అఖండ సీక్వెల్.. 250 మందితో VHP అలా!

తాజాగా సినిమాను 250 మంది విద్యార్థులతో కలిసి విశ్వ హిందూ పరిషత్ నాయకులు వీక్షించారు. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో మేకర్స్ వెల్లడించారు.;

Update: 2025-12-27 13:00 GMT

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ.. లీడ్ రోల్ లో రూపొందిన అఖండ 2: తాండవం రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ అఖండకు సీక్వెల్ గా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఆ సినిమా డిసెంబర్ 12వ తేదీన విడుదలైంది. అంతకుముందే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల లేట్ అయింది.

అయితే అఖండకు సీక్వెల్ గా రూపొందడంతో అంతా అఖండ 2 మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరోసారి బోయపాటి- బాలయ్య మ్యాజిక్ రిపీట్ అవుతుందని అంచనా వేశారు. నందమూరి అభిమానులను సినిమా ఆకట్టుకున్నప్పటికీ.. మిగతా ఆడియన్స్ పెట్టుకున్న అంచనాలను మాత్రం అఖండ సీక్వెల్ అందుకోలేదని కచ్చితంగా చెప్పవచ్చు.

వివిధ చోట్ల లాజిక్ మిస్ అయిందని అనేక మంది సినీ ప్రియులు అభిప్రాయపడ్డారు. దానికి బోయపాటి క్లారిటీ ఇస్తున్నా.. ఆడియన్స్ మాత్రం స్వీకరించడం లేదు. ఏదేమైనా ఓవరాల్ గా మాత్రం మూవీ లవర్స్ అందరినీ ఆకట్టుకునే కంటెంట్.. అఖండ 2లో లేనట్లే! కానీ మేకర్స్.. థియేటర్స్ కు ఆడియన్స్ రప్పించడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

మేకింగ్ వీడియోతోపాటు ఫుల్ వీడియో సాంగ్స్ ను విడుదల చేస్తున్నారు. దీంతో ఇప్పుడు రెండో వారంలో భారీ అన్నట్లు కాకపోయినా.. జస్ట్ ఓకే అన్నట్టు వసూళ్లు సాధిస్తోంది అఖండ 2. తాజాగా సినిమాను 250 మంది విద్యార్థులతో కలిసి విశ్వ హిందూ పరిషత్ నాయకులు వీక్షించారు. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో మేకర్స్ వెల్లడించారు.

విశ్వహిందూ పరిషత్ నాయకులు 250 మంది విద్యార్థులతో సినిమా చూశారని బోయపాటి శ్రీను తెలిపారు. పిల్లల్లో ఈ జ్ఞానం నింపడానికి, ప్రతి ఒక్కరికి సినిమాలోని మంచిని చేరవేయాలనే ఉద్దేశంతో మూవీ చూపించారని అన్నారు. అందులో విశ్రాంత సైనికులు ఉన్నారని తెలిపారు. ఈ నిర్ణయానికి, సినిమా నిలబెట్టాలనే తాపత్రయానికి థ్యాంక్స్ చెప్పారు.

అఖండ 2 తాండవం సాక్షాత్తు పరమశివుని అనుగ్రహం ఉండడం వల్ల సాధ్యమైందని ఒక విశ్వ హిందూ పరిషత్ నాయకురాలు చెప్పారు. బాలయ్య సహా మొత్తం టీమ్.. ప్రతి సీన్ లో ధర్మాన్ని చూపించారని అన్నారు. అద్భుతమైన వివరణ ద్వారా ఏది నిజమో, ఏది అబద్ధమో, ధర్మ రక్షణ అంటే ఏంటో సినిమాలో చూపించారని చెప్పారు.

సినిమా అనేది ఎంత ప్రభావమైనదో తెలుసని అన్నారు. ధర్మమంటే ఏంటో సినిమా ద్వారా చూపించారని కొనియాడారు. బోయపాటి, బాలయ్య సహా టీమ్ అంతా చేసిన ప్రయత్నం కేవలం సినిమా కాదని.. కనువిప్పు కలిగించే యథార్థ గాథ అని చెప్పారు. ఇలాంటి టెక్నాలజీ యుగంలో సనాతన ధర్మం ఎప్పుడూ అనంతమైనది ప్రూవ్ చేశారని చెప్పారు. అయితే డివైన్ ఎలిమెంట్స్ తో అఖండ-2 రూపొందిన సంగతి విదితమే.

Tags:    

Similar News