అఖండ 2: పట్టువిడువని ఎరోస్.. ఓ డేట్ పోయినట్లే..

నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'అఖండ 2' విడుదల విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు.;

Update: 2025-12-08 04:43 GMT

నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'అఖండ 2' విడుదల విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే డిసెంబర్ 12న సినిమా రిలీజ్ కావడం అసాధ్యమని తేలిపోయింది. సోమవారం నాటికి సమస్య కొలిక్కి వస్తుందని, ఏదో ఒక గుడ్ న్యూస్ వింటామని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. అసలు రిలీజ్ డేట్ గురించి ఆలోచించే పరిస్థితి కూడా ఇప్పుడు కనిపించడం లేదు. ఎందుకంటే ఆర్థిక వివాదం అనుకున్నదాని కంటే చాలా సీరియస్ గా మారినట్లు టాక్ వినిపిస్తోంది..

దీనికి ప్రధాన కారణం ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ వ్యవహరిస్తున్న తీరు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని 14 రీల్స్ నిర్మాతలు భావిస్తున్నా, ఎరోస్ మాత్రం మొండి పట్టుతో ఉంది. "రాజీ పడాలంటే మాటలు కాదు, డబ్బులు కావాలి" అని తేల్చి చెప్పేసింది. మొత్తం బాకీ ఉన్న రూ. 28 కోట్లలో, కనీసం రూ. 20 కోట్లు ఇప్పుడే, తక్షణమే చెల్లించాలని కండిషన్ పెట్టిందట. ఆ మొత్తం టేబుల్ మీద పెడితే తప్ప చర్చలకు కూడా రాము అని స్పష్టం చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల భోగట్టా.

ఇక నిన్నటి నుంచి "ప్రముఖ ఇండస్ట్రీ పెద్దలు, కొందరు నిర్మాతలు ఎంట్రీ ఇచ్చారు.. సమస్య తీరిపోయింది" అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేసింది. అ నలుగురిలో ఓ నిర్మాత కట్టాల్సిన బాకీలను ఎరోస్ కు అడ్జస్ట్ చేశారని, ఇక లైన్ క్లియర్ అని ఫ్యాన్స్ సంబరపడ్డారు. కానీ ఇదంతా ఒట్టి పుకారు మాత్రమేనని తేలింది. ఎరోస్ కు కావాల్సింది క్యాష్ తప్ప, ఇలాంటి అడ్జస్ట్ మెంట్లు కాదని ఇన్ సైడ్ టాక్. దీంతో ఆ ఆశ కూడా ఆవిరైపోయింది.

మరోవైపు ఈ సమస్యకు టెక్నికల్ గా కూడా బ్రేకులు పడ్డాయి. సినిమా విడుదలను ఆపేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు తాలూకు పూర్తి జడ్జిమెంట్ కాపీ ఇంకా నిర్మాతల చేతికి అందలేదు. ఒకవేళ బయట డబ్బులు కట్టి రాజీ పడినా సరే, ఆ విషయాన్ని కోర్టుకు అధికారికంగా చెప్పాలంటే ఈ కాపీ చేతిలో ఉండాల్సిందే. ఈ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ పూర్తి కాకుండా అడుగు ముందుకు వేయలేని పరిస్థితి నెలకొంది.

సదరు నిర్మాణ సంస్థ గతంలో తీసిన వేరే సినిమాల కోసం చేసిన భారీ అప్పులే ఇప్పుడు మెడకు చుట్టుకున్నాయి. ఒక సినిమా కోసం చేసిన అప్పు, మరో సినిమా రిలీజ్ ను అడ్డుకోవడం అంటే ఇదే. సోషల్ మీడియాలో మిగతా నిర్మాతలు, దర్శకులు ఎంత సపోర్ట్ చేసినా అది ఎమోషనల్ గా బాగుంటుందేమో కానీ, లీగల్ గా పనికిరాదు. ఇప్పుడు కావాల్సింది 20 కోట్ల నగదు. రాబోయే రెండు రోజుల్లో నిర్మాతలు ఆ మొత్తాన్ని ఎలా సమీకరిస్తారు? ఎరోస్ ను ఎలా ఒప్పిస్తారు? అనేదానిపైనే సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది. ప్రస్తుతానికి అయితే డిసెంబర్ 12 రేసు నుంచి అఖండ తప్పుకున్నట్లే భావించాలి.

Tags:    

Similar News