అఖండ-2కు పెద్ద అడ్డంకే ఉంది
తెలుగు రాష్ట్రాలను దాటి దేశమంతా తమ ఫాలోయింగ్, మార్కెట్‌ను విస్తరించాలని దాదాపుగా టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ప్రయత్నించిన వాళ్లే.;
తెలుగు రాష్ట్రాలను దాటి దేశమంతా తమ ఫాలోయింగ్, మార్కెట్‌ను విస్తరించాలని దాదాపుగా టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ప్రయత్నించిన వాళ్లే. కొందరికి అనుకోకుండా ఆ ఫాలోయింగ్, మార్కెట్ వచ్చేశాయి. కొందరు కష్టపడి అవి సాధించుకున్నారు. కానీ కొందరికి మాత్రం కాలం కలిసి రాలేదు. ఐతే నందమూరి బాలకృష్ణ ఇప్పటిదాకా అలాంటి ప్రయత్నం చేయలేదు. ఐతే బాలయ్య ఏ ప్రయత్నం చేయకుండానే ‘అఖండ’ సినిమా కొంతమేర నార్త్ ఇండియాలో ఆయనకు ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది.
డివైన్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలకు నార్త్ ఆడియన్స్ కొన్నేళ్లుగా బాగా కనెక్ట్ అవుతున్నారు. ‘అఖండ’ కూడా అలాగే ఓటీటీలో ఉత్తరాది ప్రేక్షకులకు చేరువైంది. దీంతో ‘అఖండ-2’ను ప్రాపర్ పాన్ ఇండియా సినిమాగా తీర్చిదిద్దింది చిత్ర బృందం. ఉత్తరాదిన ఈ సినిమాకు ప్రమోషన్లు కూడా గట్టిగా చేస్తున్నారు. ప్రోమోలు వారి దృష్టిని బాగానే ఆకర్షించాయి. కంటెంట్ క్లిక్ అయితే ఈ సినిమా ఉత్తరాదిన బాగా ఆడి బాలయ్యకు తొలి పాన్ ఇండియా హిట్ ఇస్తుందనే అంచనాలున్నాయి.
కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ‘అఖండ-2’కు అంత తేలిగ్గా ఏమీ ఉండకపోవచ్చు. డిసెంబరు 5న బాలయ్య సినిమాకు గట్టిపోటీనే ఉంది హిందీలో. రణ్వీర్ సింగ్ నటించిన ‘దురంధర్’ అదే రోజు రిలీజవుతోంది. ఈ ఏడాది బాలీవుడ్లో మోస్ట్ హైప్డ్ మూవీస్‌లో ఇదొకటి. రణ్వీర్‌కు తోడు సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, మాధవన్, అర్జున్ రాంపాల్.. ఇలా క్రేజీ కాస్టింగే ఉంది ఈ చిత్రంలో. ‘యురి’ దర్శకుడు ఆదిత్య ధర్ కొన్నేళ్ల పాటు శ్రమించి ఈ చిత్రాన్ని రూపొందించాడు. టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఇది మరో ‘యానిమల్’ అవుతుందనే టాక్ నడుస్తోంది బాలీవుడ్లో.
ప్రస్తుతానికి హిందీ ప్రేక్షకుల దృష్టంతా ఈ సినిమా మీదే ఉంది. దీనికి ఎలాంటి టాక్ వస్తుందన్నదాన్ని బట్టి ‘అఖండ’ మీదికి వాళ్ల ఫోకస్ మళ్లుతుందా లేదా అన్నది తేలుతుంది. ‘అఖండ’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే తప్ప వాళ్లు వెంటనే ఈ సినిమా వైపు చూడకపోవచ్చు. ఐతే హిందీ ఆడియన్స్ ఓ సినిమాకు కనెక్ట్ అయితే.. నెమ్మదిగా అయినా థియేటర్లకు వచ్చి చూస్తారు. అక్కడ సినిమాలకు లాంగ్ రన్ ఉంటుంది. ‘పుష్ప’ సహా కొన్ని సినిమాలు ఇలాగే ఆదరణ దక్కించుకున్నాయి. మరి డిసెంబరు 5న అఖండ-2, దురంధర్ సినిమాలు ఎలాంటి టాక్ తెచ్చుకుంటాయో.. హిందీలో రణ్వీర్ సినిమా పోటీని తట్టుకుని బాలయ్య సినిమా ఏమేర ప్రభావం చూపిస్తుందో చూడాలి.