టాలీవుడ్ హీరోల సక్సెస్ వేట !

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ నలుగురు హీరోలు ఇదే ప‌రిస్థితిని ఎదుర్కుంటున్నారు. వాళ్లు ఎవ‌రెవ‌రంటే? అఖిల్ అక్కినేని, వరుణ్ తేజ్, నిఖిల్ సిద్ధార్థ్, రవితేజ క‌నిపిస్తున్నారు.;

Update: 2026-04-18 12:30 GMT

ఇండ‌స్ట్రీ లో జ‌యాప‌జ‌యాలు సహజం. అయితే వరుస ప్లాపులు ఎదురైతే? ఎంతటి స్టార్ హీరోకైనా తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కడం అత్యవసరంగా మారుతుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ నలుగురు హీరోలు ఇదే ప‌రిస్థితిని ఎదుర్కుంటున్నారు. వాళ్లు ఎవ‌రెవ‌రంటే? అఖిల్ అక్కినేని, వరుణ్ తేజ్, నిఖిల్ సిద్ధార్థ్, రవితేజ క‌నిపిస్తున్నారు. ఈ న‌లుగురు కెరీర్‌ను మళ్ళీ గాడిలో పెట్టేందుకు విభిన్నమైన కథాంశాలతో, కొత్త ప్రయోగాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో వారి తదుపరి ప్రాజెక్టులపై పరిశ్రమ స‌హా ప్రేక్ష‌కుల్లో ఆసక్తి నెలకొంది.

అక్కినేని వారసుడిగా భారీ అంచనాలతో ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్‌ను అందుకోలేదు. గత చిత్రం `ఏజెంట్` ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. ప్రస్తుతం అఖిల్ `లెనిన్` అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో ఓ సినిమాలో నటిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో అఖిల్ సరికొత్త లుక్‌తో పాటు, యాక్షన్ అంశాలు హైలైట్‌గా ఉంటాయని ప్ర‌చారం గ‌ట్టిగానే జ‌రుగుతోంది. ప్ర‌చార చిత్రాలు కూడా మంచి బ‌జ్ ను తీసుకొచ్చాయి. అక్కినేని అభిమానులంతా తమ హీరోకు ఈ సినిమా గ్రాండ్ కమ్‌బ్యాక్ అందిస్తుందని ఆశిస్తున్నారు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా కెరీర్‌లో ఒక కీలక దశలో ఉన్నాడు. గత కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన మ్యాజిక్ చేయలేకపోవడంతో వ‌రుణ్ పంథా మార్చాడు. ఈసారి `కొరియన్ కనకరాజు` అనే వెరైటీ టైటిల్‌తో హారర్ కామెడీ జానర్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. సాధారణంగా సీరియస్ రోల్స్ చేసే వరుణ్ ఇలాంటి విభిన్నమైన జానర్‌ను ఎంచుకోవడం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ సినిమాతో మాస్, క్లాస్ ప్రేక్షకులను అలరించి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని వరుణ్ కాన్పిడెంట్ గా ఉన్నాడు.

`కార్తికేయ 2`తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ఆ తర్వాత వచ్చిన చిత్రాలతో ఆ వేగాన్ని అందుకోలేకపోయాడు. ప్రస్తుతం కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో `స్వయంభు` అనే చారిత్రక నేపథ్యం గ‌ల‌ సినిమాలో నటిస్తున్నాడు. యుద్ధ వీరుడిగా నిఖిల్ చేస్తోన్న‌ ప్రయోగంపై భారీ అంచనాలున్నాయి. హిస్టారికల్ ఎలిమెంట్స్ -హై ఎండ్ విజువల్స్ సినిమాకు ప్రధాన బలం కానున్నాయి. నిఖిల్ తన పాన్ ఇండియా ఇమేజ్‌ను సుస్థిరం చేసుకోవడానికి ఈ విజయం ఎంతో కీలకంగా మారింది.

అలాగే మాస్ మహారాజా రవితేజ పరిస్థితి కూడా కొంత తడబాటులోనే ఉంది. వరుస సినిమాలతో బిజీగా ఉండే రవితేజ బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ చూసి చాలా కాలమైంది. అందుకే ఈసారి రొటీన్ మాస్ మసాలా కథలకు భిన్నంగా `ఇరుముడి` అనే ఎమోషనల్ డ్రామాను ఎంచుకున్నారు. కుమార్తె సెంటిమెంట్ - బలమైన భావోద్వేగాల చుట్టూ తిరిగే కథ రవితేజలోని నటుడిని కొత్తగా ఆవిష్కరిస్తుందని టాక్ న‌డుస్తోంది. మాస్ అంశాలతో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించడం ద్వారా మళ్ళీ పూర్వ వైభవాన్ని అందుకోవాలని రాజా వెయిట్ చేస్తున్నాడు. మ‌రి ఈ న‌లుగురు హీరోలు బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి విజ‌యాలు న‌మోదు చేస్తారో చూడాలి.

Tags:    

Similar News