నేపోకిడ్ నోరు జారిన ఫలితం.. సోషల్ మీడియాలో పంచ్‌లే పంచ్‌లు!
సామాజిక మాధ్యమాలలో సహజంగానే నేపోకిడ్స్ లేదా నటవారసురాళ్లపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది.
సామాజిక మాధ్యమాలలో సహజంగానే నేపోకిడ్స్ లేదా నటవారసురాళ్లపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ప్రతిభావంతులైన ఔట్ సైడర్స్ కి అవకాశాలు రాకపోవడానికి కారకులు అంటూ విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు నేపోకిడ్ ఆలియా చేసిన ఓ కామెంట్ తీవ్ర దుమారం రేపుతోంది. జనం ఆలియాపై రివర్స్ పంచ్‌లతో విరుచుకుపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే....
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ తాజాగా ఒక పబ్లిక్ వేదికపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. భారతదేశంలో మహిళా ప్రాధాన్యత కలిగిన యాక్షన్ సినిమాలకు తానే `పయనీర్` (ఆద్యురాలు) అన్నట్లుగా మాట్లాడిన ఒక వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. సామాజిక మాధ్యమాల వేదికగా ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల పంచ్‌లు, సెటైర్లతో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆలియా భట్.. భారతదేశంలో మహిళా సెంట్రిక్ యాక్షన్ సినిమాలకు తానే పునాది వేసినట్లుగా సోషల్ మీడియాల్లో వచ్చే కామెంట్లను తాను ఎంతో సంతోషంగా అంగీకరించింది. దీంతో నెటిజన్లు నేపో క్వీన్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. యాక్షన్ జానర్‌లో తనకు మించిన వారు లేరన్నట్లుగా ఆలియా ప్రవర్తించడం చూసి... తోటి - సీనియర్ నటీమణులను గౌరవించడం ఆలియాకు అస్సలు తెలియదంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ సందర్భంగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో యాక్షన్ సినిమాలతో మెప్పించిన ఎందరో దిగ్గజ నటీమణుల పేర్లను నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే అదిరిపోయే యాక్షన్, భీకరమైన స్టంట్స్‌తో అదరగొట్టిన `ఫియర్‌లెస్ నాడియా` మొదలుకొని... హేమమాలిని, శ్రీదేవి, రేఖ వంటి సీనియర్ స్టార్ల వరకు ఎందరో మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రాల్లో రాణించారని గుర్తుచేస్తున్నారు. ఆలియా కంటే ముందే వీరంతా ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర సృష్టించారని కామెంట్స్ పెడుతున్నారు.
అంతేకాకుండా... సమకాలీన నటీమణులైన ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్, దీపికా పదుకోన్, సోనాక్షి సిన్హా, కత్రినా కైఫ్, తాప్సీ వంటి వారు కూడా కళ్ళు చెదిరే యాక్షన్ సీన్లతో ప్రేక్షకులను అలరించారని సోషల్ మీడియాలో నెటిజన్లు ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు. వీరెవ్వరూ కానట్టు కేవలం ఆలియా భట్ మాత్రమే యాక్షన్ చిత్రాలకు ఆద్యురాలిగా క్రెడిట్ తీసుకోవాలని చూడటం హాస్యాస్పదంగా ఉందని మండిపడుతున్నారు.
సాధారణంగానే ఇండస్ట్రీలో నెపోటిజం (వారసత్వం)పై వచ్చే విమర్శల వల్ల ఆలియా భట్ తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ చరిత్రనే మార్చేసి... తానే యాక్షన్ సినిమాలకు పయనీర్ అని చెప్పుకోవడం ఈ నేపోకిడ్ అహంకారానికి నిదర్శనమని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది సీనియర్లు సాధించిన విజయాలను కనీసం గుర్తించకుండా ఆలియా ఇలా నోరు జారడంపై సోషల్ మీడియా వేదికగా జనం పంచ్‌ల మీద పంచ్‌లు వేస్తున్నారు. ఆలియా భట్ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ `ఆల్ఫా` జూలై 3న విడుదల కానుంది. ప్రతిష్ఠాత్మక యష్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఆలియా కొన్నిసార్లు హోస్ట్ ప్రశ్నలకు తడబడుతూ ఇలా దొరికిపోతోందన్నమాట!