సినిమా ప్రమోషన్లలో ‘పికిల్స్’ రచ్చ
గత కొన్ని రోజులుగా తెలుగు ‘ఎక్స్’లో మీమ్స్ అన్నీ అలేఖ్య చిట్టి పికిల్స్ మీదే నడుస్తున్నాయి.;
గత వారం రోజులుగా తెలుగు ట్విట్టర్ చర్చలను కమ్మేసిన టాపిక్.. పికిల్స్. అలేఖ్య చిట్టి అనే పేరుతో రాజమండ్రికి చెందిన ముగ్గురు అక్క చెల్లెళ్లు సోషల్ మీడియానే ఉపయోగించుకుని ఈ పచ్చళ్ల బిజినెస్‌ను పెద్ద స్థాయికి తీసుకెళ్లారు. అందులో ఇద్దరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు. వారికి మాంచి ఫాలోయింగ్ ఉంది కూడా. ఐతే ప్రధానంగా బిజినెస్‌ను నడిపే అలేఖ్య చిట్టి.. తన పచ్చళ్ల ధరలు ఎక్కువ ఉన్నాయేంటి అని అడిగిన పాపానికి కస్టమర్లను బూతులు తిట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఆడియోలు వైరల్ అయి.. సోషల్ మీడియాలో ఈ ముగ్గురు సిస్టర్స్ మీద ఎక్కడ లేని నెగెటివిటీ వచ్చేసింది. దెబ్బకు బిజినెస్సే క్లోజ్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ఈ ఆడియోల గురించి మిగతా ఇద్దరు అక్కచెల్లెళ్లు వివరణ ఇచ్చినా గొడవ సద్దుమణగలేదు. ఈ రోజు ఆ బూతులు తిట్టిన అలేఖ్యనే వచ్చి సారీ చెప్పినా పరిస్థితి ఏమంత మెరుగుపడలేదు.
గత కొన్ని రోజులుగా తెలుగు ‘ఎక్స్’లో మీమ్స్ అన్నీ అలేఖ్య చిట్టి పికిల్స్ మీదే నడుస్తున్నాయి. ఈ ట్రెండుని ప్రియదర్శి కొత్త సినిమా ‘సారంగపాణి జాతకం’ టీం కూడా ఉపయోగించుకోవడం విశేషం. హీరోయిన్ రూప కొడవయూర్‌తో కలిసి ప్రియదర్శి తాజాగా ఒక వీడియో చేశాడు. అందులో హీరోయిన్ ఒక చీర చూపించి కొనమంటే.. దాని రేటు చూసి బెంబేలెత్తుతాడు దర్శి. దానికి బదులుగా.. ఈ చీరే కొనలేకపోయావంటే ఇంక నువ్వేం చేయగలవు, అర్జెంటుగా నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అంటూ క్లాస్ పీకడం మొదలుపెడుతుంది రూప. రేట్లు ఎక్కువ ఉన్నాయని ప్రస్తావించిన కస్టమర్‌కు అలేఖ్య చిట్టి ఇదే రకంగా క్లాస్ పీకిన సంగతి తెలిసిందే. కాకపోతే అందులో పచ్చి బూతులు వాడడమే వివాదానికి దారి తీసింది. రూప అలా బూతులేమీ వాడకుండా.. దర్శికి క్లాస్ తీసుకుంది. మొత్తానికి పికిల్స్ గొడవ సినిమా ప్రమోషన్లకూ బాగానే ఉపయోగపడుతోందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.