బాలయ్య రిస్క్ ను తప్పక అభినందించాల్సిందే!
ఆరు పదుల వయసులో కూడా నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు.;
ఆరు పదుల వయసులో కూడా నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఇంకా చెప్పాలంటే యంగ్ హీరోల కంటే కూడా బాలయ్య ఫాస్ట్ గా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో వరుస సక్సెస్‌లు అందుకున్న బాలకృష్ణ ఆ జోష్ లోనే తన తర్వాతి సినిమాను చేస్తున్నారు.
ప్రస్తుతం బాలయ్య తన తర్వాతి సినిమాను బోయపాటి శ్రీనుతో చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య, బోయపాటి అంటే సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే వీరిద్దరి కలయికలో మూడు సినిమాలు రాగా ఆ మూడూ ఒకదాన్ని మించి మరొకటి హిట్లుగా నిలవడంతో ఇప్పుడు వస్తున్న సినిమాపై మంచి హైప్ ఉంది.
దానికి తోడు ఇప్పుడు వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా బ్లాక్ బస్టర్ అఖండకు సీక్వెల్ కావడంతో అఖండ2పై అందరి అంచనాలు మరింత భారీగా ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. సినిమాలో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తూ బోయపాటి అఖండ2 షూటింగ్ ను నిర్విరామంగా కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను మోతుగూడెంలోని నదీ ప్రవాహం వద్ద ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎంతో వేగంగా ప్రవహిస్తున్న నదిలోకి బాలయ్య ఎలాంటి డూప్ లేకుండా వెళ్లి మరీ ఓ సీన్ ను చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఏజ్ లో కూడా బాలయ్య ఇలాంటి రిస్క్ తీసుకోవడాన్ని అందరూ అభినందిస్తున్నారు. ప్రగ్యా జైశ్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా సెప్టెంబర్ 25న అఖండ2 ప్రేక్షకుల ముందుకు రానుంది.