శర్వాతో మొదలైంది..దీన్ని కాపాడుకుంటారా?
దీని తరువాత ఈ సంస్థ ఐదు సినిమాలు నిర్మించింది. అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా సక్సెస్‌ని అందించలేదు సరికదా లాభాల్ని కూడా అందించలేకపోయాయి.;
టాలీవుడ్‌లో ఎవరికి ఎప్పుడు విజయం వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. టైమ్, అదృష్టం కలిసి వస్తే తప్ప ఇక్కడ సక్సెస్‌లు రావు. ఓ నటుడికి ఎంత టాలెంట్ ఉన్నా.. డైరెక్టర్‌కి ఎంత విజన్ ఉన్నా.. ప్రొడ్యూసర్‌కు ఎంత ఖర్చు పెట్టగల సత్తా ఉన్నా టైమ్, అదృష్టం..దానికి తగ్గ స్టోరీ కుదిరితే తప్ప హిట్టు పడదు. అలా పడిందా? దాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్లడం మరో టాస్క్. ఇండస్ట్రీలో ఈ టాస్క్‌ని కొంత మంది నిర్మాతలు మాత్రమే విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. వరుస హిట్‌లని తమ ఖాతాలో వేసుకుంటున్నారు.
కొంత మంది మాత్రం వరుస ఫ్లాపుల్ని ఎదుర్కొంటూ పీకల్లోతు నష్టాలని చవి చూస్తున్నారు. గత కొంత కాలంగా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటూ వస్తోంది ఏకే ఎంటర్ టైన్‌మెంట్స్ సంస్థ. దాదాపు ఐదేళ్ల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన `సరిలేరు నీకెవ్వరు`మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. 2020 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద మహేష్ సినిమాల్లో అత్యధిక వసూళ్లని రాబట్టింది.
దీని తరువాత ఈ సంస్థ ఐదు సినిమాలు నిర్మించింది. అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా సక్సెస్‌ని అందించలేదు సరికదా లాభాల్ని కూడా అందించలేకపోయాయి. సిద్ధార్ధ్, శర్వానంద్‌ల కలయికలో చేసిన `మహా సముద్రం` ఫ్లాప్ అనిపించుకుని నష్టాలని తెచ్చి పెట్టింది. ఇక అఖిల్‌తో చేసిన `ఏజెంట్` గురించి ఎంత చెప్పినా తక్కువే. వండిన కథ ఒకటి తీసిని సినిమా ఒకటి అన్నట్టుగా మారింది ఈ సినిమా పరిస్థితి. మమ్ముట్టిని కీలక పాత్ర కోసం తీసుకొచ్చి ఆయనని డమ్మీని చేశారు.
దీంతో కథ మొత్తం కంగాలీగా మారి అఖిల్ కెరీర్‌లోనే అత్యంత భారీ డిజాస్టర్ మూవీగా నిలిచి షాక్ ఇచ్చింది. రూ.85 కోట్లు పెట్టి తీస్తే దీనికి కేవలం రూ.13 కోట్లు మాత్రమే వచ్చాయంటే `ఏజెంట్` ఏ స్థాయి డిజాస్టరో అర్థం చేసుకోవచ్చు. ఆ తరువాత `వేదాళం` రీమేక్ ఆధారంగా చిరంజీవితో చేసిన `భోళా శంకర్` పరిస్థితి మరీ దారుణం. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిందో అన్నట్టుగా వెళ్లింది. బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అనిపించుకుని షాక్ ఇచ్చింది. కోట్లు కుమ్మరించి చేస్తే ఈ సినిమాకు వచ్చింది అందులో సగం. అంతగా ఈ మూవీ మేకర్స్‌కు షాక్ ఇచ్చింది. కోలుకోలేని దెబ్బకొట్టింది.
బ్యాక్ టు బ్యాక్ ఏజెంట్, భోళా శంకర్ వంటి ఎదురు దెబ్బలు తగలడంతో ఈ సంస్థ మళ్లీ కోలుకోవడం కష్టమనే కామెంట్‌లు వినిపించాయి. ఇదే సమయంలో ఏకే ఎంటర్ టైన్‌మెంట్స్ రెట్టించిన ఉత్సాహంతో శర్వానంద్‌తో చేసిన ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా `నారీ నారీ నడుమ మురారీ`. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుని భారీ విజయం దిశగా పయనిస్తోంది. దాదాపు ఐదేళ్ల విరామం తరువాత ఏకే సంస్థకు లభించిన విజయమిది. ఈ మూవీ అందించిన సక్సెస్‌తో ఈ సంస్థ మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేసింది. అయితే ఇదే పంథాని కొనసాగిస్తూ మరిన్ని విజయాల్ని తన ఖాతాలో వేసుకుంటుందా? పక్క వారి సలహాలు పాటిస్తూ మళ్లీ ట్రాక్ తప్పి ఫ్లాపులని ఎదుర్కొంటుందా? అని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి ఏకే వారు శర్వాతో మొదలైన సక్సెస్‌ని కాపాడుకుంటారా? లేదా అన్నది వేచి చూడాల్సిందే.