సాయి పల్లవి ఓకే.. మరి ఆలియా సంగతేంటి?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మైథాలజీ బ్యాక్ డ్రాప్ ను సైన్స్ ఫిక్షన్ తో మిక్స్ చేసి రూపొందించిన ఆ విజువల్ వండర్ కు నేషనల్ వైడ్ గా ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న కల్కి-2పై కూడా అదే రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే మూవీ స్టోరీ, పాత్రల కంటే ఎక్కువగా కొత్తగా ఎవరు ఆ ప్రాజెక్టులో భాగమవుతున్నారనే విషయమే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పేరు తాజాగా తెరపైకి రావడం ఆసక్తిని పెంచుతోంది. ఆలియా భట్ కల్కి-2లో కీలక పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే ఇప్పటికే నెట్టింట వైరల్ అయిన వార్తల్లా ఆమె ఫస్ట్ పార్ట్ లో మరో బీటౌన్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె పోషించిన సుమతి పాత్ర చేయడం లేదని తెలుస్తోంది. మూవీలో కీలక మలుపు తీసుకొచ్చే ఓ పవర్ ఫుల్ స్పెషల్ రోల్ కోసం ఆమెను సెలెక్ట్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆలియా ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన కొంత భాగం షూటింగ్ ను కూడా పూర్తి చేసిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై మూవీ యూనిట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.
దీంతో ఆ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. మరోవైపు, దీపికా పదుకొణె ప్లేస్ లో స్టార్ హీరోయిన్ సాయి పల్లవి నటించబోతున్నారనే వార్తలు రీసెంట్ గా వినిపించాయి. అయితే ఆ ప్రచారానికి దర్శకుడు నాగ్ అశ్విన్ రీసెంట్ గా చెక్ పెట్టారు. సాయి పల్లవి ఎంట్రీపై వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు ఆలియా భట్ విషయంలో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
అదే సమయంలో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఆలియా భట్, నిజంగానే కల్కి 2లో భాగమైతే సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయమని సినీ ప్రియులు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి భారీ క్యాస్టింగ్ తో రూపొందుతున్న ఆ సీక్వెల్ కు మరో స్టార్ యాడ్ అయితే పాన్ ఇండియా స్థాయిలో మరింత క్రేజ్ దక్కే అవకాశం ఉంది.
అయితే ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలన్నీ కూడా రూమర్స్ కే పరిమితం. మరి ఆలియా భట్ నిజంగానే కల్కి-2లో కనిపిస్తారా? లేక రూమరా? ఒకవేళ నిజమైతే ఆమె రోల్ ఏంటి? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ప్రొడక్షన్ హౌస్ వైజయంతీ మూవీస్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.