పారితోషికంలో కొత్త ట్రెండ్: రజనీ బాటలో అల్లు అర్జున్

టాలీవుడ్‌లో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్ , రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలు తమ పారితోషికాల విషయంలో ప్యాకేజీ పద్ధతిని పాటిస్తున్నట్లు కథనాలొస్తున్నాయి.;

Update: 2026-04-21 03:38 GMT

ప్రస్తుత కాలంలో భార‌తీయ‌ సినిమా మార్కెట్ ఊహించని రీతిలో విస్తరించింది. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల వసూళ్లు సాధించడమే గగనంగా ఉండేది.. కానీ ఇప్పుడు వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలు ఏకంగా వెయ్యి కోట్ల క్లబ్‌ను కూడా సునాయాసంగా టచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే స్టార్ హీరోల పారితోషికాలు కూడా వందల కోట్లకు చేరుకున్నాయి. అయితే కేవలం ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్ మాత్రమే ఆశించకుండా... చిత్ర నిర్మాణంలో భాగస్వాములుగా మారుతూ నిర్మాతల భారాన్ని తగ్గించే సరికొత్త పంథాకు హీరోలు తెరలేపుతున్నారు.

టాలీవుడ్‌లో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్ , రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలు తమ పారితోషికాల విషయంలో ప్యాకేజీ పద్ధతిని పాటిస్తున్నట్లు కథనాలొస్తున్నాయి. అంటే సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడు పరిమితంగా అడ్వాన్స్ తీసుకుని..సినిమా విడుదలయ్యాక వచ్చే లాభాలలో వాటాలు తీసుకోవడం ద్వారా వీరు నిర్మాతకు వెసులుబాటు కల్పిస్తున్నారు. ఈ విధానం వల్ల సినిమా నిర్మాణ సమయంలో నిర్మాతపై వడ్డీల భారం తగ్గడమే కాకుండా.. సినిమా విజయంలో హీరోలకు కూడా బాధ్యత పెరుగుతోంది.

ఈ క్రమంలోనే దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ పారితోషికం విషయంలో పాటిస్తున్న నిబద్ధత ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రజనీకాంత్ కేవలం ఒక నటుడిగానే కాకుండా.. నిర్మాతలకు అండగా నిలిచిన మొద‌టి త‌రం స్టార్ గా గుర్తింపు పొందారు. నిర్మాత జి. ధనంజయన్ వెల్లడించిన వివరాల ప్రకారం..రజనీ గతంలో ఒక సినిమా కోసం కేవలం ఒక రూపాయి మాత్రమే అడ్వాన్స్‌గా తీసుకుని షూటింగ్‌లో పాల్గొన్నారు. సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన తర్వాతే పారితోషికం(లాభాల్లో వాటా) తీసుకునేలా ఆయన ఒప్పందాలు చేసుకుంటారని.. నిర్మాతకు నష్టం రాకూడదనేదే ఆయన ప్రధాన ఉద్దేశం.

సూపర్‌స్టార్ రజనీకాంత్ పాటిస్తున్న ఇదే స్ఫూర్తిని ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అనుసరిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా దర్శకుడు అట్లీతో భారీ బడ్జెట్ సినిమా కోసం బన్నీ కూడా కేవలం ఒక రూపాయి అడ్వాన్స్ తీసుకుని.. మిగతా మొత్తం లాభాల్లో వాటాగా తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారట. `పుష్ప` చిత్రంతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఈ తరహా నిర్ణయం తీసుకోవడం ద్వారా నిర్మాతలకు అండగా నిలబడటమే కాకుండా, రజనీకాంత్ లాంటి దిగ్గజ హీరోల బాటలో నడుస్తున్నారు.

సినిమా బాగా ఆడితే తనకు ర‌జ‌నీకి ఎక్కువ పారితోషికం వస్తుందని.. ఒకవేళ ఆడకపోతే నిర్మాత నష్టపోకుండా తక్కువ తీసుకుంటార‌ని తెలుస్తోంది. నిర్మాతలపై ఆర్థిక భారం పడకుండా ఉండాలని రజనీకాంత్ ఎప్పుడూ కోరుకుంటారు. ఇప్పుడు అదే బాట‌లో అల్లు అర్జున్ స‌హా ప‌లువురు టాలీవుడ్ స్టార్ హీరోలు నిర్మాత సంక్షేమం కోర‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

పాన్ ఇండియా ట్రెండ్ లో సినిమాల భారీ బడ్జెట్ కార‌ణంగా రిస్క్ పెరుగుతున్న నేపథ్యంలో హీరోలు ఇలాంటి పద్ధతులను ఎంచుకోవడం ఇండస్ట్రీకి శుభపరిణామమే. సినిమా ఫలితం ఎలా ఉన్నా తమకు మాత్రం భారీ రెమ్యునరేషన్ దక్కాలని అనుకోకుండా.. సినిమా సక్సెస్‌లో భాగస్వాములు కావడం వల్ల నిర్మాణ వ్యయం అదుపులో ఉంటుంది. రజనీకాంత్ ప్రారంభించిన ఈ `ప్రాఫిట్ షేరింగ్`మోడల్‌ను అల్లు అర్జున్ వంటి పాన్ ఇండియా స్టార్స్ కొనసాగించడం వల్ల రానున్న రోజుల్లో మరిన్ని భారీ ప్రాజెక్టులు ఎలాంటి ఆర్థిక ఒత్తిడి లేకుండా పట్టాలెక్కే అవకాశం ఉంది. స్టార్ హీరోలు భారీ ఫిక్స్‌డ్ పారితోషికాల కంటే లాభాల్లో వాటా తీసుకోవడం వల్ల సినిమా క్వాలిటీ.. బాక్సాఫీస్ విజయంపై సానుకూల ప్రభావం ఉంటుంద‌ని భావిస్తున్నారు.

Tags:    

Similar News