అఖిల్ లెనిన్ కు అదే క‌లిసొస్తుందా?

సాధార‌ణంగా ఒక సినిమా రిలీజ్‌కు ముందు హైప్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదని అంద‌రూ భావిస్తుంటారు.

Update: 2026-06-22 08:30 GMT

సాధార‌ణంగా ఒక సినిమా రిలీజ్‌కు ముందు హైప్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదని అంద‌రూ భావిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అదే హైప్ సినిమాపై అదనపు ఒత్తిడిని పెంచుతుంది. ప్రస్తుతం అక్కినేని అఖిల్ నటిస్తున్న లెనిన్ పరిస్థితి కూడా దాదాపు అలానే కనిపిస్తోంది. జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు మొద‌ట్లో మంచి హైప్, అంచ‌నాలు ఉన్న‌ప్ప‌టికీ, ఇప్పుడు ఆ ఉత్సాహం కనిపించడం లేదు. ప‌లు సార్లు రిలీజ్ డేట్లు మార‌డంతో లెనిన్ పై ఉన్న అంచనాలు క్రమంగా తగ్గిపోయాయి.

అయితే ఇదే అంశం ఇప్పుడు మేక‌ర్స్ కు ఓ విధంగా ప్రయోజనకరంగా మారవచ్చనే అభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుడు ప్రతి సన్నివేశాన్నీ కొలుస్తాడు. కానీ ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా చూసేందుకు వచ్చే ప్రేక్షకుడిని ఇంప్రెస్ చేయ‌డం చాలా ఈజీ అవుతుంది. రీసెంట్ గా కొన్ని సినిమాలు కూడా ఇదే తరహాలో తక్కువ బజ్‌తో విడుదలై మంచి ఫలితాలు సాధించాయి.

అఖిల్ కెరీర్ పరంగా చూస్తే లెనిన్ సాధారణ సినిమా కాదు. హీరోగా తన మార్కెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాల‌న్నా, అస‌లు హీరోగా నిల‌దొక్కుకోవాల‌న్నా ఈ సినిమా విజయం కీలకమనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో ఉంది. ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వ‌ద్ద ప్రభావాన్ని చూపలేకపోయాయి. అందుకే ఈసారి లెనిన్ రిజ‌ల్ట్ ఎలా ఉంటుందన్న ఆసక్తి అభిమానుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఒక మంచి హిట్ పడితే కెరీర్ దిశే మారిపోతుందని, లేదంటే మరోసారి అఖిల్ ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

దీంతో పాటూ లెనిన్ రీషూట్ల అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్ లో రీషూట్స్ అనేది కొత్త విషయ‌మేమీ కాదు. గతంలో కొన్ని సినిమాలు రిలీజ్‌కు ముందు మార్పులు, చేర్పులు చేసుకుని భారీ విజయాలు అందుకున్న సందర్భాలు ఉన్నాయి. మరోవైపు చివరి నిమిషంలో చేసిన సవరణలు కూడా కొన్నిసార్లు ఫలితాన్ని మార్చలేకపోయాయి. అందుకే రీషూట్లు జరిగాయంటే అదేమీ స‌క్సెస్, ఫెయిల్యూర్ల‌కి గ్యారంటీ కాదని, అస‌లు విష‌యం స్క్రీన్ పై కనిపించే కంటెంట్‌లోనే ఉంటుంద‌ని అంద‌రూ అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ప్రస్తుతం లెనిన్ విషయంలో ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే, ఈ సినిమాకు మొదట్లో కనిపించిన హడావుడి ఇప్పుడు లేదు. సోషల్ మీడియాలో కూడా సినిమా గురించి డిస్క‌ష‌న్స్ కొంతమేర‌ తగ్గాయి. కానీ ఇదే సైలెన్స్ రిలీజ్ త‌ర్వాత సినిమాకు బలంగా మారే అవకాశ‌ముందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఆడియ‌న్స్ ముందస్తు అభిప్రాయాలు లేకుండా థియేటర్‌కు వస్తే, సినిమా కంటెంట్ నచ్చితే మౌత్ టాక్ చాలా వేగంగా పనిచేస్తుంది. అందుకే ఇప్పుడు అందరి దృష్టి జూలై 10పైనే నిలిచింది. ముర‌ళీ కిషోర్ అబ్బూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న లెనిన్ ను సితార ఎంట‌ర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News