 'డ్రైవ్'.. ఫ్యాన్ కల్చర్‌ కు 'కొత్త' అర్థం..

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు మరోసారి తమ సామాజిక బాధ్యతను చాటుతున్నారు.;

Update: 2026-04-08 04:19 GMT

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు మరోసారి తమ సామాజిక బాధ్యతను చాటుతున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఆధ్వర్యంలో హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) వ్యాక్సిన్‌ పై అవగాహన కార్యక్రమాలు ప్రారంభించారు. ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ఉపయోగపడే ఆ వ్యాక్సిన్ ప్రాధాన్యతను ప్రజలకు చేరవేయడం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.




 


HPV వ్యాక్సిన్ అనేది సర్వైకల్ క్యాన్సర్‌ ను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వైద్య నిపుణుల సూచనల ప్రకారం.. 13 నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న బాలికలు ఆ వ్యాక్సిన్ తీసుకుంటే, భవిష్యత్తులో సర్వికల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో AAFA సభ్యులు గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఇండియన్ గవర్న్మెంట్ కూడా HPV వ్యాక్సిన్‌ ను ఇప్పటికే అనుమతించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆ వ్యాక్సిన్‌ ను ఉచితంగా అందిస్తున్నారని ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. అయితే, చాలా మందికి ఆ విషయంపై సరైన అవగాహన లేకపోవడంతో.. ఆ డ్రైవ్ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు.

అల్లు అర్జున్ తన పుట్టినరోజు నుంచి తదుపరి పుట్టినరోజు వరకు ప్రతి ఏడాది ఒక మంచి సామాజిక అంశాన్ని ప్రోత్సహించాలని అభిమానులకు సూచించిన విషయం తెలిసిందే. అదే స్ఫూర్తితో ఈసారి HPV వ్యాక్సిన్‌పై దృష్టి సారించినట్లు AAFA సభ్యులు వెల్లడించారు. ఆయన చూపించిన మార్గంలోనే అభిమానులు తమ పవర్ ను సొసైటీ కోసం వినియోగిస్తున్నామని చెప్పారు.

AAFA ప్రారంభ సమయంలో ఫ్యాన్ అసోసియేషన్స్ పాత్రపై కొంత విమర్శలు వచ్చినా, అల్లు అర్జున్ ఉద్దేశ్యం మాత్రం స్పష్టమని అభిమానులు చెబుతున్నారు. యువతలో ఉన్న పవన్ ను మంచి పనుల కోసం ఉపయోగించాలనే సంకల్పంతోనే ఆ సంస్థను ప్రోత్సహించారని తెలిపారు. యూత్ ఎనర్జీని అనవసర విషయాల్లో కాకుండా, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల వైపు మళ్లించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ ఫామ్స్ ద్వారా కూడా HPV వ్యాక్సిన్‌ పై ప్రచారం చేపడుతున్నారు. పోస్టర్లు, వీడియోలు, అవగాహన సందేశాల ద్వారా ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే క్యాంపులు, అవగాహన సమావేశాలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, తమ కూతుళ్లకు సమయానికి వ్యాక్సిన్ వేయించేందుకు ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యంగా AAFA పేర్కొంది.

ఏదేమైనా సమాజంలో ఆరోగ్యంపై అవగాహన పెంచే దిశగా అల్లు అర్జున్ అభిమానుల ప్రయత్నం ప్రశంసనీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి.. అల్లు అర్జున్ అభిమానులు తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం ఉన్న ఫ్యాన్ కల్చర్‌ కు కొత్త అర్థం తీసుకువస్తోందని చెప్పాలి. వినోదం మాత్రమే కాకుండా, సామాజిక బాధ్యతను కూడా గుర్తుచేస్తూ, యూత్ ను మంచి మార్గంలో నడిపించే ప్రయత్నంగా డ్రైవ్ నిలుస్తోంది.

Tags:    

Similar News