ట్రెండీ టాక్: టాలీవుడ్‌లో టాప్- 5 అఘోరాలు
ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా సమయంలో అఘోరా, అఘోరి లైవ్ మీడియాలో హల్చల్ సాగించిన వ్యవహారం తెలిసిందే.;
ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా సమయంలో అఘోరా, అఘోరి లైవ్ మీడియాలో హల్చల్ సాగించిన వ్యవహారం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ఇది బిగ్ డిబేట్ గా మారిన అంశం. ఇప్పుడు అఖండ 2లో నటసింహా నందమూరి బాలకృష్ణ అఘోరా పాత్రలో నటించడంతో దీనిపై మరోసార ఆసక్తికర చర్చ సాగుతోంది. బ్లాక్ బస్టర్ `అఖండ`లో ఎన్బీకే అఘోరగా ఎంట్రీ ఇవ్వగా అభిమానుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. ఇప్పుడు ఆ పాత్రకు కొనసాగింపుగా బోయపాటి అఖండ 2లో మరో లెవల్ చూపించబోతున్నారు. బాలయ్య బాబును అఘోరా పాత్రలో అద్భుతంగా చూపించారని కథనాలొస్తున్నాయి. అఖండ 2 రిలీజ్ అనూహ్యంగా వాయిదా పడకపోతే ఈపాటికే బాలయ్య అఘోరా పాత్ర విశ్వరూపం గురించి చర్చ సాగేది. కానీ దానికి ఇప్పుడు అవకాశం లేదు.
ఇదే సమయంలో టాలీవుడ్ లో అరడజను మంది స్టార్లు అఘోరా పాత్రల్లో నటించిన సంగతిని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, నాగబాబు, విశ్వక్ సేన్ లాంటి స్టార్లు గతంలో అఘోరా పాత్రలో తెరపై కనిపించారు. నటించింది కొద్ది సేపే అయినా ఎవరికి వారు తమదైన ముద్ర వేసారు. మెగాస్టార్ చిరంజీవి `శ్రీ మంజునాథ` చిత్రంలో కొద్దిసేపు కనిపించినా అఘోరాగా తనదైన నటనతో మెప్పించారు. అత్యంత కఠినమైన నియమ నిష్ఠలతో ఒంటరి జీవితంతో కనిపించే అఘోరా పాత్రను పోషించడం అంటే ఆషామాషీ కాదు. అఘోరాలు రెగ్యులర్ సమాజంలో ఇమడలేరు. వారు సహజంగా నరమాంస భక్షకులు అనే ప్రచారం ఉన్న నేపథ్యంలో ఈ పాత్రలో కనిపించే నటుడు ఆహారం కోసం ఏం చేస్తాడో చూడాలనే తపన ప్రేక్షకులకు ఉంటుంది.
అఘోర శక్తి యుక్తులపైనా భారీ అంచనాలుంటాయి. ఇప్పుడు బాలయ్య అన్ని అంచనాలకు తగ్గట్టు అఘోరా పాత్రలో మెప్పిస్తారని అంతా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఆయన త్రిశూలధారియై విజృంభించే సన్నివేశాల్ని కళ్లప్పగించి చూడాలని కూడా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక అగ్ర నటులు ఈ పాత్రలో నటించాలంటే వారి ఇమేజ్ ని సైతం పక్కన పెట్టాల్సి ఉంటుంది. శ్రీ మంజునాథ సినిమాలో కొన్ని నిమిషాల పాటు అఘోర పాత్రలో కనిపించిన చిరంజీవి తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నించారు. ఈ చిత్రంలో కీలక పాత్రధారి అయిన అర్జున్ కోసం నిలబడే అఘోరగా చిరు నటనకు మంచి గుర్తింపు దక్కింది.
కింగ్ నాగార్జున దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి రూపొందించిన `ఢమరుకం`లో అఘోర వేషధారణలో కనిపించారు. నాగార్జున లాంటి క్లాస్ యాక్టర్ కి ఇది పూర్తి విరుద్ధమైన పాత్ర. అయినా తనదైన శైలిలో నటించి మెప్పించారు. అలాగే మెగా బ్రదర్ నాగబాబు `అఘోర` అనే ఒక చిన్న సినిమాలో టైటిల్ పాత్రలో నటించి మెప్పించారు.
విక్టరీ వెంకటేష్ `నాగవల్లి` సినిమాలో అఘోర పాత్రలో మెరుపులా కనిపించారు. తమిళ స్టార్ హీరో ఆర్య గతంలో బాల తెరకెక్కించిన `నేను దేవుణ్ణి` సినిమాలో అఘోరగా నటించాడు. ఆర్య నటనకు క్రిటిక్స్ ప్రశంసలతో పాటు పురస్కారం లభించింది.
యంగ్ హీరో విశ్వక్ సేన్ గామి అనే చిత్రంలో అఘోరా పాత్రతో ఆకట్టుకున్నారు. మనోజ్ `అహం బ్రహ్మాస్మి` సినిమాలో అఘోరగా కనిపిస్తారని కథనాలొచ్చాయి. శ్రీకాంత్ అనే డెబ్యూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రోజా పూలు ఫేం శ్రీకాంత్ `సౌకార్‌పెట్టై` అనే తమిళ చిత్రంలో అఘోరగా నటించాడు. ఈ పాత్ర కోసం అతడు ఏకంగా హిమాలయాలకు వెళ్లి అఘోరాలను కలిసి వారి ఆహార్యం గురించి తెలుసుకున్నారు. టాలీవుడ్ లో విలన్ పాత్రలతో మెప్పించిన సోనూ సూద్ `అరుంధతి` సినిమాలో అఘోరాధిపతి పశుపతిగా అద్భుత నటనతో రక్తి కట్టించారు. సోను సూద్ నటనను, అతడి పాత్ర సంభాషణల్ని కూడా తెలుగు ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోలేరు.
అందుకే ఇప్పుడు `అఖండ 2`లో ఎన్బీకే అఘోరాగా ఎలా కనిపించబోతున్నారు? అనేది చర్చగా మారింది. బాలయ్య బాబు నట విశ్వరూపాన్ని, యాక్షన్ ని చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.