820 స్కూల్ ప్రోగ్రామ్స్.. బన్నీ ఫ్యాన్స్ భారీ క్యాంపెయిన్

సినిమా రిలీజ్‌లు, బర్త్‌డే సెలబ్రేషన్స్, సేవా కార్యక్రమాలు.. నార్మల్ గా స్టార్ హీరోల ఫ్యాన్ అసోసియేషన్స్ పేరు ఇలాంటి సందర్భాల్లోనే ఎక్కువగా వినిపిస్తుంది.

Update: 2026-09-10 10:02 GMT

సినిమా రిలీజ్‌లు, బర్త్‌డే సెలబ్రేషన్స్, సేవా కార్యక్రమాలు.. నార్మల్ గా స్టార్ హీరోల ఫ్యాన్ అసోసియేషన్స్ పేరు ఇలాంటి సందర్భాల్లోనే ఎక్కువగా వినిపిస్తుంది. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇప్పుడు మరో మంచి రూట్లో హైలెట్ అవుతోంది. హెచ్‌పీవీ అవేర్‌నెస్ కార్యక్రమాన్ని ఇప్పుడు ఎనిమిది ప్రాంతాలకు విస్తరించి మరో లెవెల్ కు తీసుకెళ్లింది. హెచ్‌పీవీ అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్. ఈ వైరస్‌లోని కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు తర్వాత సర్వికల్ క్యాన్సర్‌కు కారణమయ్యే ప్రమాదం ఉంటుంది.




 


అందుకే స్కూల్ దశలోనే విద్యార్థినులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. డైరెక్ట్ గా ప్రచారం చేస్తూ ఇప్పటివరకు 820 అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించి, దాదాపు 3 లక్షల మంది బాలికలను చేరుకున్నట్లు అసోసియేషన్ తెలిపింది. ఈ కార్యక్రమాలు ఒక్క తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఒడిశా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఫ్యాన్స్ ఈ అవేర్‌నెస్ డ్రైవ్ నిర్వహించారు.

మొత్తం ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్కూల్స్‌ను ఎంచుకుని విద్యార్థినులతో నేరుగా మాట్లాడే విధానాన్ని తీసుకున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వరకు ఆగకుండా, వాలంటీర్లు స్కూల్స్‌కు వెళ్లి సెషన్లు నిర్వహిస్తున్నారు. హెచ్‌పీవీ ప్రివెన్షన్, వ్యాక్సినేషన్ గురించి విద్యార్థినులు, కుటుంబాల్లో అవగాహన పెరగడం ఈ క్యాంపెయిన్ లక్ష్యం. అయితే వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి అనే వైద్య నిర్ణయాలను ఫ్యాన్స్ చెప్పడం లేదు. అలాంటి విషయాలకు క్వాలిఫైడ్ హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు. అవేర్‌నెస్ కల్పించడం, సరైన వైద్య సమాచారం తీసుకునే దిశగా విద్యార్థినులను గైడ్ చేయడం వరకు మాత్రమే ఈ కార్యక్రమాన్ని ఉంచారు.

ఈ స్థాయిలో కార్యక్రమాలు జరగడానికి అల్లు అర్జున్ ఫ్యాన్ నెట్‌వర్క్ కూడా ఉపయోగపడుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఆయనకు వచ్చిన గుర్తింపుతో తెలుగు రాష్ట్రాల బయట కూడా ఆర్గనైజ్డ్ ఫ్యాన్ గ్రూప్స్ ఏర్పడ్డాయి. వేర్వేరు భాషలు, ప్రాంతాల్లో ఉన్న వాలంటీర్లు స్థానిక స్కూల్స్‌తో కోఆర్డినేట్ అవుతూ సెషన్లు నిర్వహిస్తున్నారు. ఒకే క్యాంపెయిన్‌ను ఎనిమిది ప్రాంతాల్లో ఇంత పెద్ద సంఖ్యలో కొనసాగించడానికి ఆర్గనైజ్డ్ ఫ్యాన్ బేస్ ప్రధానంగా ఉపయోగపడుతోంది.

ఏఏఎఫ్‌ఏ ఇప్పుడు సినిమా సంబంధిత కార్యక్రమాలకే పరిమితం కాకుండా ఇలాంటి అవేర్‌నెస్ డ్రైవ్స్‌కు కూడా ప్రాధాన్యం ఇస్తోంది. 820 స్కూల్ ప్రోగ్రామ్స్ పూర్తి కావడం, దాదాపు 3 లక్షల మంది బాలికలను చేరుకోవడం ఈ క్యాంపెయిన్ ఇప్పటివరకు సాధించిన రికార్డ్. స్కూల్ స్థాయిలోనే హెచ్‌పీవీ గురించి మాట్లాడే ప్రయత్నం చేయడం వల్ల విద్యార్థినులతో పాటు కుటుంబాల్లో కూడా ఈ అంశంపై సమాచారం చేరే అవకాశం ఉంది.

Tags:    

Similar News