అఖండ: మరో డేట్ విషయంలో అసలు చిక్కులు
'అఖండ 2' వాయిదా పడటంతో ఇప్పుడు కొత్త డేట్ ఏది అనే దానిపై పెద్ద ఎత్తున లెక్కలు వేస్తున్నారు.;
'అఖండ 2' వాయిదా పడటంతో ఇప్పుడు కొత్త డేట్ ఏది అనే దానిపై పెద్ద ఎత్తున లెక్కలు వేస్తున్నారు. నిర్మాతల ముందు ఎరోస్ తో ఉన్నదొక సమస్య అయితే అది సాల్వ్ అయిన తరువాత మళ్లీ రిలీజ్ డేట్ ను సెలెక్ట్ చేసుకోవడం మరో బిగ్ ఛాలెంజ్. ప్రధానంగా మూడు ఆప్షన్లు కనిపిస్తున్నాయి. అయితే ఇందులో ఏది ఎంచుకుంటే సినిమాకు, బయ్యర్లకు లాభం అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కేవలం సెలవులను చూసుకుంటే సరిపోదని, అసలు సమస్య వేరే ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
'అఖండ 2' వాయిదా పడటం అనేది కేవలం ఒక డేట్ మారడం మాత్రమే కాదు, సినిమా బిజినెస్ లెక్కలన్నింటినీ తలకిందులు చేసిన వ్యవహారం. ఇప్పుడు నిర్మాతలు కొత్త రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారంటే, వారు రెండు దారుల మధ్య నలిగిపోతున్నారు. ఒకటి భారీ ఓపెనింగ్స్ ఇచ్చే 'క్రిస్మస్', రెండు సేఫ్ గా గట్టెక్కించే 'డిసెంబర్ 12'. ఈ రెండింటిలో ఏది ఎంచుకుంటారు అనేదే ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ.
మామూలుగా అయితే ఏ స్టార్ హీరో అయినా పండగ డేట్ (డిసెంబర్ 25) కే ఓటు వేస్తారు. హాలిడేస్ ఉంటాయి, ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో వస్తాయి. కానీ ఇక్కడే ఒక పెద్ద 'సైకలాజికల్ లాక్' ఉంది. సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది. దీన్ని ఇలాగే ఉంచి మరో 20 రోజులు క్రిస్మస్ వరకు వెయిట్ చేస్తే, ఆడియెన్స్ లో ఆ వేడి తగ్గిపోతుంది. చల్లబడిన ఇనుమును మళ్ళీ వేడి చేయడానికి మళ్ళీ కోట్లు ఖర్చు పెట్టి ప్రమోషన్స్ చేయాలి. అది నిర్మాతలకు తలకు మించిన భారం.
మరోవైపు ఆర్థిక పరమైన కోణం చాలా కీలకం. ఈ సినిమాపై దాదాపు 100 కోట్లకు పైగా మార్కెట్ జరిగింది. బయ్యర్లు బయట నుంచి వడ్డీలకు తెచ్చి పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు క్రిస్మస్ వరకు ఆగడం అంటే, ఆ వడ్డీలు కొండలా పెరిగిపోతాయి. ఓపెనింగ్స్ ఎంత వచ్చినా, ఈ వడ్డీల భారం లాభాలను తినేస్తుంది. అందుకే బయ్యర్లు 'రికార్డులు' కంటే 'రికవరీ' వైపే మొగ్గు చూపుతున్నారు.
ఈ కోణంలో చూస్తే డిసెంబర్ 12 అనేది 'గోల్డెన్ డేట్' లా కనిపిస్తోంది. పండగ సెలవులు లేకపోవచ్చు కానీ, సినిమాకు 'లాంగ్ రన్' దొరుకుతుంది. మాస్ సినిమాలకు కావాల్సింది లాంగ్ రన్. డిసెంబర్ 12న వస్తే సంక్రాంతి వరకు దాదాపు నెల రోజులు థియేటర్లు ఖాళీగా ఉంటాయి. మెల్లగా పికప్ అయినా సేఫ్ అయిపోతారు. అదే 25న వస్తే, సంక్రాంతి సినిమాల తాకిడికి థియేటర్లు ఖాళీ చేయాల్సి వస్తుంది.
ఇక మధ్యలో ఉన్న డిసెంబర్ 19 ఆప్షన్ అనేది అటు ఇటు కాని పరిస్థితి. అటు లాంగ్ రన్ దొరకదు, ఇటు పండగ అడ్వాంటేజ్ పూర్తిగా ఉండదు. పైగా మిగతా సినిమాల రిలీజ్ లను డిస్టర్బ్ చేసినట్లు అవుతుంది. అందుకే ఇండస్ట్రీ వర్గాలు ఈ డేట్ ను పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు.