పుల్లలు పెట్టేవాళ్ల వల్లే ఇవన్నీ: అక్కినేని వెంకట్
ఎవరో ఏ పుల్లలు పెట్టారో ఏమిటో.. ఒకసారి నాన్న గారి గురించి దాసరి గారు.. తప్పుడు భాషలో బ్యాడ్ గా మాట్లాడారని తెలిసింది.;
సినీపరిశ్రమలో సంబంధ బాంధవ్యాల గురించి, చుట్టూ ఉండి పుల్లలు పెట్టేవారి గురించి పరిశ్రమ అగ్ర నిర్మాత అక్కినేని వెంకట్ బహిర్గతం చేసిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ప్రముఖ సినీజర్నలిస్ట్ సుబ్బారావు గారితో ఇంటర్వ్యూలో ఏఎన్నార్ - దాసరి మధ్య కలతల గురించి, ఏఎన్నార్ - ఎన్టీఆర్ మధ్య విభేధాల గురించి ఓపెనయ్యారు వెంకట్. ఒక రకంగా చుట్టూ ఉండేవారే పుల్లలు పెడుతుంటారు. అలాంటి వారి వల్లనే వారి మధ్య బాంధవ్యాలు దెబ్బ తిన్నాయని తాను భావించినట్టు తెలిపారు.
నాన్న గారు, దాసరి గారు కలిసి ఎన్నో విజయవంతమైన సినిమాలకు పని చేసారు. ఎవరో ఏ పుల్లలు పెట్టారో ఏమిటో.. ఒకసారి నాన్న గారి గురించి దాసరి గారు.. తప్పుడు భాషలో బ్యాడ్ గా మాట్లాడారని తెలిసింది. మాకు అంతవరకే తెలుసు. డీటెయిల్స్ తెలియవు. కానీ ఆ తర్వాత కాలక్రమంలో నేను ఇద్దరినీ కలిపేందుకు ప్రయత్నించాను అని వెంకట్ నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నారు.
అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ విషయంలో అప్పట్లో ప్రభుత్వంతో సమస్య వచ్చింది. అప్పటికి ఏడెకరాల్లో ఎలాంటి నిర్మాణాలు లేవు. దీంతో పబ్లిక్ పర్పస్ ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం వాదించింది. భూమి ఖాళీగా ఉంది కదా అని ప్రభుత్వం లాక్కోవాలనుకుంది. మేం ఔట్ డోర్ సెట్స్ వేయాలని, నిర్మాణాలు చేయాలని అనుకున్నాము కానీ అప్పటికి చేయలేకపోయాము. చివరికి ఈ భూమి విషయమై మేం హైకోర్టు వరకూ వెళ్లాం.. గెలిచాం..అని తెలిపారు.
అప్పటికి ఎన్టీ రామారావు గారితో నాన్నగారికి ఏవైనా అభిప్రాయ భేధాలున్నాయా? ఎలాంటి విభేధాలు లేకపోయినా మధ్యలో పుల్లలు పెట్టేవాళ్ల వల్ల సమస్య వచ్చిందా? అని ప్రశ్నించగా,,.. ప్రభుత్వం తరపు నుంచి సెవన్ ఏకర్స్ గురించి ప్రశ్న వచ్చింది. మన పరిశ్రమలో చుట్టూ ఉన్నవారిలో పుల్లలు పెట్టే సర్కిల్ కూడా ఒకటి ఉంటుంది. ప్రతి క్యాంప్ లో శకుని లాంటి వాళ్లు ఉంటారు. అలాంటి వాళ్లు చేసిన పని ఇది.. అని ఏఎన్నార్ కుమారుడు అక్కినేని వెంకట్ అన్నారు. త్రోబ్యాక్ విషయాలపై సీనియర్ జర్నలిస్టుతో ఇంటర్వ్యూలో అక్కినేని వెంకట్ బహిరంగంగా ఈ విషయాలను మాట్లాడటం ఆసక్తిని కలిగించింది.