అఖండ బ్రేక్ ఈవెన్ నెంబర్.. నిర్మాతలు ఏమన్నారంటే?
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ 2: తాండవం' పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.;
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ 2: తాండవం' పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కానుండటంతో ఇండస్ట్రీలో ఒకటే చర్చ నడుస్తోంది. అయితే, సినిమా కంటెంట్ కంటే ఎక్కువగా ఈ మధ్య సోషల్ మీడియాలో కలెక్షన్స్, ప్రీ రిలీజ్ బిజినెస్ నంబర్ల గోల ఎక్కువైపోయింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 200 కోట్లు రావాలి, 250 కోట్లు రావాలి అంటూ ఎవరికి నచ్చిన ఫిగర్స్ వాళ్లు ట్విట్టర్‌లో రాసేస్తున్నారు.
దీనిపై లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత రామ్ ఆచంట చాలా ఘాటుగా స్పందించారు. నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట మాట్లాడుతూ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ నంబర్ల ప్రచారంపై అసహనం వ్యక్తం చేశారు. బయట వినిపిస్తున్న లెక్కలన్నీ పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో, ముఖ్యంగా ట్విట్టర్‌లో ఉండే చాలామందికి సినిమా బిజినెస్ గురించి కనీస అవగాహన ఉండదని ఆయన అన్నారు. ఎవరో ఏదో చెప్పిన దాన్ని పట్టుకుని, దాన్ని వైరల్ చేయడం తప్ప అందులో నిజం ఉండదని స్పష్టం చేశారు.
రామ్ ఆచంట మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో బాక్సాఫీస్ లెక్కలు రాసేవారికి అసలు గ్రాస్ అంటే ఏంటి? నెట్ అంటే ఏంటి? షేర్ అంటే ఏంటి? అనే బేసిక్ విషయాలు కూడా తెలియవని అన్నారు. ఈ మూడింటి మధ్య చాలా తేడా ఉంటుందని, కానీ సోషల్ మీడియా ట్రాకర్లు మాత్రం అవేమీ పట్టించుకోకుండా తమకు నచ్చిన నంబర్లు వేసేసుకుంటారని అన్నారు. "మా హీరో సినిమా ఇంత చేసింది, మా హీరో సినిమా అంత కలెక్ట్ చేసింది" అని రాసుకుని వాళ్లకు వాళ్లే ఆనందపడుతుంటారు తప్ప, గ్రౌండ్ లెవల్‌లో జరిగే బిజినెస్ వేరు అని ఆయన క్లారిటీ ఇచ్చారు.
సినిమా బిజినెస్ ఎలా జరుగుతుందో కూడా ఆయన వివరించారు. నిర్మాతలుగా తాము సినిమాను డిస్ట్రిబ్యూటర్లకు అమ్ముతామని, ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లకు (థియేటర్ ఓనర్స్) ఇస్తారని చెప్పారు. ఈ క్రమంలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య అడ్వాన్సులు, ఎంజీలు హైర్ పద్ధతుల్లో లావాదేవీలు జరుగుతాయని అన్నారు. ఇవన్నీ వాళ్ల అంతర్గత విషయాలని, ఈ లెక్కలు బయటవాళ్లకు తెలిసే అవకాశమే లేదని స్పష్టం చేశారు. చాలా తక్కువ మందికి మాత్రమే అసలు నిజాలు తెలుస్తాయని అన్నారు.
సోషల్ మీడియాలో వచ్చే ఈ భారీ నంబర్ల వల్ల నిర్మాతలుగా మీపై ఏమైనా ఒత్తిడి పడుతుందా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన చాలా కూల్‌గా సమాధానం ఇచ్చారు. ఆ నంబర్స్ అన్నీ తప్పు అని తమకు తెలుసు కాబట్టి, తమకు ఎలాంటి ప్రెజర్ లేదని అన్నారు. అనవసరంగా హైప్ క్రియేట్ చేసి, లేనిపోని అంచనాలు పెంచడం వల్ల.. ఆ అంకెలు రాసేవాళ్లే టెన్షన్ పడాలి తప్ప, నిర్మాతలు కాదని చెప్పారు. తాము ఒక రేటు అనుకుంటామని, దానికి తగ్గట్టుగా బిజినెస్ చేసుకుంటామని, బయట జరిగే ప్రచారంతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు.