టాలీవుడ్ టాప్ -5 కమ్యూనికేటర్స్.. ట్యాలెంట్ ఉంటే చాలు..!
ఈ రోజుల్లో చిత్ర పరిశ్రమలో ఎక్కడ ప్రతిభ ఉంటే అక్కడకు వెళ్లి అభినందించడానికి టాలీవుడ్ స్టార్ హీరోలు ఏమాత్రం వెనుకాడటం లేదు.
ఈ రోజుల్లో చిత్ర పరిశ్రమలో ఎక్కడ ప్రతిభ ఉంటే అక్కడకు వెళ్లి అభినందించడానికి టాలీవుడ్ స్టార్ హీరోలు ఏమాత్రం వెనుకాడటం లేదు. పాన్-ఇండియా వ్యాప్తంగా ఏ భాషలోనైనా కొత్త దర్శకుడు వైవిధ్యమైన కథతో మెప్పిస్తే.. మన అగ్ర హీరోలు స్వయంగా వారితో కమ్యూనికేట్ చేస్తూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. వినూత్నమైన ఐడియాలతో వచ్చే యువ తరం ప్రతిభావంతులను వెతికి పట్టుకునివారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడంలో మన స్టార్స్ ఎప్పుడూ ముందే ఉంటారు.
తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - మలయాళ యువ దర్శకుడు డొమినిక్ అరుణ్ కలయిక టాలీవుడ్, మోలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇటీవల `లోక చాప్టర్ 1: చంద్ర`తో సంచలన విజయం సాధించిన డొమినిక్.. అల్లు అర్జున్‌ను కలిసి తన ఫ్యాన్‌బాయ్ మూమెంట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. బన్నీతో దిగిన సెల్ఫీని షేర్ చేస్తూ.. తన సినిమాపై ఇండియా బిగ్గెస్ట్ స్టార్ చూపించిన ఆసక్తి.. తదుపరి చాప్టర్లపై ఆయన ఇచ్చిన సలహాలు- ప్రోత్సాహం తనకు ఎంతో ఎనర్జీనిచ్చాయని తెలిపారు. ప్రస్తుతం ఈ భేటీకి సంబంధించిన ఫోటోగ్రాఫ్ నెట్టింట వైరల్ కావడంతో వీరిద్దరి కాంబినేషన్‌లో భవిష్యత్తులో భారీ ప్రాజెక్ట్ ఉండవచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సుకుమార్ లాంటి ట్యాలెంట్ కి ఎప్పుడూ బన్నీ ఒక పెద్ద అండ. ఆ ఇద్దరూ ఒకరికోసం ఒకరు.. గతంలో వక్కంతం వంశీ లాంటి రచయితను `నా పేరు సూర్య` సినిమాతో దర్శకుడిగా పరిచయం చేసారు. ప్రతిభావంతులైన తెలుగు యువదర్శకులకు నిరంతరం తన ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్.. తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా `రాకా` షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ విజువల్ స్పెక్టకిల్ అల్లు అర్జున్ కెరీర్‌లోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోంది. ఒకవైపు `రాకా` లాంటి భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ చేస్తూనే... మరోవైపు డొమినిక్ అరుణ్ వంటి ప్రయోగత్మక ఆలోచనలు ఉన్న యంగ్ డైరెక్టర్లను బన్నీ ప్రత్యేకంగా అభినందించడం అతడి విజన్ ఎలాంటిదో తెలియజేస్తోంది.
కేవలం అల్లు అర్జున్ మాత్రమే కాదు... టాలీవుడ్‌కు చెందిన మిగతా అగ్ర హీరోలు కూడా కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ముందు వరుసలో ఉంటారు. రామ్ చరణ్ సుజీత్, గౌతమ్ తిన్ననూరి వంటి యంగ్ డైరెక్టర్ల కాన్సెప్ట్స్‌కు జై కొట్టగా(చర్చలు సాగిస్తున్నారు) ... జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్, కోరటాల శివల ప్రారంభ రోజుల్లోనే వారి మేకింగ్‌ను నమ్మి అవకాశాలు ఇచ్చారు. రెబల్ స్టార్ ప్రభాస్ `రన్ రాజా రన్` చూసి సుజీత్‌కు `సాహో` ఆఫర్ ఇవ్వగా... రాధాకృష్ణ కుమార్‌తో `రాధే శ్యామ్` చేశారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అడవి శేష్ రాసిన `మేజర్` నిర్మించడంతో పాటు.. అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి వంటి యంగ్ థాట్ ప్రాసెస్ ఉన్న మేకర్స్‌ను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ `సాహో` సుజీత్ కి ఓజీ లాంటి అవకాశం కల్పించడం ప్రతిభకు దక్కిన ప్రోత్సాహం.
తెలుగు సినిమా మార్కెట్ గ్లోబల్ స్థాయిలో విస్తరిస్తున్న ఈ తరుణంలో.. మన స్టార్ హీరోలు యువ ప్రతిభను గుర్తించి ఇచ్చే ఈ ప్రోత్సాహం ఇండస్ట్రీకి ఎంతో ప్లస్ అవుతోంది. భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండియాలో ఉన్న బెస్ట్ టాలెంట్‌ను దగ్గరకు తీసి... వారికి అవకాశాలు కల్పిస్తుండటం వల్ల వినూత్నమైన కథలు వెండితెరకు వస్తున్నాయి. అల్లు అర్జున్ వంటి ఐకాన్ స్టార్ ప్రోత్సాహం డొమినిక్ అరుణ్ లాంటి యంగ్ డైరెక్టర్లకు నిజంగానే పెద్ద ఎనర్జీ బూస్టర్‌గా మారి కొత్త ప్రయోగాలకు బాటలు వేస్తోంది.